ముగిసిన చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్

ABN , First Publish Date - 2020-08-05T22:39:24+05:30 IST

అమరావతిని రాజధానిగా ఉంచుతామని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నందుకు..

ముగిసిన చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్

అమరావతి: అమరావతిని రాజధానిగా ఉంచుతామని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నందుకు అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజాభిప్రాయం కోరాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొంతమంది నేతలు మాత్రం అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే లేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పిన మాటలకు ఏం సమాధానం చెబుతారన్నదానిపై వైసీపీ నుంచి స్పష్టత రాలేదు. చంద్రబాబు సవాల్‌పై వైసీపీ సైలెంట్‌గా ఉంది.


అమరావతి రాజధానిపై ప్రజా రిఫరెండం కోరాలని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని అందుకు 48 గంటలు సమయమిస్తున్నానని తన డిమాండ్‌పై స్పందించాలని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అమరావతి రాజధానిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, మూడు రాజధానులని వైసీపీ ప్రకటించిందని అందువల్ల మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరాలని, ఒకవేళ ఎన్నికల్లో వైసీపీ పూర్తి మెజారిటీతో గెలిస్తే తాము మూడు రాజధానులపై మాట్లాడబోమని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తామని చెప్పి చంద్రబాబు అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ 48 గంటల లోపు స్పందించి ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. 


అయితే వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబే రాజీనామా చేయాలని, ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలన్నారు. తాము మూడు రాజధానులు కావాలని కోరుతున్నామని, అమరావతిని కోరుకున్నవాళ్లే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పి కొట్టారు. కాగా చంద్రబాబు ఇచ్చిన 48 గంటల గడువు బుధవారం సాయంత్రంతో ముగియడంతో ఆయన మళ్లీ మీడియా ముందుకు వస్తానని ప్రకటించారు.

Updated Date - 2020-08-05T22:39:24+05:30 IST