పెద్దిరెడ్డికి తిరుపతిలో ఏం పని?: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-17T19:13:19+05:30 IST

తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు.

పెద్దిరెడ్డికి తిరుపతిలో ఏం పని?: చంద్రబాబు

తిరుపతి: తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..  తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. ఉప ఎన్నిక పోలింగ్‌ రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల సాయంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఉన్న ఆధారాలను పరిశీలించి మిగతా చోట్ల రీపోలింగ్‌ పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు  తిరుపతి ఉపఎన్నికకు  వందల బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సరిహద్దులు మూసివేసి తనిఖీలు చేసి పంపాల్సిందని.. ఎందుకు చెక్‌పోస్టులను ఎత్తివేశారు? అని నిలదీశారు. తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో వేల మందిని ఉంచితే.. పోలీసులు నిద్రపోతున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ నేత శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారన్నారు.  దొంగ ఓటర్లను పట్టిస్తే టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. బందిపోట్లను మైమరిపించేలా వైసీపీ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. తండ్రి పేరు చెప్పలేని వాళ్లు దొంగ ఓటర్లు కాక మరేంటి? అని  ప్రశ్నించారు. మంత్రులు బరితెగించి తిరుపతిలో ఉంటే.. అధికార పార్టీకి ఊడిగం చేస్తామన్నట్లు పోలీసుల తీరుందని చంద్రబాబు మండిపడ్డారు.


వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. వైసీపీ మాఫియా చేతిలో ప్రజాస్వామ్యం బలైపోవాలా? అని చంద్రబాబు నిలదీశారు.  ఎక్కడి నుంచో ముఠాలను దించి తిరుపతిపై దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కై అరాచకాలు చేశారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఏం పని?.. ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు.. వైసీపీ మరో వైపు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని చెప్పారు. ఎన్నికల కమిషన్‌  పంపిన మైక్రో అబ్జర్వర్లు ఏమయ్యారు? అని  చంద్రబాబు ప్రశ్నించారు.  ఇలానే వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2021-04-17T19:13:19+05:30 IST