టెండర్‌లో ఆ నిబంధన పెట్టడం సిగ్గుచేటు: Chandrababu

ABN , First Publish Date - 2022-06-03T16:19:13+05:30 IST

జగన్ సర్కార్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని చంద్రబాబు అన్నారు.

టెండర్‌లో ఆ నిబంధన పెట్టడం సిగ్గుచేటు: Chandrababu

Amaravathi: జగన్ (Jagan) సర్కార్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లకూడదని టెండర్‌లో నిబంధన పెట్టడం సిగ్గుచేటన్నారు.  ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉందని, దీనికి ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్‌లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్‌లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్రం పరువు తీశాయన్నారు. కాంట్రాక్టర్లు చేసిన పనిలో బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోను లేదన్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదనే నిబంధన పెట్టే హక్కు అసలు జగన్ ప్రభుత్వానికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 


రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణం అయ్యారని ఆరోపించారు. 13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్‌లు, స్టీల్ ప్లాంట్లు నిర్మిస్తుందా?.. మూడు రాజధానుల కడుతుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Updated Date - 2022-06-03T16:19:13+05:30 IST