చంద్రబాబు ఇంటిపై దండయాత్ర!

ABN , First Publish Date - 2021-09-18T07:48:22+05:30 IST

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిని, మంత్రులను దూషించారని... ఇం దుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే వింత డిమాండ్‌తో ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ‘దండయాత్ర’కు దిగారు.

చంద్రబాబు ఇంటిపై దండయాత్ర!

ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ఆధ్వర్యంలో రచ్చ.. రచ్చ..

అయ్యన్న వ్యాఖ్యలకు నిరసన పేరుతో అరాచకం

15 వాహనాల్లో బాబు నివాసం వద్దకు

అడ్డుకున్న వెంకన్న తదితరులను తోసి..

బారికేడ్‌ దిమ్మను కూల్చి ముందుకు

ప్రతిఘటించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

వారిపైకి జెండా కర్రలతో వైసీపీ దాడి

నీళ్ల బాటిళ్లు, చెప్పులతో తమ్ముళ్ల జవాబు

రాళ్లతో విరుచుకుపడిన ‘అధికార’ శ్రేణులు

అరగంట తర్వాత అదనపు బలగాలు

వచ్చీరాగానే టీడీపీ శ్రేణులపై లాఠీ చార్జీ

నేతలకు, మీడియా వారికీ దెబ్బలు

లాఠీచార్జీ సమయంలోనే జోగి ప్రసంగం

ఆ తర్వాత తీరిగ్గా ఎమ్మెల్యే తరలింపు

పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం


వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా టీడీపీ అధ్యక్షుడు, విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు నివాసంపైనే దాడికి ప్రయత్నించారు. దీనికి కృష్ణా జిల్లా  పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ స్వయంగా నేతృత్వం వహించారు. ‘నిరసన’ పేరుతో నానా రచ్చ చేశారు. అడ్డుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై జెండా కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఇటు టీడీపీ నేతలూ వారిని గట్టిగా ప్రతిఘటించారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద సుమారు గంటన్నరపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 


అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిని, మంత్రులను దూషించారని... ఇం దుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే వింత డిమాండ్‌తో ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ‘దండయాత్ర’కు దిగారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 15 వాహనాల్లో అనుచరగణాన్ని తీసుకుని కరకట్ట దారిలో ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. తమతోపాటు పార్టీ జెండాలు కట్టుకొని కర్రలు కూడా తెచ్చుకొన్నారు. ఆ సమయానికి చంద్రబాబు తన నివాసంలోనే ఉన్నారు. జోగి రమేశ్‌ అక్కడికి వస్తున్న విషయం తెలుసుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కొందరు టీడీపీ నేతలు కొద్దిసేపటి ముందుగా అక్కడకు చేరుకొన్నారు. ‘ముట్టడి’ వంటి పిలుపులు ఉన్నప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండి... ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడమో, లేక దూరంగా ఉండగానే నిలిపివేయడమో చేస్తారని భావించారు. ‘ఇక్కడిదాకా  రారులే’ అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ... వీరి అంచనాలకు భిన్నంగా ఎమ్మెల్యే తన వాహన శ్రేణితో సహా చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి దారిలో మొదటి గేటు వద్ద జోగి రమేశ్‌  వాహనాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆపారు. ఇలా రావడం మంచిది కాదని నచ్చచెప్పారు. కానీ... జోగి రమేశ్‌, ఆయన అనుచరులు వెంకన్నను నెట్టివేసి తోసుకొని ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు.


ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌ రావు, ఏలూరి సాంబశివరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు, పార్టీ అధికార ప్రతినిధులు కొమ్మారెడ్డి పట్టాభిరాం,  మహ్మద్‌ రఫీ,  నాగుల్‌ మీరా తదితరులు వారిని అడ్డుకొని వెనక్కు నెట్టారు. అయినా... జోగి, ఆయన అనుచరులు వెనక్కి తగ్గలేదు. అక్కడ ఉన్న బారికేడ్‌కు సంబంధించిన అడ్డుగోడను కూలగొట్టారు. కిందకు జారిన బారికేడ్‌పై నుంచి దూకి చంద్రబాబు ఇంటి వైపు కదిలారు. వారిని టీడీపీ నేతలు, కార్యకర్తలు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు తమతో  తెచ్చిన కర్రలతో దాడికి దిగి కొందరిని కొట్టారు. దీనిని ప్రతిఘటిస్తూ టీడీపీ కార్యకర్తలు నీళ్ల సీసాలు, చెప్పులు విసిరారు. ఎమ్మెల్యే అనుచరులు రోడ్డు పక్కన ఉన్న రాళ్లు తీసుకుని విసిరారు. రాళ్ల దాడిలో టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి డూండీ రాకేశ్‌, మంగళగిరి టీడీపీ నేత జంగాల సాంబశివరావు తదితరులకు దెబ్బలు తగిలాయి. ఈ-టీవీ కెమెరామెన్‌ నాగరాజుకు రాయి దెబ్బ తగలడంతో కూలబడిపోయారు. పరిస్థితి శ్రుతిమించడంతో  టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్లు విసరడం ప్రారంభించారు. రాళ్లు తగిలి బారికేడ్‌ సమీపంలో నిలిపి ఉంచిన వైసీపీ ఎమ్మెల్యే కారు అద్దాలు పగిలాయి. 


టీడీపీ శ్రేణులపైకే లాఠీ...

గొడవ మొదలైన దాదాపు అరగంట తర్వాత అదనపు పోలీసు బలగాలు అక్కడకు చేరుకొన్నాయి. వైసీపీ శ్రేణులను వదిలి... టీడీపీ కార్యకర్తలపైనే లాఠీలు ఝళిపించారు. వారిని చంద్రబాబు ఇంటి సమీపానికి తరిమారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నాగుల్‌ మీరా సహా అనేక మంది టీడీపీ నేతలకు, మీడియా ప్రతినిధులకు లాఠీ దెబ్బలు తగిలాయి.  కార్యకర్తలు పరుగులు తీస్తున్న సమయంలో వారి మధ్యలో ఉన్న బుద్దా వెంకన్న రోడ్డుపై వెల్లకిలా పడిపోయారు. ఆయన తలకు దెబ్బ తగిలిందేమోనని కార్యకర్తలు కంగారు పడ్డారు. ఆయనను పక్కనే చెట్టు కింద కొంతసేపు పడుకోబెట్టారు. ఒక పక్క పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తున్న సమయంలోనే జోగి రమేశ్‌ ఎంచక్కా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. మీడియాతో మాట్లాడటం పూర్తయిన తర్వాతే పోలీసులు ఆయనను, ఆయన అనుచరులను వారి వాహనాల్లోనే మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గంటన్నరపాటు చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత రాజ్యమేలింది. పరస్పర నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. టీడీపీ శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు... వైసీపీ జెండాలకు మాత్రం పూర్తి భద్రత కల్పించారు. వైసీపీ కార్యకర్తల వద్ద ఉన్న జెండాలను లాక్కొన్న టీడీపీ కార్యకర్తలు వాటిని రోడ్డుపై కుప్పగా పోసి తగలబెట్టాలని ప్రయత్నించారు.  పోలీసులు అడ్డుకొని జెండాలు లాక్కొన్నారు. 


ఇదే మొదటిసారి...

రాజధాని అమరావతి కిందకు వచ్చే ప్రాంతంలో రాష్ట్ర సచివాలయానికి వెళ్లే దారిలో కృష్ణా నది ఒడ్డున చంద్రబాబు నివాసం ఉంది. హైదరాబాద్‌లోగానీ,  అమరావతిలోగానీ ఎప్పుడూ ఆయన నివాసంపై దాడికి ప్రయత్నాలు జరగలేదు. రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్నప్పుడూ, తెలంగాణ ఉద్యమం వేడిగా ఉన్న సమయంలోనూ జరగలేదు. ఇప్పుడు వైసీపీ నుంచి ఇలా జరగడం... పోలీసులు చూస్తూ ఊరుకొని సహకరించడం విస్మయానికి గురి చేస్తోంది.


