థాయిలాండ్‌లో ఓ తెలుగు జేజమ్మ!

ABN , First Publish Date - 2020-06-07T13:46:40+05:30 IST

బుద్ధుడి తరవాత అంతటి మహిమాన్వితురాలుగా థాయి ప్రజలు ఆరాధించే చామదేవి తెలుగు మూలాలున్న చారిత్రక మహిళ. క్రీ.శ. ఏడవ శతాబ్దిలో ఉత్తర థాయిలాండ్‌లో హరిపుంజాయి రాజ్యాన్ని ఆమె స్థాపించారు.

థాయిలాండ్‌లో ఓ తెలుగు జేజమ్మ!

బుద్ధుడి తరవాత అంతటి మహిమాన్వితురాలుగా థాయి ప్రజలు ఆరాధించే చామదేవి తెలుగు మూలాలున్న చారిత్రక మహిళ. క్రీ.శ. ఏడవ శతాబ్దిలో ఉత్తర థాయిలాండ్‌లో హరిపుంజాయి రాజ్యాన్ని ఆమె స్థాపించారు. ఆ రాజ్యంలో బౌద్ధ మతాన్ని ప్రవేశపెట్టి సుస్థిరంగా వర్ధిల్లేందుకు ఎనలేని కృషి చేశారు. రాజనీతిజ్ఞురాలుగా, నాగరికత ప్రవర్థకురాలుగా వాసి కెక్కిన ఈ అసాధారణ మహిళ గురించి తెలుగు ప్రజలు మరింతగా తెలుసుకోవల్సిన అవసరం ఉన్నది.


‘ఓకూన్ సమయా తిలంగాణ దేసటోన్ మొన్ సమొన్ కౌ సా ఉన్ చకమున్ దౌం తరౌం దెహ్ పౌబ్బ త్వై వాగెదోం టోం తరింపర్వా న్వా సువణ్ణ మించెలా సుద్ద పలతరె య్ కొ చొకలొం రూం (ఓ కొడుకా మన నేల తెలంగాణ.. మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే మనం పడవల్లో ఎర్రరాళ్లున్న ఈ సువర్ణభూమికి వచ్చాం...)’. బర్మాలో దొరికిన ఈ జోలపాట ఆధారంగా మన్ జాతీయుల గురించి లోతైన అధ్యయనం చేస్తుంటే రాణి చామదేవి ఘనచరిత్ర తెలిసివచ్చింది. థాయిలాండ్‌లో తొలి రాజ్యాన్ని స్థాపించిన మన్ జాతీయురాలు చామదేవి. ఈమెకు చిన్నమ, జామదేవి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లలో తెలుగు దనం ఉట్టి పడుతోంది. బర్మాలోనే కాదు, థాయిలాండ్‌లో కూడా తొలి రాజ్యాలను స్థాపించింది మన తెలుగు మూలాలున్నవారే.


నేడు ఉత్తర థాయిలాండ్ లో ఉన్న హరిపుంజాయి రాజ్య స్థాపకురాలు చామదేవి. ఏడో శతాబ్దికి చెందిన రాణి. మన్ రాజ్యమైన లోపబరి రాకుమార్తె. రామన్నగర రాజు రామరత్ ను వివాహం చేసుకుంది. సుతేప్ అనే రుషి, వాంగ్, పింగ్ నదుల మధ్య లంఫూన్ నగరాన్ని నిర్మించి దాన్ని పరిపాలించవలసిందిగా లోపబరి రాజును కోరతాడు. అతడు తన కూతురు చామదేవికి ఈ బాధ్యతను అప్పగిస్తాడు. సైనిక సపరివారంగా మూడు నెలలు నౌకా ప్రయాణం చేసి చామదేవి లంఫూన్ నగరాన్ని చేరుకుంటుంది. వివిధ శాస్త్ర నిపుణులతో పాటు అయిదు వందల మంది బౌద్ధ గురువులను తనతో పాటు తీసుకువచ్చింది. ఇలా చామదేవి వల్ల బౌద్ధం, నాగరికత ఆ నేలకు పరిచయమయ్యాయి.


