చంద్రబాబు, లోకేశ్‌లను అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2020-02-16T08:59:06+05:30 IST

మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ను ముందస్తుగా అరెస్టు చేయాలి. లేకపోతే ఐటీ దాడుల్లో దొరికిన సాక్ష్యాధారాలను తారుమారు

చంద్రబాబు, లోకేశ్‌లను  అరెస్టు చేయాలి

బయట ఉంటే వ్యవస్థలను ప్రభావితం చేస్తారు

మంత్రులు శంకరనారాయణ, బుగ్గన విమర్శ

కదిరి, కర్నూలు(వ్యవసాయం), ఫిబ్రవరి 15: మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ను ముందస్తుగా అరెస్టు చేయాలి. లేకపోతే ఐటీ దాడుల్లో దొరికిన సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు’’ అని ఉప ముఖ్యమంత్రి శంకరనారాయణ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శనివారం అనంతపురం జిల్లా కదిరిలో ఆయన  మాట్లాడారు. చంద్రబాబు ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన ఐటీ సోదాల్లో బయటకు వచ్చిన రూ.2వేల కోట్ల లావాదేవీలన్నీ ఆలైన్‌లైన్‌లోనే జరిగాయని ఆరోపించారు. ఇవన్నీ చంద్రబాబు, లోకేశ్‌ బినామీ లావాదేవీలేనని పేర్కొన్నారు.


బయట ఉంటే ఎలాంటి వ్యవస్థలనైనా మాయచేసి, మభ్యపెట్టగల సమర్థులని, వారిద్దరినీ ముందస్తుగా అరెస్టు చేయాలని కోరారు. వీరు నల్లధనాన్ని విదేశాలకు తరలించి, అక్కడ నుంచి తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతలు ప్రజాధనాన్ని అక్రమ మార్గాల్లో ఎలా మళ్లించారో ఐటీ అధికారుల దాడుల్లో వెలుగు చూసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కర్నూలులో అన్నారు. చంద్రబాబు వద్ద పనిచేసిన శ్రీనివా్‌సతోపాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. దాదాపు రూ.2 వేల కోట్లను బోగస్‌ కంపెనీల ద్వారా విదేశాలకు చేరవేశారని ఐటీ అధికారులు ప్రకటించారన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకి వస్తాయని, అంతవరకు టీడీపీ నాయకులు ఓపిక పట్టాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం అంటూ లక్షల కోట్లు అప్పులు చేసి, ఆ ధనాన్నంతా విదేశాలకు మళ్లించారని బుగ్గన ఆరోపించారు. అప్పు తెచ్చి బోగస్‌ కంపెనీల పేరుతో దోచుకున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో రాజధానిని అని ప్రకటించి రైతులు, ప్రజల్ని ముంచారని మండిపడ్డారు. చంద్రబాబు బండారాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. 

Updated Date - 2020-02-16T08:59:06+05:30 IST