దిశా చట్టంలో ఎంతమంది మృగాళ్లను శిక్షించారు? ‌: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-08-17T01:48:22+05:30 IST

దిశా చట్టంలో ఎంతమంది మృగాళ్లను శిక్షించారు? అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

దిశా చట్టంలో ఎంతమంది మృగాళ్లను శిక్షించారు? ‌: చంద్రబాబు

అమరావతి‌: దిశా చట్టంలో ఎంతమంది మృగాళ్లను శిక్షించారు? అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ వేళ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో పట్టపగలు నడిరోడ్డుపై దళిత యువతిని దారుణంగా హతమార్చారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి అని నిలదీశారు. నేరస్తుడు రాజ్యమేలితే నేరగాళ్లు ఎలా పేట్రేగిపోతారో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్ష్యంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలే  లక్ష్యంగా రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రికి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చీకటి జీవోలు ఇచ్చుకుంటూ, అవినీతి నోట్ల కట్టలు లెక్కపెట్టడంపై ఉన్న శ్రద్ధ మహిళలను రక్షించడంలో లేకపోవడం సిగ్గుచేటన్నారు.


 ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారని చెప్పారు. ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారన్నారు. నిందితులకు వైసీపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి శిక్షించడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చూస్తున్నామని దుయ్యబట్టారు. రెండేళ్లలో మహిళల భద్రత కోసం గాలి మాటలు, గాలికబుర్లు మినహా ఈ గాలి ముఖ్యమంత్రి చేసింది ఏమిలేదన్నారు. మహిళలపై 500కి పైగా జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు వైసీపీ అసమర్థ పాలనకు అద్దం పడుతోందని చంద్రబాబు అన్నారు. అన్యాయంగా బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల కడుపుకోత,  మృగాళ్ల చేతిలో అన్యాయానికి గురైన మహిళల ఘోష ముఖ్యమంత్రికి వినపడటం లేదా? అని చంద్రబాబు  ప్రశ్నించారు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేరని ఆందోళన వ్యక్తం చేశారు.  పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నియంత్రృత్వ పాలన కొనసాగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 


ఆంధ్రప్రదేశ్‌లో దళితులు, మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలపై అమెరికా మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేయటం వైసీపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను దిశా స్టేషన్లుగా మార్చి ప్రచారార్బాటం చేశారన్నారు.గోడకు కొట్టిన బంతిలా కేంద్రం దగ్గర నుంచి దిశా బిల్లు తిరిగొచ్చిందన్నారు. దిశా పోలీసులు జాడ లేదన్నారు. ముఖ్యమంత్రి ఇంటి వెనుక అత్యాచారం జరిగితే ఇంతవరకూ నిందితులను పట్టుకోలేదని చెప్పారు. షాడోల చేతిలో డీజీపీ, మహిళా హోంమంత్రులను డమ్మీలుగా మార్చారని ధ్వజమెత్తారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తే తెలుగుదేశం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.  బాధిత మహిళలకు టీడీపీ అండగా పోరాటం చేస్తోందన్నారు. హత్యకు గురైన రమ్య కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-08-17T01:48:22+05:30 IST