రెండున్నరేళ్లలో ఇంత అరాచకమా?: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-06T23:13:47+05:30 IST

రాష్ట్రంలో రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదని, అవినీతి, అరాచకం, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ సీఎం జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

రెండున్నరేళ్లలో ఇంత అరాచకమా?: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదని, అవినీతి, అరాచకం, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ సీఎం జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘‘ఒక సైకో నుంచి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఎదురైందని... పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జిలు, పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, ఇతర ముఖ్యనేతలతో నేడు చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఏపీ సర్కారు ఆకృత్యాలను ప్రజల కోసం, రాష్ట్రం కోసం భరిస్తున్నామని, టీడీపీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో పోలీసులు, వైసీపీ గూండాలతో వీరోచితంగా పోరాడుతూ.. జైలుకు కూడా వెళ్లి వస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి 2019 ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందిందని, ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి గోబెల్స్ ప్రచారం చేశారని,  నేడు అన్ని విషయాలు ప్రజల నిజజీవితంలో అవగతం అవుతున్నాయని టీడీపీ అధినేత తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.


జగన్‌రెడ్డి మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉపాధి హామీ బిల్లుల బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. 12శాతం వడ్డీతో కలిపి బిల్లులు ఇవ్వాలని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుతోనైనా జగన్ రెడ్డి తీరు మార్చుకోవాలని సూచాంచారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో టీడీపీ చివరి వరకూ పోరాడి విజయం సాధించిందని గుర్తుచేశారు. ఇప్పడు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదన్నారు. సుమారు రూ.70 వేల కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. టిడ్కో ఇళ్లను ఇంతవరకు లబ్దిదారులకు కేటాయించకుండా నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆదాయం కోసం ప్రభుత్వమే మద్యాన్ని బలవంతంగా తాగించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. లిక్కర్ పై రూ. 75వేల కోట్లు అప్పు చేస్తున్నారని, ఆడబిడ్డల తాళిబొట్లతో కూడా ఆడుకునే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. ‘‘ఏపీలో ఉండే మద్యం బ్రాండ్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? మద్యం బ్రాండ్స్ ఎందుకు మార్చారు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. సొంతంగా మద్యం తయారుచేసుకుంటూ, నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. ఏపీని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని, గంజాయి, హెరాయిన్ అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారని తీవ్రంగా మండిపడ్డారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడతామని తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తమ వంతు కృషిచేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-06T23:13:47+05:30 IST