క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ!

ABN , First Publish Date - 2022-05-07T08:07:53+05:30 IST

వైసీపీ అరాచక పాలన అంతానికి మరో ప్రజా ఉద్యమం రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.

క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ!

అరాచక పాలన అంతానికి ప్రజా ఉద్యమం

టీడీపీ నాయకత్వం వహిస్తుంది.. జనం కలిసి రావాలి

బాదుడే బాదుడుకు వైసీపీ వర్గీయులూ బాధితులే

రాష్ట్ర పునర్నిర్మాణానికి వారూ సహకరించాలి

క్షమించరాని తప్పులు చేస్తున్న సీఎం జగన్‌

ఆయన వల్ల అందరం మునిగిపోయాం

ఇక ప్రజలు రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందే

ఊరికో సైకో, రౌడీలను తయారుచేశారు: చంద్రబాబు

ఈ సీఎంను గద్దెదించేదాకా పోరాటం

చంద్రబాబు ప్రతిజ్ఞ.. కాకినాడ జిల్లాలో విస్తృత పర్యటన


కాకినాడ, మే 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అరాచక పాలన అంతానికి మరో ప్రజా ఉద్యమం రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని వైసీపీ వర్గీయులను సైతం కోరారు. ఈ ప్రజా ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుందన్నారు. ‘క్విట్‌ జగన్‌... సేవ్‌ ఏపీ’ అని నినదించారు. శుక్రవారం చంద్రబాబు కాకినాడ జిల్లాలో పర్యటించారు. తొలుత అన్నవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కత్తిపూడి, గొల్లప్రోలు, కాకినాడ, పగడాలపేటలో రోడ్‌షో నిర్వహించారు. తాళ్లరేవులో ‘రచ్చబండ’తోపాటు అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.


‘‘వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలి. ఇందుకోసం ప్రజా ఉద్యమం రావాలి. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ పోరాటంలో జైలుకు వెళ్లడానికీ భయపడేది లేదు. సీఎం జగన్‌ పన్నుల బాదుడుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి మా వంతు పాత్ర పోషిస్తున్నాం. అలాగే... వైసీపీ వర్గీయులు కూడా ముందుకు రావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌ పరిపాలనా వైఫల్యంపై నిప్పులు చెరిగారు. ‘‘సీఎం జగన్‌ కరుగట్టిన నేరస్థుడు.  నాటకాల ముఖ్యమంత్రి. ఆయన వల్ల అందరం మునిగిపోయాం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఓటూ పడదు. బాబాయిని హత్య చేయించిన వ్యక్తి సీఎంగా ఉండాలా? వైసీపీ పాలనలో ఊరికో రౌడీ, సైకో తయారయ్యాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వీరందరికీ బదులిస్తాం’’ అని హెచ్చరించారు. ‘క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ’ నినాదంతో   జగన్‌ పరిపాలనకు అంతం పలకాలని ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సీఎంను సాగనంపేదాకా పోరాటం సాగుతుందని ప్రకటించారు.


చేసిన కష్టం బూడిదపాలు...

తనకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని... రాష్ట్రం కోసమే కష్టపడ్డానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘2029 నాటికి నవ్యాంధ్రను అభివృద్ధిలో ప్రపంచ పటంలో నిలపాలని భావించాను. అందుకు బాటలు వేశాను. కానీ... ఆ కష్టాన్నంతా జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. గంజాయి, డ్రగ్స్‌ విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు.  రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు జగన్‌ కంకణం కట్టుకున్నారు. నా రాజకీయ జీవితంలో చాలామంది నాయకులను చూశా. కానీ, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఏ నాయకుడైనా ప్రతిపక్షం సలహాలు తీసుకుని పాలన సాగించాలి. కానీ... జగన్‌ గౌరవ సభగా ఉండాల్సిన శాసనసభను కౌరవ సభగా మార్చేశారు. అందుకే మళ్లీ సభకు గౌరవం కలిగించినప్పుడే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని శపథం చేసి వచ్చాను’’ అని తెలిపారు. అసలు రాష్ట్రం ఏమైపోతోంది.... ఎప్పుడైనా ఇన్ని అరాచకాలు జరిగాయా అని ప్రశ్నించారు. ‘‘మా పాలనలో రౌడీలనే వారిని లేకుండా చేశాం. ఇప్పుడు ఊరికో రౌడీ, సైకోను తయారు చేశారు. సైకోలందరికీ ఇదే నా హెచ్చరిక. మిమ్మల్ని జగన్‌ కూడా కాపాడలేడు’’ అని సూటిగా చెప్పారు. ఏప్రిల్‌లో 31 అత్యాచార ఘటనలు జరిగాయని చెప్పారు. వీటిని నియంత్రించలేని జగన్‌ సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఆయనకు అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. దమ్ముంటే పోలీసులను పక్కన పెట్టి జగన్‌ ప్రజల్లోకి రావాలని సవాల్‌ విసిరారు.


మూడు రాజధానులా?

పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని జగన్‌... మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బాదుడే బాదుడు కొనసాగుతోందని మండిపడ్డారు. ‘‘ఈ తొమ్మిది నెలల్లో ఒక్క పెట్రోలుపైనే రూ.11 వేల కోట్లు బాదేశారు. ప్రజల ఇళ్లకు కరెంటు లేనప్పటికీ 40 శాతం మేర విద్యుత్‌ చార్జీలను పెంచారు. జనవరిలో చెల్లించాల్సిన ‘అమ్మ ఒడి’ని జూన్‌కు మార్చారు. విద్యార్థుల సంఖ్యలో కోత పెట్టారు. నాన్న బుడ్డిని మాత్రం అలాగే ఉంచారు. మేం పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశాం. ఈ ప్రభుత్వం లేనిపోని లిటిగేషన్లు సృష్టించింది’’ అని విమర్శించారు.


ఒక్క ఓటు కూడా పడదు...

‘‘టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఆక్వా రైతుల వరకు అందరినీ జగన్‌ ఇబ్బంది పెడుతున్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఓటీఎస్‌, గ్రంథాలయ పన్ను, హోర్డింగ్‌ల పన్ను, వీధిలైట్ల పన్నులు పెంచారు. వంటనూనెల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు జగన్‌ అడ్డంగా పెంచేశారు. చివరకు మరుగుదొడ్లపైనా పన్ను వేశారు. బాదుడే బాదుడు అన్నట్టు ఇంతలా జనాన్ని బాదేస్తున్నారు. జగన్‌ వల్ల అందరం మునిగిపోయాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులు మరో రెండేళ్లలో 11 లక్షల కోట్లకు చేరుతాయని... రాష్ట్రం నుంచి పారిపోతే తప్ప వీటి నుంచి జనం తప్పించుకోలేరని తెలిపారు. మళ్లీ జగన్‌ వస్తే ఏపీ నుంచి పారిపోతామని ఇప్పటికే చాలామంది చెబుతున్నారన్నారు.


జగన్‌ క్షమించరాని తప్పులు చేస్తున్నారు. ఇదే కొనసాగితే ప్రజలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి వస్తుంది. భవిష్యత్‌ పరిణామాలు ఊహించే... ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తున్నాం. జగన్‌ బాదుడుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే రాష్ట్ర పునర్నిర్మాణంలో వీళ్లు కూడా తమవంతు పాత్ర పోషించాలి.


ఇటీవల జరిగిన మూడు అత్యాచార సంఘటనల విషయంలో హోంమంత్రి వ్యాఖ్యలు చూస్తే బాధేసింది. తల్లుల పెంపకం బాగా లేదని సజ్జల రాసిచ్చిన స్ర్కిప్ట్‌ చదువుతున్నారు. ఇక సీఎం జగన్‌ కథే వేరు. పశ్చిమ గోదావరిలో కల్తీ సారాతో చనిపోతే సహజ మరణాలని అన్నారు. ఆయన నుంచి ఇంతకు మించి ఆశించలేం. 


కోడికత్తి డ్రామాలు, బాబాయి హత్య మీరు చేయగలరా? జగన్‌ చేయగలరు. బాబాయ్‌ గొడ్డలిపోటు మరణాన్ని గుండెపోటుగా ప్రచారం చేశారు. ఆరోజు నాపై నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారు. ఇప్పుడేమైంది? జగనన్న రక్త చరిత్రగా మారింది! మీ చెల్లెలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి! సోదరి తరఫున కాకుండా నిందితుల తరఫున ఎందుకు వకాల్తా  పుచ్చుకుంటున్నావు?

జగన్‌కు గురువులంటే గౌరవం లేదు. వారిని బ్రాందీ షాపుల ముందు నిలబెట్టారు. ఉపాధ్యాయులపై కక్ష కట్టి... వేసవి సెలవుల్లో పని లేకపోయినప్పటికీ స్కూళ్లకు రమ్మంటున్నారు. ఉద్యోగులకు సరైన పీఆర్సీ ఇవ్వలేదు. ఒకప్పుడు పోలీసు శాఖ రౌడీల గుండెల్లో నిద్రపోయేది. ఇప్పుడు... పోలీసులే భయపడుతున్నారు. జీతాలూ ఇవ్వడంలేదు. గట్టిగా అడిగితే వీఆర్‌లోకి పంపిస్తారని భయపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖను, విద్యా శాఖను ప్రభుత్వం మూసేసింది. పోలవరం, అమరావతిని రెండుకళ్లుగా భావించాం. వాటిని జగన్‌ సర్కారు పొడిచేసింది. 

- చంద్రబాబు

అంతటా వైఫల్యమే...

జగన్‌కు పరిపాలన చేతకాదని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘బీసీలు, మైనారిటీలు, బ్రాహ్మణులతోపాటు అన్ని వర్గాల పథకాలను ఆపేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. విద్యుత్‌ కంపెనీలకు బిల్లులు ఇవ్వలేక... దివాలా తీశామని చెప్పేశారు. ఆస్పత్రుల్లో మందులు ఉండటం లేదు. డబ్బులిస్తేనే అంబులెన్స్‌లు వస్తాయి. ఇలా అన్నిరకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలను ఇబ్బందిపెడితే రక్షించడానికి టీడీపీ వచ్చి తీరుతుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more