ఏదో కారణం వల్ల చామదేవితో ఆమె భర్త రాలేదు. కానీ అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమె కొన్ని నెలలకు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. చామదేవి తన రాజ్యాన్ని ఎంతగానో అభివృద్ధి పరిచింది. కోటలనూ, బౌద్ధాలయాలనూ ఆరామాలనూ నిర్మించింది. వ్యవసాయాన్ని ముఖ్యంగా వరి పండించడాన్ని, నేతనూ, సంగీత, నృత్యాలనూ పరిచయం చేసింది. ప్రజలు ఆమెను దేవతలా ఆరాధించారు. చామదేవి తన కొడుకులను ధీరులుగా తీర్చిదిద్దింది. పెద్ద కొడుకును లంఫూన్ కు, చిన్నకొడుకును తాను అభివృద్ధి చేసిన మరో నగరం లంపాంగ్ కు రాజులుగా పట్టాభిషిక్తులను చేసింది. తొంభై ఏళ్ల పండు వయసులో తనువు చాలించింది. చామదేవి చరిత్రకు సంబంధించి రెండు గ్రంథాలు బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి భోధిరామ్ సిరి రాసిన ‘చామదేవి వంశం’, రెండోది బౌద్ధ గురువు రత్తనపన్న రచించిన ‘జినకలమాలిని’. అయితే ఈ రెండు పాలీ గ్రంథాలు పదిహేనో శతాబ్దికి చెందినవి కావడం వల్ల చామదేవి చరిత్రలో కల్పనలే ఎక్కువని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


చామదేవి గురించి మరిన్ని వివరాలు సేకరించడానికి థాయిలాండ్ వెళ్లాను. రాజధాని బ్యాంకాక్ తరవాత ఆ దేశంలో అతి పెద్ద నగరం చియాంగ్మయి. ఉత్తర థాయిలాండ్ లో ఉన్న ఈ నగరానికి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది లంఫూన్. అక్కడి దర్శనీయ ప్రదేశాల్లో ‘వాట్ చామదేవి’, ‘చామదేవి మెమోరియల్ పార్క్’ ప్రముఖమైనవి. నగరం మధ్యలో ఉన్న పార్క్ లో నిలువెత్తు చామదేవి విగ్రహం వెంటనే ఆకట్టుకుంటుంది. నల్లని పాలరాతి విగ్రహం అది. కుడి చేతిలో పూమాల, ఎడమ చేతిలో ఖడ్గం... అంటే శరణాగతుల సంరక్షకురాలు, శత్రువుల పాలిట చండశాసనురాలు. అన్నిటికీ మించి ఎడమ వైపు పైట వేసుకున్నట్టుగా ఆ శిల్పాన్ని చెక్కడం ఒక విశేషం. అది తెలుగు మగువల చీరకట్టు ఆహార్యం. చామదేవి ఈ భూమ్మీద నడయాడి పన్నెండు వందల ఏళ్లయినా ఆమె పేరు అలాగే ఉంది, ఆహార్యమూ అలాగే ఉంది. కనుముక్కు తీరులో థాయి రీతులు కన్పిస్తున్నా ఆ శిల్పంలో తెలుగు మూలాలు సుస్పష్టం. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ పూలు, పళ్లబుట్టలు, అగరవత్తులతో వస్తున్నారు. విగ్రహం ముందు దీపాలు వెలిగించి మోకాళ్ల పై కూర్చుని ప్రార్థిస్తున్నారు. కొన్ని జంటలు ఆమె విగ్రహాన్ని చూస్తూ నిశ్శబ్దంగా వేడు కుంటున్నట్టుగా కన్పించాయి. కొందరి కళ్ల నుంచి నీళ్లు జలజలా రాలడం కూడా కన్పించింది. ‘చామదేవి పేరు థాయి పేరులా లేదే, ఈమె ఎవరు? ఈమె గొప్పతనం ఏమిటి’ అని పక్కనున్న వాళ్లని ప్రశ్నిస్తే... ‘ఈమె పేరు ఇండియన్‌లా ఉంటుంది. మన్ జాతి రాణి. ఆమె ఆత్మ ఈనాటికీ ఈ ప్రాంతాన్నంతా పరిరక్షిస్తోందని మా విశ్వాసం. మా కోర్కెలను తీర్చే కల్పవల్లి. మాకు ఏ కష్టం వచ్చినా... అనారోగ్యం పాలైనా, ఉద్యోగం రాకపోయినా, పిల్లలు కలగకపోయినా ఆమెకే విన్నవించుకుంటాం. బుద్ధుడి తరవాత అంతటి మహిమాన్వితురాలు, ఆరాధ్యనీయురాలు’ అని థాయి ప్రజలు చెబుతుంటే మనం పులకించిపోకుండా ఎలా వుండగలం? 


