ఆచార్య చాణక్య నాడు తెలిపిన జీవన విధానాలు నేటికీ ఆచరణయుక్తంగా ఉన్నాయి. ఆచార్య చాణక్య తన పుస్తకం చాణక్య నీతిలో అనేక విలువైన విషయాలు తెలిపారు. వాటిలోని కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతీ ఒక్కరూ తమ ప్రవర్తన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనిషి విజయం అతని లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. చాణక్య తెలిపిన జీవన విధానాల ప్రకారం, ఎవరైనా జీవితంలో విజయం సాధించాలన్నా, ధనవంతులు కావాలన్నా పొరపాటున కూడా కూడా ఇటువంటి తప్పులు చేయకూడదు.
డబ్బు ఖర్చు విషయంలో..
ఎవరైనా సరే అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి. చాణక్య నీతి ప్రకారం ప్రతీఒక్కరూ డబ్బును కూడబెట్టుకోవాలి. డబ్బు అనేది మనిషికి కష్ట సమయాల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆపద సమయంలో డబ్బు నిజమైన స్నేహితుడి పాత్ర పోషిస్తుందని చాణక్య తెలిపారు. డబ్బు ఉంటే మనిషిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు లేనప్పుడు నిరాశ, ఆందోళన అలముకుంటాయి. అయితే ఆదాయానికి మించి డబ్బు ఖర్చు చేసే వారు ఇబ్బందుల్లో పడతారని చాణక్య నీతి చెబుతోంది. డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అవసరమైనప్పుడు మాత్రమే డబ్బును ఖర్చు చేయాలి. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే కూడబెట్టిన ధనం కూడా కోల్పోతాం.
పక్కదారి పట్టించే చెడు అలవాట్లు
చాణక్య నీతి ప్రకారం మనిషి ఎప్పుడూ అనైతిక పనులు చేయకూడదు. ఎవరైనాసరే జీవితంలో విజయం సాధించాలనుకుంటే, ఎప్పుడూ అనైతిక అంటే తప్పుడు పనులు చేయకూడదు. చెడు అలవాట్లు మనిషిని పేదవానిగా మారుస్తాయి. మీరు ధనవంతులుగా మారాలనుకుంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్లు కలిగిన వ్యక్తి దగ్గర సంపద నిలవదు. చుట్టు పక్కలవారి నుంచి గౌరవం కూడా దక్కదు.
అజాగ్రత్త అస్సలు పనికిరాదు
డబ్బు విషయంలో మనిషి సీరియస్గా, జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉన్నవారు నష్టపోవాల్సి వస్తుంది. డబ్బు సంపాదన వెనుకనున్న కష్టాన్ని గుర్తుంచుకోవాలి. ధనాన్ని దాచుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.