దేశం బలం.. యువతే

ABN , First Publish Date - 2022-08-16T05:23:47+05:30 IST

ఆర్థిక అసమానతలు లేనపుడే సంతోషకర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు.

దేశం బలం.. యువతే
జెండా వందనం చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు

వారిని సరైన మార్గంలో ప్రోత్సహించాలి..

ఆర్థిక అసమానతలు లేనపుడే సంతోషకర సమాజం

దేశ అభివృద్ధికి తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ భాగస్వామినైనందుకు గర్విస్తున్నా

ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు


గుంటూరు(సంగడిగుంట), ఆగస్టు15: ఆర్థిక అసమానతలు లేనపుడే సంతోషకర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరులో సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొని స్తంభాలగరువులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో ఎటువంటి లాక్‌డౌన్‌ లేకుండా పాడిపంటలను సమృద్ధిగా దేశానికి అందించిన రైతే నిజమైన దేశభక్తుడన్నారు. అటువంటి రైతు ఆత్మహత్యలకు పాల్పడుకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలో నదుల అనుసంధానం ద్వారా రైతును, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయవచ్చన్నారు. 33శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా పురుషులతో పోటీపడే స్థాయికి తీసుకొచ్చామన్నారు. రాబోయే 25 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న ఆదాయన్ని 17 రెట్లు పెంచడం ద్వారా దేశాన్ని అగ్రదేశంగా మార్చవచ్చన్నారు. దేశం బలం యువతేనన్నారు. అటువంటి యువతను సరైన మార్గంలో ప్రోత్సహించడం ద్వారా అగ్రరాజ్య లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదన్నారు. నెహ్రూ, వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, ప్రస్తుత మోదీ వంటి మహానేతలు ఎంచుకున్న మంచి నిర్ణయాల కారణంగా ఎంతో అభివృద్ధి చెందామన్నారు. టెలికాం రంగం, జాతీయ రహదారుల అభివృద్ధి, ఐటీ రంగానికి తోడ్పాటు వంటి మంచి నిర్ణయాల్లో తాను భాగస్వామినైనందుకు ఎంతో గర్వపడుతున్నానన్నారు. మూడు రంగుల జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు, పవర్‌ సెక్టార్‌లోని నూతన ఆవిష్కరణలు టీడీపీ ముందుచూపునకు నిదర్శనమన్నారు. ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంలో అవినీతి క్యాన్సర్‌లా మారిందన్నారు. దానిని నిర్మూలించేందుకు నూతన పంధాలో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, ప్రత్తిపాటి పుల్లారావు, రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌, నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ కూచిపూడి విజయ, పిల్లి మాణిక్యాలరావు, వట్టికూటి హర్షవర్ధన్‌, లాల్‌వజీర్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్‌, కనపర్తి శ్రీనివాసరావు, సుఖవాసి, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T05:23:47+05:30 IST