‘వాట్ చామదేవి’ అంటే మరేదో కాదు ఆమె సమాధి. పిరమిడ్ ఆకారంలో ఉన్న ఇరవై ఒక్క మీటర్ల ఎత్తున్న అయిదు అంతస్తుల బౌద్ధస్థూపం అది. ప్రతి అంతస్థులోను నాలుగు వైపులా నిలువెత్తు బుద్ధుడి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా అగరవత్తులు, కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. రకరకాల పళ్లను, వరి మొలకలను నివేదనగా సమర్పిస్తున్నారు. చామదేవి అస్థికలపై ఈ స్థూపాన్ని ఆమె పెద్దకొడుకు నిర్మించాడట. ఈ ప్రాంగణంలోనే ఉన్న బౌద్ధారామంలో గోడల నిండా చామదేవి జీవిత చరిత్రంతా పెయింటింగులుగా వేశారు. అక్కడ షాపుల్లో అనేక సైజుల్లో చామదేవి ప్రతిమల్ని అమ్ముతున్నారు. ఆఖరుకు కీచెయిన్లు, వాల్ పోస్టర్లు, స్టిక్కర్ల మీదకూడా ఆమె రూపమే. ఓ నడివయసు జంట చామదేవి వెండి ప్రతిమని కొనుగోలు చేస్తున్నారు. ‘చామదేవి ప్రతిమ ఇళ్లల్లో ఉంటే ఎలాంటి దుష్టశక్తులూ దరిచేరవు అన్నది థాయి ప్రజల విశ్వాసం...’అంటూ ఆ జంట తెలియజేయడం ఆశ్చర్యం కలిగించింది.


లంఫూన్లోనే ఉంది ‘హరిపుంజాయి నేషనల్ మ్యూజియం’. ఇక్కడ కొన్ని శిలాశాసనాలు, పురావస్తువులను ప్రదర్శనలో ఉంచారు. మన్ లిపిలో ఉన్న శిలాశాసనాలు ఎనిమిది ఉన్నాయి. మన్ లిపికి మూలం దక్షిణ భారతదేశానికి చెందిన పల్లవ లిపి అని స్పష్టంగా ఆంగ్లంలో పేర్కొన్నారు. చామదేవి కాలానికి చెందిన శాసనాలు మాత్రం కన్పించలేదు. హరిపుంజాయి మ్యూజియంలో ఎంట్రీ టికెట్ కొనుగోలు చేసినప్పుడు ఓ చిన్న బుక్ లెట్ ఇచ్చారు. అందులో తొలి వాక్యాలు చదవగానే మతిపోయినంత పనైంది. పింగ్, వాంగ్ నదుల మధ్య ఉన్న భూగాన్నంతా ఒకప్పుడు ‘సమాంద్ర ప్రదేశ్ (రాజ్యం)’ గా పిలిచేవారని పేర్కొన్నారు. అలాగే లంపాంగ్ నగరాన్ని ‘కెలంగ్ కనకార నగరం’ అని కూడా పిలుస్తారట. ఇందులో కెలంగ్ అనేది మన కళింగకి దగ్గర రూపంగా అన్పిస్తోంది. ఆంధ్ర, కెలంగ్ పదాలు థాయిలాండ్‌లో చామదేవి కాలం అంటే ఏడో శతాబ్దలోనే వాడుకలో ఉన్నాయా?


