చాణక్య నీతి: విద్యార్థుల విజయానికి దోహదపడే విషయాలివే.. తెలుసుకోకుంటే వైఫల్యం తప్పదు!

ABN , First Publish Date - 2022-03-13T12:58:06+05:30 IST

చాణక్య నీతి ప్రకారం, విద్యార్థి జీవితం వెలకట్టలేనిది.

చాణక్య నీతి: విద్యార్థుల విజయానికి దోహదపడే విషయాలివే.. తెలుసుకోకుంటే వైఫల్యం తప్పదు!

చాణక్య నీతి ప్రకారం, విద్యార్థి జీవితం వెలకట్టలేనిది. దాని ప్రాముఖ్యతను విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఇది జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ సమయంలో పొరపాటు దొర్లితే అది జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అందుకే విద్యార్థులు చాలా జాగ్రత్తగా మెలగాలి. నిర్లక్ష్యం, చెడు సహవాసం, బద్ధకం మొదలైనవి విద్యార్థి జీవితాన్ని దెబ్బతీస్తాయి. విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలనుకుంటే, లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆచార్య చాణక్యుడు తెలిపిన ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. 

పనులు సకాలంలో చేయండి:

ఏదైనా పని చేయడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకోవాలని చాణక్య నీతి చెబుతుంది. విద్యార్థులకు క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకునే విద్యార్థులు విజయం సాధించేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అలాంటి విద్యార్థులు తమ లక్ష్యాలను చాలా సులభంగా సాధిస్తారు. క్రమశిక్షణ అనేది సమయ ప్రాముఖ్యత తెలుసుకునేలా చేస్తుంది. విజయంలో సమయపాలన చాలా ముఖ్యం. సమయాన్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి తన పనిని సమయానికి పూర్తి చేస్తాడు.


నేటి పనిని రేపటికి వాయిదా వేయకండి:

విద్యార్థులకు అతిపెద్ద శత్రువు బద్ధకం అని చాణక్య నీతి చెబుతుంది. ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకూడదు. బద్ధకానికి దూరంగా ఉండాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేసే విద్యార్థి ఎప్పుడూ లక్ష్యానికి దూరంగా ఉంటాడు. బద్ధకం అనేక ఇతర చెడు లక్షణాలను పెంచుతుంది. 

చెడ్డవారితో స్నేహం మానుకోండి

విద్యార్థి తన జీవితంలో చెడ్డవారి సాంగత్యానికి దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఉత్తమ స్నేహితుల మధ్య మెలగాలి. స్నేహితుల సాంగత్యం కూడా విజయంలో విశేష సహకారం అందిస్తుంది. చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. నష్టం అనేది చెడు సాంగత్యం నుండే వస్తుంది. చెడ్డవారి సాంగత్యం విజయానికి అతిపెద్ద అడ్డంకి. చెడు సాంగత్యం వల్ల కొన్నిసార్లు అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి

విద్యార్థి జీవితం వెలకట్టలేనిదని చాణక్య నీతి చెబుతోంది. చెడు విషయాల జోలికి పోకూడదు. విద్యార్థులు డ్రగ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. చెడు అలవాట్లు విజయానికి ఆటంకం. ఇవి శారీరక, మానసిక పరిస్థితులపై ప్రభావం చూపుతాయి. మనిషిని మరింత దిగజారుస్తాయి. విజయాన్ని దూరం చేస్తాయి.. అప్పుడు సమాజంలో గౌరవం తగ్గి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 



Updated Date - 2022-03-13T12:58:06+05:30 IST