బాధ్యత ప్రధానిది కూడా!

ABN , First Publish Date - 2020-07-05T09:02:12+05:30 IST

రాష్ట్రానికి.. దేశానికి సంపద సృష్టించే ప్రాజెక్ట్‌ అయిన అమరావతిని కాపాడాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత

బాధ్యత ప్రధానిది కూడా!

  • అమరావతిపై ఆయన జోక్యం చేసుకుని కాపాడాలి
  • సీఎం మారితే రాజధాని మార్చడమా?: చంద్రబాబు


అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి.. దేశానికి సంపద సృష్టించే ప్రాజెక్ట్‌ అయిన అమరావతిని కాపాడాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం 200 రోజులైన సందర్భంగా శనివారం జరిగిన వర్చువల్‌ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇది ఒక ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితమైన ప్రాజెక్టు కాదు. ఇది సృష్టించే సంపద.. తెచ్చే అభివృద్ధి దేశానికీ ఉపయోగపడుతుంది. సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకొంటూ పోతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? కేంద్రం కూడా  దీనిలో డబ్బులు పెట్టింది. దీనిని ఎంతో ప్రోత్సహించింది. వారికి కూడా బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని, ఈ రాజధానిని కేంద్రమే కాపాడాలని నా విజ్ఞప్తి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘రాష్ట్రానికి నడిబొడ్డున దీనిని రూపకల్పన చేశాం. రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారు. అమరావతికి మద్దతిస్తున్నానని ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్‌ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట మొదలు పెట్టారు. అమరావతి మునిగిపోతుందని ప్రచారంచేశారు. ముంపు ప్రమా దం లేదని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ చెప్పింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎక్కడ జరిగింది? కుక్కను చం పాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్లు అమరావతిపై ఎన్నోకుట్రలు, కుతంత్రాలు చేశారు’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.


అది అవాస్తవ ప్రచారం

అమరావతిని పూర్తి చేయాలంటే రూ.లక్ష కోట్లు కావాలన్న వైసీపీ ప్రభుత్వ ప్రచారం అవాస్తవమని చంద్రబాబు అన్నారు. ‘‘అమరావతి నిర్మాణానికి రూ.53 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. రైతులకు ఇవ్వగా ప్రభుత్వం చేతిలో 9 వేల ఎకరాల భూమి ఉంటుంది. దానిని విక్రయిస్తే ఎంతో ఆదాయం వస్తుంది. అమరావతిని పూర్తి చేసేందుకు ఇది చాలు’’ అని అన్నారు. అమరావతితోపాటు కర్నూలు, విశాఖ కూడా అభివృద్ధి చెందాలని చంద్రబాబు అన్నారు.


అల్లూరి స్ఫూర్తే ఆదర్శం

అమరావతి పరిరక్షణకు వీరోచితంగా పోరాడుతున్నారని రైతులు, మహిళలు, కూలీలు, జేఏసీ సంఘాలను చంద్రబాబు ప్రశంసించారు. ‘‘ఈరోజు(శనివారం) అల్లూరి సీతారామరాజు జయంతి. ఆయన పోరాట స్ఫూర్తి మనకు ఆదర్శం. అమరావతి పోరులో మనో వేదనతో 66 మంది అశువులు బాశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి. అమరావతికి పేరు బలం, స్థాన బలం ఉన్నాయి. దానిని ఎవరూ చంపలేరు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించి రాష్ట్రంలో అనిశ్చితి తొలగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-07-05T09:02:12+05:30 IST