అఖిలపక్షం ఏర్పాటు చేయండి : చంద్రబాబు డిమాండ్

ABN , First Publish Date - 2021-05-11T23:53:17+05:30 IST

ఏపీలోని ప్రస్తుత పరిస్థితులపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు,

అఖిలపక్షం ఏర్పాటు చేయండి : చంద్రబాబు డిమాండ్

అమరావతి : ఏపీలోని ప్రస్తుత పరిస్థితులపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, మండలాధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా బాధితులకు ఇచ్చిన సాయం, తదితర వివరాలపై జగన్ సర్కార్ వెంటనే ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా కట్టడి, ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య విషయంలో, కరోనా మృతులకు సాయం చేసిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను అందరికీ వేసేట్లుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా మృతుల దహన సంస్కారాలకు 15 వేల రూపాయల సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ అది అమలు కావడం లేదని మండిపడ్డారు. 


కరోనా మృతులకు గౌరవ ప్రదంగా ప్రభుత్వమే దహన సంస్కారాలను నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని, ఇతర కారణాల రీత్యా మరణించిన కరోనా రోగుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా కరోనా కారణంగా పనులు కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులకు, భవన నిర్మాణ కార్మికులకు, పేదలకు 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇంతటి కష్ట కాలంలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కరోనా మందులు, ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రుల్లో బెడ్ల కేటాయింపుల్లో బ్లాక్ మార్కెట్ నిర్వహిస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారని, ఏపీలో మద్యం అమ్ముకోవడం కోసమే లాక్‌డౌన్ విధించడం లేదని చంద్రబాబు విమర్శించారు. 

Updated Date - 2021-05-11T23:53:17+05:30 IST