శ్రీలంక జట్టును తరలించిన బస్సులో రెండు బులెట్ షెల్స్.. కలకలం

ABN , First Publish Date - 2022-02-28T02:42:23+05:30 IST

శ్రీలంక టెస్టు క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సులో రెండు బుల్లెట్ షెల్స్ లభ్యం కావడం కలకలం రేగింది

శ్రీలంక జట్టును తరలించిన బస్సులో రెండు బులెట్ షెల్స్.. కలకలం

న్యూఢిల్లీ: శ్రీలంక టెస్టు క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సులో రెండు బుల్లెట్ షెల్స్ లభ్యం కావడం కలకలం రేగింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. చండీగఢ్‌లోని హోటల్ లలిత్ నుండి మొహాలీలోని ఆర్‌ఎస్ బింద్రా క్రికెట్ స్టేడియానికి క్రికెట్ జట్టు సభ్యులను తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్న ప్రైవేట్‌ బస్సులో పోలీసులు శనివారం సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లగేజీ కంపార్ట్‌మెంట్‌ నుంచి రెండు బులెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి బస్సును పరిశీలిస్తుండగా ఇవి బయటపడ్డాయి. 


ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. డీడీఆర్ మాత్రమే రిజిస్టర్ చేశారు. చండీగఢ్‌లోని సెక్టార్ 17 నుంచి కార్యకలాపాలు ప్రారంభించే తారా బ్రదర్స్ నుంచి ఈ బస్సును అద్దెకు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ బస్సును ఇటీవల ఓ వివాహ వేడుక కోసం అద్దెకు తీసుకున్నారు. నిషేధం ఉన్నప్పటికీ పంజాబ్‌లో వివాహాల సందర్భంగా కాల్పులు జరపడం సర్వసాధారణం. అయితే, ఈ కాట్రిడ్జ్‌ల స్వాధీనంపై పోలీసులు పెదవి విప్పడం లేదు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. అయితే, పార్క్ పోలీసులు మాత్రం ఈ  బులెట్ షెల్స్ రికవరీ గురించి తెలియనట్టుగానే వ్యవహరిస్తున్నారు. 


బస్ డ్రైవర్, యజమానికి పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లోకి షెల్స్ ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు  ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం భారత్, శ్రీలంక టెస్టు జట్లు రెండూ ప్రస్తుతం చండీగఢ్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్రతి రోజూ మొహాలీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. 

Updated Date - 2022-02-28T02:42:23+05:30 IST