కలెక్టరేట్లలో మంత్రులకు చాంబర్లు

ABN , First Publish Date - 2021-06-19T06:13:18+05:30 IST

కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈనెల 20న సిద్దిపేటతో పాటు కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. కాగా అన్ని భవనాలు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆ ప్లాన్‌ ప్రకారమే వీటిని నిర్మించారు.

కలెక్టరేట్లలో మంత్రులకు చాంబర్లు
విద్యుత్‌కాంతుల్లో సిద్దిపేట నూతన కలెక్టరేట్‌ భవనం,

మంత్రులు లేనిచోట ఇన్‌చార్జి మంత్రులకు

ప్రత్యేక గది, కాన్ఫరెన్స్‌హాల్‌, విజిటర్స్‌ రూం

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌ ప్రారంభం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్‌ 18:  కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈనెల 20న సిద్దిపేటతో పాటు కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. కాగా అన్ని భవనాలు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆ ప్లాన్‌ ప్రకారమే వీటిని నిర్మించారు. సిద్దిపేట కలెక్టరేట్‌ విషయానికొస్తే మూడు అంతస్తుల్లో  100 గదులు ఉన్నాయి. 40 శాఖల అధికారులకు ప్రత్యేక చాంబర్లు, సిబ్బంది కోసం గదులు కేటాయించారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, డీఆర్వోలకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే చాంబర్లు ఉన్నాయి. ప్రతిఫ్లోర్‌లో ఒక సెమినార్‌ హాల్‌, వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌, వెయిటింగ్‌ హాల్‌ ఏర్పాటు చేశారు. 600 మంది సిబ్బంది కూర్చుని పనిచేసేలా ఫర్నీచర్‌ అమర్చారు. సిద్దిపేట కలెక్టరేట్‌ నిర్మాణానికి రూ.62.60 కోట్లు వెచ్చించారు. 


మొదటి అంతస్తులో ప్రత్యేక చాంబర్లు

జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు సాధారణంగా పాత కలెక్టరేట్‌ భవనాల్లోని కలెక్టర్‌ చాంబర్‌ను వినియోగించుకుంటారు. లేదంటే కాన్ఫరెన్సు హాల్‌లో సమీక్షలు చేసి వెళతారు. అయితే జిల్లా కేంద్రంలో ప్రజలను నేరుగా కలవలేకపోతున్నారనే ఉద్దేశంతో  కొత్త కలెక్టరేట్లలోని మొదటి అంతస్తులో మంత్రులకు ప్రత్యేకచాంబర్లు నిర్మించారు. ఒక కాన్ఫరెన్స్‌హాల్‌, విజిటర్స్‌ రూంను సిద్ధం చేశారు. మంత్రులు లేని జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు వీటిని వినియోగించుకోవచ్చు. 


అధికారులకు నివాసాలూ ఇక్కడే

కలెక్టరేట్‌ నూతన భవనానికి సమీపంలోనే జిల్లాస్థాయి అధికారులకు నివాసాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లు, డీఆర్వోకు ప్రత్యేకంగా ఇళ్లు నిర్మించారు.  వీటిని క్యాంపు కార్యాలయాలుగానూ వినియోగించుకోనున్నారు. ఆర్డీవో, జిల్లాలోని కీలక శాఖల అధికారుల కోసం త్రిబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను నిర్మించారు. వీటిని అపార్ట్‌మెంట్ల తరహాలోని ఫ్లాట్లుగా సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమైన అధికారులు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాట్లను చేశారు.


ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలి

భవనాలను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

కొండపాక, జూన్‌ 18 : కొండపాక మండలం దుద్దెడ శివారులో నిర్మించిన సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతీ కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పాలనా సౌలభ్యం కోసమే ఒకే దగ్గర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పేర్కొన్నారు. భవనాలను పరిశీలించిన మంత్రి అన్ని ఏర్పాట్లను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రేపు సీఎం పర్యటన సందర్భంగా రాజీవ్‌ రహదారి పక్కన ఎలాంటి చెత్త చెదారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 



Updated Date - 2021-06-19T06:13:18+05:30 IST