దీనిపై వివరణ కోసం ‘ఛియాంగ్మయి యూనివర్సిటీ’ ఫ్రొఫెసర్లను ఆశ్రయించినా తగిన సమాధానం దొరకలేదు. కానీ ఆగ్నేయాసియాలో తొలి రాజ్యాలపై హిందూ ప్రభావం ఉందని చెప్పారు. అలాగే చామదేవి మరో నామం చిన్నమ ఆధారంగా చియాంగ్మయి పేరు ఈ నగరానికి వచ్చిందని తెలియజేశారు. చామదేవి వంశం వాళ్లు అయిదు వందల ఏళ్ల పాటు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. పదకొండో శతాబ్దిలో లాన్నా రాజు మంగ్ రాయ్ హరిపుంజాయిని చేజిక్కించుకున్నాడు. చామదేవి వంశ పాలకుల్లో నూకరాజు, దాసరాజు, గుత్త ఇలా స్వచ్ఛమైన తెలుగు పేర్లు ఉండడం విశేషం.


థాయిలాండ్ ను నేడు పరిపాలిస్తున్న రాజకుటుంబం చక్రి వంశానికి చెందింది. వీళ్లు కూడా మన్ జాతికి చెందిన వాళ్లే. ప్రస్తుత రాజు వజిరాలాంగ్కార్న్ ఏకైక కూతురి పేరు ‘సిరివన్నెవారి నారీరతన రాజకన్య’. థాయి యువరాణి పేరులో తెలుగు భాషకు చెందిన ‘వారు’ ప్రత్యయం ఉంది. ఆ దేశంలో నేటికీ మన్ మూలాలు, తద్వారా తెలుగు మూలాలు అక్కడక్కడా సజీవంగా కన్పిస్తున్నాయి. వాస్తుపరంగా చూసినా థాయిలాండ్‌లో లభ్యమైన తొలి బుద్ధవిగ్రహం ఆంధ్రప్రదేశ్ నమూనాలో ఉందని ‘లాస్ట్ కింగ్ డమ్స్ అండ్ హిందూ –బుద్ధిస్ట్ స్కల్ప్చర్ ఆఫ్ ఎర్లీ సౌత్ఈస్ట్ ఏసియా’ గ్రంథంలో బ్రిటీష్ చరిత్రకారుడు జాన్ గై పేర్కొనడం విశేషం. థాయిలాండ్లో క్రీస్తు శకం అయిదో శతాబ్దినాటి ద్వారావతి రాజ్యానికి, ఏడో శతాబ్ది నాటి చామదేవి హరిపుంజాయి రాజ్యానికి, నేటి చక్రి రాజవంశానికి తెలుగు నేలతో సంబంధాలు ఉన్నాయని పలు ఆధారాల వల్ల తెలుస్తున్నాయి. వందల ఏళ్లు గడిచిపోయినా ఓ తెలుగు పేరున్న రాణిని థాయి ప్రజలు నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తున్న చామదేవి ఘనకీర్తి తెలుగు నేలకి చేరకుండా ఇంతకాలమూ ఉండిపోయింది. మయన్మార్ మగాడు, థాయిలాండ్ చామదేవిలా... సుదూర దేశాల్లో ఘన చరిత్ర కెక్కిన మన ముత్తాతలు, జేజమ్మల గురించి సమగ్ర పరిశోధన జరగాల్సిన అవసరం వున్నది.

డి.పి.అనురాధ

9010016555

Updated Date - 2020-06-07T13:46:40+05:30 IST