గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఆత్మహత్యపై చంద్రబాబు విచారం

ABN , First Publish Date - 2022-04-08T21:18:38+05:30 IST

గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఆత్మహత్యపై చంద్రబాబు విచారం

చిత్తూరు జిల్లా: కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పార్థసారథి ఆత్మహత్య, కుప్పంలో ఆందోళనలపై ఆయన ఆరా తీశారు. సొంత పార్టీ నేతల కారణంగానే.. పార్థసారథి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ వేధింపులకు సొంత పార్టీ వ్యక్తులు కూడా బలవుతున్నారన్నారు. డబ్బులకు పదవులు అనే విష సంస్కృతిని.. వైసీపీ నేతలు కుప్పంలో కూడా తీసుకొచ్చారని మండిపడ్డారు. సొంత పార్టీలో అవమానాలకు ప్రాణాలు తీసుకోవడం విచారకరమన్నారు. పార్థసారథి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


వివరాల్లోకి వెళితే... కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ పార్థసారధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానం పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఇదే పాలకమండలిలో పార్థసారధిని సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. అయితే గత రెండేళ్లుగా పార్థసారధి చైర్మన్‌గా పనిచేశారు. కరోనా కారణంగా నామమాత్రంగానే చైర్మన్‌గా ఉన్నారు. మరోసారి తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. అయితే చైర్మన్‌గా మంజునాథ్‌ని ప్రభుత్వం నియమించడంతో పదవి ఇవ్వలేదనే మనస్తాపంతోనే పార్థసారధి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-04-08T21:18:38+05:30 IST