అప్పుడు నా తల్లిని ... ఇప్పుడు నా భార్యని..: భోరున విలపించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-19T20:14:20+05:30 IST

శాసనసభలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను వైసీపీ నేతలు అవహేళన చేస్తూ విమర్శలు చేశారు.

అప్పుడు నా తల్లిని ... ఇప్పుడు నా భార్యని..: భోరున విలపించిన చంద్రబాబు

అమరావతి: గతంలో శాసనసభలో ఆవేశాలు, కోపాలుండేవని, సభ వాయిదా పడేదని, తిరిగి సమావేశమైన తర్వాత ఎవరిది తప్పయితే వారికి స్పీకర్ చెప్పేవారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం శాసనసభలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను వైసీపీ నేతలు అవహేళన చేస్తూ విమర్శలు చేశారు. దీనిపై ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ భోరున విలపించారు.


వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషించారని చంద్రబాబు తెలిపారు. దీనిపై గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నానన్నారు. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు.


పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశానని, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశానని చంద్రబాబు అన్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు తాను చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-19T20:14:20+05:30 IST