ఈ చాంపియన్‌ షూటర్‌.. ఇక లాయర్‌

ABN , First Publish Date - 2020-06-30T08:59:20+05:30 IST

కొవిడ్‌-19 ధాటికి ఎంతోమంది ఉపాధి కోల్పోగా అటు క్రీడాకారులు కూడా ఎలాంటి పోటీలు లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దీంతో షూటర్‌ అభిషేక్‌ వర్మ ...

ఈ చాంపియన్‌ షూటర్‌.. ఇక లాయర్‌

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 ధాటికి ఎంతోమంది ఉపాధి కోల్పోగా అటు క్రీడాకారులు కూడా ఎలాంటి పోటీలు లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దీంతో షూటర్‌ అభిషేక్‌ వర్మ తన పిస్టల్‌ను పక్కనబెట్టి లాయర్‌గా అవతారం ఎత్తాలనుకుంటున్నాడు. 30ఏళ్ల అభిషేక్‌కు గతంలో న్యాయ వాదిగా ప్రాక్టీస్‌ చేసిన అనుభవముంది. అందుకే మరోసారి కోర్టు గదిలో అడగుపెట్టాలనుకుంటున్నాడు. బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసిన అభిషేక్‌కు సైబర్‌ క్రైమ్స్‌కు సంబంధించిన కేసులపై ప్రత్యేక ఆసక్తి ఉంది. ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ఈ హరియాణా షూటర్‌ కొన్నాళ్లపాటు షూటింగ్‌, లా ప్రాక్టీస్‌కు సమప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ‘నిజానికి ఒలింపిక్స్‌ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నా. కానీ ఆ గేమ్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఇప్పటికే టోక్యో విశ్వక్రీడలకు అర్హత సాధించా. కానీ.. వాటికి చాలా సమయముంది. ఈలోపు లాయర్‌గా మరోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా. సైబర్‌ క్రైమ్స్‌తో పాటు క్రిమినల్‌ కేసులను కూడా వాదిస్తా’ అని అభిషేక్‌ తెలిపాడు. వర్మ తండ్రి పంజాబ్‌, హరియాణా హైకోర్టులో జడ్జి. ఎప్పుడూ తన తండ్రి వెంట తుపాకులతో ఉండే బాడీగార్డులను చూసి షూటింగ్‌పై ఆసక్తి పెరిగిందన్న అభిషేక్‌.. కేవలం ఆరేళ్లలోనే అంతర్జాతీయ షూటర్‌గా ఎదగడం విశేషం. రెండేళ్ల క్రితం ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన అభిషేక్‌.. అదే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టీమ్‌ ఈవెంట్‌లో రజతం గెలిచాడు. నిరుడు ఏప్రిల్‌లో బీజింగ్‌ (చైనా) వేదికగా జరిగిన వరల్డ్‌ కప్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ పాంగ్‌ వీని వెనక్కి నెట్టి స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించిన అభిషేక్‌.. ఆ ప్రదర్శనతో భారత్‌కు షూటింగ్‌లో ఐదో ఒలింపిక్‌ కోటాను అందించాడు. తర్వాత ఆగస్టులో రియో(బ్రెజిల్‌)లో జరిగిన ప్రపంచ కప్‌లో సహచర షూటర్‌ సౌరభ్‌ వర్మను అధిగమించి వరుసగా రెండో ప్రపంచ పసిడి పతకాన్ని సాధించాడు. 

Updated Date - 2020-06-30T08:59:20+05:30 IST