ప్రమాణోత్సవంలో మాట్లాడుతున్న జనసేన నేత రామకృష్ణ, కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అధ్యక్షుడు గిరీష్
కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో కొనకళ్ల విద్యాధరరావు
మచిలీపట్నం టౌన్, జనవరి 23 : కార్పొరేట్ వ్యాపార సంస్థల వల్ల చిన్న వ్యాపారాలు గణనీయంగా పడిపోయాయని విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు అన్నారు. ఖొజ్జిలిపేట బృందావనపుర కల్యాణ మండపంలో ఆదివారం కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. 96 మందిని కార్యవర్గ సభ్యులుగా కమిటీలో ప్రాధాన్యత కల్పించారు. ఈ కార్యక్రమానికి కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అధ్యక్షుడు మద్దుల గిరీష్ అధ్యక్షత వహించగా, కమిటీ సభ్యులతో కొనకళ్ల విద్యాధరరావు ప్రమాణస్వీకారం చేయించి మాట్లాడారు. ఐకమత్యంగా ఉద్యమించడం వల్ల క్లాత్ వ్యాపారంపై జీఎస్‌టీ పెరగకుండా చేసుకున్నామన్నారు. జిల్లా అధ్యక్షుడు మద్దుల గిరీష్ మాట్లాడుతూ చిరు వ్యాపారులు తమ సరుకులు నిల్వ చేసుకునేందుకు బందరులో వ్యవసాయ మార్కెట్ గిడ్డంగులను ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని తనయుడు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.