4-8 వారాలూ ఇదే ఉధృతి!

ABN , First Publish Date - 2021-05-08T09:06:00+05:30 IST

‘‘కరోనా సెకం డ్‌ వేవ్‌ ఇప్పుడు అత్యున్నత దశలో ఉంది. ఈ ఉధృతి మరో నాలుగు నుంచి 8 వారాలు కొనసాగే అవకా శం ఉంది. లాక్‌డౌన్లు పెడుతున్నందువల్ల కొంత అదుపులోకి వచ్చే అవకాశం ఉంది

4-8 వారాలూ ఇదే ఉధృతి!

3, 4 వేవ్‌ కూడా వస్తాయి

టీకా తీసుకోనివారే వాటి టార్గెట్‌

పక్కాగా జెనోమ్‌ విశ్లేషణ జరగాలి

మ్యుటెంట్‌ సమాచారమూ పంచాలి

ఆన్‌లైన్‌ చర్చలో వైద్య నిపుణులు

సమాజహితం కోసమే ఈ చర్చ: చంద్రబాబు


అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా సెకం డ్‌ వేవ్‌ ఇప్పుడు అత్యున్నత దశలో ఉంది. ఈ ఉధృతి మరో నాలుగు నుంచి 8 వారాలు కొనసాగే అవకా శం ఉంది. లాక్‌డౌన్లు పెడుతున్నందువల్ల కొంత అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఉధృతి తగ్గడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది’’ అని లైఫ్‌ సైన్సెస్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఎండీ మయూర్‌ అభయ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ నాలుగు లక్షల కరోనా పరీక్షలు నిర్వహించిందని, ఎంతో సమాచారాన్ని విశ్లేషించిందని ఆయన వెల్లడించారు. ‘కరోనా థర్డ్‌వేవ్‌ రావడం ఖాయం. అదికూడా ఇంకా బలంగా వస్తుంది. కొన్ని దేశాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. వైరస్‌ పరివర్తనలకు సంబంధించి జెనోమ్‌ విశ్లేషణ ఎంత ఎక్కువ జరిగితే థర్డ్‌వేవ్‌పై అంత కచ్చితత్వంతో అంచనాలు తయారు చేయవచ్చు. మన దేశంలో ఈ విశ్లేషణకు సంబంధించిన వసతులు పెద్దగాలేవు. అవసరమైన నమూనాలను ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే తమ వద్ద పెట్టుకొని విశ్లేషిస్తున్నాయి. అది చాలదు. 


మనదేశంలోని ప్రైవేటు సంస్ధలను కూడా భాగస్వాములను చేసి ఎంత ఎక్కువ సీక్వెన్సింగ్‌ చేస్తే అంత ఎక్కువ సమాచారంతో మనం సన్నద్ధం కావచ్చు’’ అని తెలిపారు.  కరోనా సెకండ్‌ వేవ్‌లో లక్షణాలు పూర్తిగా మారిపోయాయని, జ్వరం లేక నీరసం ఉంటే కరోనాగానే అనుమానించి పరీక్షలకు వెళ్లాలని వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా చేసిన డాక్టర్‌ ఈశ్వర్‌ పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉండి రెం డుసార్లు నెగటివ్‌ వచ్చినా జ్వరం తగ్గకపోతే అప్పుడు సీటీ స్కాన్‌ తీయించుకోవాలని రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ సురేశ్‌ వివరించారు. కరోనా ఉధృతితో ప్రజలు గందరగోళానికి గురవుతున్న సమయంలో సరైన సమాచారాన్ని వారికి అందించడానికే చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ‘‘ఆస్ట్రేలియా వంటి దేశాలు బలమైన చర్యలతో తమ ప్రజలను కాపాడుకోగలిగాయి. అమెరికా కూడా వ్యాక్సినేషన్‌ పెంచడం ద్వారా ఉధృతిని తగ్గించగలిగింది. మన దేశంలో థర్డ్‌వేవ్‌, ఫోర్త్‌వేవ్‌ కూడా రావచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు’’ అని వివరించారు.

Updated Date - 2021-05-08T09:06:00+05:30 IST