Chandrababu: ప్రధాని మోదీ ఎన్నో విషయాల్లో ముందున్నారు..

ABN , First Publish Date - 2022-08-15T17:17:49+05:30 IST

పరదేశి పాలనలో దేశం దోపిడీకి గురైందని, ప్రజలు బానిసత్వంలో మగ్గారని చంద్రబాబు అన్నారు.

Chandrababu: ప్రధాని మోదీ ఎన్నో విషయాల్లో ముందున్నారు..

గుంటూరు (Guntur): పరదేశి పాలనలో దేశం దోపిడీకి గురైందని, ప్రజలు బానిసత్వంలో మగ్గారని, విదేశీ పాలనలో పేదరికం, కరవు కాటకాలు అనుభవించారని టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా, చేబ్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సభ (Azadi Ka Amrit Mahotsava Sabha) జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ నెహ్రూ (Nehru) నుంచి పీవీ నరసింహారావు (PV Narasimharao), వాజ్ పేయి (Vajpayee) వంటి వారు దేశం కోసం ఎన్నో పనులు చేశారని కొనియాడారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఎన్నో విషయాల్లో ముందున్నారని, ప్రపంచంలో మేటైన మేధావులు ఉండే దేశం మనదని, పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు మన దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేశాయన్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావుని కూడా స్మరించుకోవాలన్నారు. పేద ప్రజలకు మేలు చేయటం కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు.


స్వాతంత్య్రం నుంచి దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, హరిత విప్లవం, పాల విప్లవం వచ్చాయని చంద్రబాబు అన్నారు. కరోనాను లెక్క చేయకుండా దేశానికి అన్నం పెట్టడానికి శ్రమించిన రైతులను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. దేశ సమైక్యత విషయంలో టీడీపీ ఎప్పుడు ముందుంటుందని, టెలీ కమ్యూనికేషన్ రంగంలో మార్పులకు టీడీపీ నాంది పలికిందన్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణానికి కృషి చేశామని, మనం చేసిన కృషి కారణంగా ఐటి రంగం అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు అదే వెన్నెముకగా మారిందన్నారు. ఒకనాడు పేదరికంలో మగ్గిన దేశం.. నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి వచ్చిందని, రక్షణ రంగంలో ఎంతో పురోభివృద్ధి సాధించామన్నారు. సొంతగా ఆయుధాలు తయారు చేసుకుంటున్నామన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత పేదరికం, రైతుల ఆత్మహత్యలు, రహదారులు లేకపోవటం వంటి సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ విధానాల వల్ల సమస్యలు వస్తాయన్నారు.


రాబోయే 25 ఏళ్లలో ఏం చేయాలో ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. విలువలతో కూడిన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని, లేకపోతే సమాజం విచ్ఛిన్నం అవుతుందన్నారు. మేము తీసుకున్న చర్యల వల్ల రైతు బిడ్డలు కూడా ఐటి రంగంలోకి వచ్చారని, అప్పుడు వేసిన విత్తనం ఇప్పుడు వృక్షంగా మారి ఫలసాయం వస్తోందన్నారు.  ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు మన వాళ్లే సీఈవోలుగా ఉన్నారని, అది తెలుగువారి సత్తా.. బారతీయుల సత్తా అని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పోవాలని, వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదన్నారు. విద్య, ఆరోగ్యం విషయంలో ఇంకా ముందుకు పోవాలని, టీడీపీ తెచ్చిన మహిళా రిజర్వేషన్లతో వారు చదివు, ఉద్యోగాల్లో స్థిర పడ్డారని, పురుషులతో సమానంగా పోటీ పడి ముందుకు వెళ్తున్నారన్నారు. నదుల అనుసంధానం ఈ దేశంలో చిరకాల వాంఛ అని, నదీ జలాలను సముద్రంలో కలవకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీడీపీ హయాంలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసి చూపామని, గంగా, కావేరి నదుల అనుసంధానం చాలా ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి ఉన్నచోట అభివృద్ధి జరగదన్నారు. జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవాసులు కృషి చేయాలని పిలుపిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు ఆదర్శమని, మహత్మా గాంధీ చేసిన పోరాటం ప్రపంచానికి స్ఫూర్తి అని, మన గౌరవం, ప్రతిష్ట పెరగాలంటే దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర్య వేడుకలు జనం మధ్యలో చేయాలనే ఇక్కడ ఏర్పాటు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-08-15T17:17:49+05:30 IST