అప్రమత్తమైన ఎన్‌ఎస్‌జీ కమెండోలు

చంద్రబాబు నివాసం వద్దకు వైసీపీ కార్యకర్తలు రాగానే ఆయన భద్రతకు నియమితులైన ఎన్‌ఎస్‌జీ కమెండోలు అప్రమత్తమయ్యారు. వారు లోపలికి చొరబడే అవకాశం ఉందా... వచ్చిన వారి ఆలోచన ఏమై ఉంటుందని చంద్రబాబు వ్యక్తిగత భద్రతాధికారితో చర్చించారు. ఆయుధాలు బయటకు తీసి అప్రమత్తంగా నిలబడటంతో అక్కడ కొంతసేపు ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. 


బాబు తిట్టించారు

‘‘అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారు. ఆయనతో తిట్టించినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసేందుకే ఇక్కడికి వచ్చాను. నేను శాంతియుతంగానే వచ్చాను. కానీ... టీడీపీ వాళ్లే దాడి చేశారు!’’

- జోగి రమేశ్‌ (చంద్రబాబు నివాసం వద్ద మీడియాతో)


ఎక్కడికక్కడ అడ్డుకుని... 

చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే దాడికి వచ్చారన్న సమాచారం తెలిసి... సమీప గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు అక్కడకు వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని  పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఉండవల్లి గుహల వద్ద ఉన్న దారిలో రావడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో జోగి రమేశ్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఒక  కారు అటుగా వచ్చింది. ఉద్రేకానికి లోనైన బ్రహ్మం ఆ కారుపై రాయితో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. పోలీసులు ఆ కారును పంపించివేశారు. కొందరు టీడీపీ నేతలు తమ వాహనాలు రోడ్డు పక్కన నిలిపివేసి పొలాల్లో నుంచి అడ్డదారిలో బాబు నివాసం వద్దకు చేరుకొన్నారు. ఆయనను కలిసి దాడి సంఘటనపై చర్చించారు. పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు కూడా ఆ సమయంలో అక్కడకు వచ్చారు. ఏం ఫర్వాలేదని, ఇటువంటి దాడులను ధైర్యంగా ఎదుర్కొందామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. రాళ్ల దాడి, లాఠీచార్జిలో గాయపడిన వారిని పరామర్శించారు.  ఆ తర్వాత తమ నేతలతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగింది. 


దండయాత్రకు రైట్‌రైట్‌

విపక్ష నేతలు నిరసనలకు పిలుపునివ్వగానే పోలీసులు ఎక్కడికక్కడ వారిని గృహ నిర్బంధాలు చేసేస్తున్నారు. కానీ... ‘బాబు ఇంటిని ముట్టడిస్తాం’ అని ముందుగానే ప్రకటించిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ వాహన శ్రేణిని మాత్రం ఎంచక్కా అనుమతించారు. సుమారు 15 వాహనాలు కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్తున్నప్పటికీ పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఆ సమమయంలో అక్కడ సాధారణంగా ఉండే కొద్దిమంది పోలీసులు మినహా అదనంగా ఎవరూ లేరు. చంద్రబాబు వ్యక్తిగత భద్రతాధికారి స్థానిక పోలీసులకు కొద్దిగా ముందు ఈ దాడి ప్రయత్నంపై సమాచారం ఇచ్చినా అరగంట వరకూ అదనపు బలగాలు రాలేదు. ఈ వ్యవధిలోనే ఎమ్మెల్యే అనుచరులు అక్కడ బీభత్సం సృష్టించారు. 









Updated Date - 2021-09-18T07:48:22+05:30 IST