అబద్ధాలు బద్దలు

ABN , First Publish Date - 2020-07-01T08:25:41+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంతులేని అవినీతి జరిగిందని వైసీపీ ప్రచారం చేసిన అబద్ధాలు ఇప్పుడు బద్దలవుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి...

అబద్ధాలు బద్దలు

పోలవరం, పట్టిసీమలో అవినీతి లేదని కేంద్రమే చెప్పింది

6.5 లక్షల కోట్ల అవినీతి అన్నారు

ఏమీ చేయలేక అచ్చెన్నపైకి: బాబు

వైసీపీ నేతలు ముఖమెక్కడ పెట్టుకుంటారు?

ఆరున్నర లక్షల కోట్ల అవినీతి అన్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం

రాజధాని ఆందోళనలకు మద్దతుగా 4వ తేదీన వర్చువల్‌ నిరసనలు


అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంతులేని అవినీతి జరిగిందని వైసీపీ ప్రచారం చేసిన అబద్ధాలు ఇప్పుడు బద్దలవుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలు పెరగడంలో అవినీతి ఉందని, ఆ ప్రాజెక్టు అంతా అవినీతిమయమని ప్రచారం చేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో ఏ అవినీతీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వైసీపీ నేతలు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? పింక్‌ డైమండ్‌ నా ఇంట్లో ఉందని ఆరోపించారు. ఇప్పుడు పింక్‌ డైమండ్‌ అనేది అసలు లేనేలేదని వాళ్లే చెబుతున్నారు. ఇప్పుడు ఫైబర్‌గ్రిడ్‌ పాట పాడుతున్నారు. అసలు అది ఏ శాఖ కిందకు వస్తుందో కూడా వారికి అవగాహన లేదు.


టీడీపీ ఐదేళ్లలో రూ.ఆరున్నర లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకాలు వేశారు. ఐదేళ్ల బడ్జెట్‌ కలిపినా అంత లేదు. ఏం చేయాలో తెలియక అచ్చెన్నాయుడిపై పడ్డారు. యనమల, చిన రాజప్పలపై ఎస్సీ ఎస్టీ కేసు, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టే దుస్థితికి దిగజారారు’ అని విమర్శించారు. సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులను 13 నెలలైనా అరెస్టు చేయలేదని, సొంత చెల్లెలు సీబీఐ దర్యాప్తు కావాలని కోరితే వద్దని అడ్డుపడే ప్రయత్నం చేసిన అన్న జగన్‌ అని కడప జిల్లా నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో రాజకీయ నేతలు, వ్యాపారులను లొంగదీసుకోవడానికి రూ.2 వేల కోట్ల మేర జరిమానాలు విధిస్తూ నోటీసులు పంపారని, వైసీపీలో చేరగానే అవన్నీ పక్కకు పోతున్నాయని ఆ జిల్లా మాజీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. 


రాజధాని నిరసనలకు 200 రోజులు

అమరావతి జేసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజధాని ఆందోళనలకు 200 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్‌ నిరసనలు నిర్వహించి రైతులకు సంఘీభావం తెలపాలని టీడీపీ సమావేశం నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన 139 సంస్థలను అక్కడకు రాకుండా చేశారని, పనులన్నీ ఆపేసి పేదలకు ఉపాధి పోగొట్టారని.. యువత ఉద్యోగ అవకాశాలను చిదిమేశారని విమర్శించారు. సొంత కంపెనీలు, సొంత బంధువుల కంపెనీల కోసం ఎ-1 జగన్‌, ఎ-2 విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రూ.1,300 కోట్ల విలువైన సున్నపురాయి గనులు, రైతులకు వెళ్లాల్సిన నీటిని ముఖ్యమంత్రి తన సొంత కంపెనీ సరస్వతి పవర్‌కు కేటాయించుకున్నారని.. కేంద్రానికి, హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపూరితంగా అనుమతులు తెచ్చుకున్నారని విమర్శించారు. వ్యాపారం కోసం అమరావతి పేరు వాడుకుని.. ఆ పని పూర్తి కాగానే రాజధానిని మూడు ముక్కలు చేశారని ఒక నేత వ్యాఖ్యానించారు. 108 అంబులెన్సుల్లో రూ.300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మరో నేత ఆరోపించారు. 


కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన

గత ఐదు వారాల్లో రాష్ట్రంలో కరోనా కేసులు 400 శాతం పెరగడంపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆస్పత్రుల్లో వసతులు లేవు. సరైన పడకలు.. వెంటిలేటర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో లేదా జాతీయ స్థాయితో పోల్చితే రికవరీ శాతం తక్కువగా ఉంది. కోట్లాది మందికి పరీక్షలు చేస్తున్నామని... దేశంలోనే ప్రఽథమ స్థానంలో ఉన్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పీపీఈ కిట్ల కోసం విశాఖ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో వైద్యులు ధర్నా చేయాల్సి రావడం సిగ్గుచేటు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా బాధితుల మృతదేహాలను జేసీబీల్లో తరలించడం దారుణం. ఒకవైపు కరోనా జీవన విధ్వంసం సృష్టిస్తుంటే.. మరోవైపు వైసీపీ సామాజిక విధ్వంసం సృష్టిస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎంఎ్‌సఎంఈలకు రూ.900 కోట్లను రెండు దఫాలుగా ఇచ్చి.. ప్రకటనల పేరుతో లక్షల రూపాయలు వెదజల్లుతోంది. గత ప్రభుత్వాలు వదిలిపెట్టి వెళ్లిన పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలు రూ.3,800 కోట్లను టీడీపీ ప్రభుత్వం చెల్లించింది. తూర్పు గోదావరి  జిల్లాలో ఎంఎ్‌సఎంఈ పరిశ్రమలకు ఇచ్చిన 106 ఎకరాల భూములను జగన్‌ ప్రభుత్వం వెనక్కు లాగేసుకుంది. ఇదేనా వాటిని ప్రోత్సహించడం’ అని నిలదీసింది.


విక్రమ్‌ హత్యకు పోలీసుల సహకారం

గురజాల నియోజకవర్గంలో దళిత యువకుడు విక్రమ్‌ హత్యను టీడీపీ సమావేశం తీవ్రంగా ఖండించింది. ‘హైదరాబాద్‌లో ఉంటున్న ఈ యువకుడిని పోలీసులు పనిగటుకుని పిలిపించి రోజూ స్టేషన్లో అర్ధరాత్రి వరకూ కూర్చోబెట్టేవారు. అతడు తిరిగి వెళ్లే సమయం వైసీపీ నేతలకు చెప్పి హత్యకు పూర్తి సహకారం అందించారు’ అని గుంటూరు జిల్లా నేతలు చెప్పారు. అక్కడ సీఐని సస్పెండ్‌ చేయడంతోపాటు గురజాల వైసీపీ ఎమ్మెల్యేపై హత్యానేరం నమోదు చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ ప్రభుత్వ హయాంలో దళితుల పరిస్థితి దయనీయంగా మారిందని దళిత నేత ఒకరు అన్నారు. ‘అనేకచోట్ల వారికి గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను నిర్దాక్షిణ్యంగా లాక్కొంటున్నారు. ఆత్మహత్యాప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ నేతల్లో కనికరం లేదు. దళిత డాక్టర్లు సుధాకర్‌, అనితా రాణిని ఘోరంగా వేధించారు. మాజీ ఎంపి హర్షకుమార్‌ను 48 రోజులు జైల్లో ఉంచారు. దళిత నేతలపై అక్రమ కేసులు, అరెస్టులకు లెక్కే లేదు’ అని తెలిపారు. 

Updated Date - 2020-07-01T08:25:41+05:30 IST