‘విభజన’ హామీలపై ఉదాసీనత ఎందుకు?

ABN , First Publish Date - 2021-08-06T08:54:53+05:30 IST

‘‘ఆంధ్రుల హృదయాలను గాయపరుస్తారా? తెలుగింటి కోడలుగా విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై ఉదాసీనంగా వ్యవహరిస్తారా?’’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కమిటీ సారథి చలసాని శ్రీనివాస్‌

‘విభజన’ హామీలపై ఉదాసీనత ఎందుకు?

తెలుగింటి కోడలుగా సమస్యలు పట్టించుకోరా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలపై విభజన హామీల సాధన కమిటీ ధ్వజం


న్యూఢిల్లీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రుల హృదయాలను గాయపరుస్తారా? తెలుగింటి కోడలుగా విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై ఉదాసీనంగా వ్యవహరిస్తారా?’’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కమిటీ సారథి చలసాని శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు.. సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించమని కోరితే, 2013-14నాటి అంచనాలకే పరిమితమవుతామంటారా? అని నిలదీశారు. విభజన చట్టంలోని హామీలను అడిగితే నిర్లక్ష్యంగా, అవమానకరంగా మాట్లాడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగింటి కోడలన్న ఆశతోనే నిర్మలా సీతారామన్‌తో బుధవారం భేటీ అయ్యామని, అయితే, ఆమె ఏపీ విభజన హామీలు, పోలవరం, ప్రత్యేక హోదా తదితర అంశాలను ప్రస్తావించినప్పుడు సరైన రీతిలో జవాబు ఇవ్వక పోవడం, మౌనంగా ఉండి, వెటకారంగా మాట్లాడడం తమను బాధించిందని చలసాని పేర్కొన్నారు.


పోలవరం నిధుల గురించి ప్రస్తావిస్తే, అసలు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేపట్టడం తప్పన్నట్టుగా మంత్రి వ్యాఖ్యానించారని తెలిపారు. పోలవరానికి రూ.20 వేల కోట్లు ఇచ్చేశామని, కేంద్ర మంత్రి మండలి ఆమోదం లేకుండా ఇకపై ఏమీ ఇవ్వలేమని నిర్మల చెప్పేశారని, ఇది చాలా దారుణమని చలసాని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అం శాన్ని ప్రస్తావిస్తే, ప్రైవేటీకరణకు మద్దతుగా, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మంత్రి నిర్మల మాట్లాడారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే, విభజన సమస్యలు పరిష్కరిస్తారా? ఇతర పార్టీలు అధికారంలో ఉంటే పట్టించుకోరా? అని చలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


పోలవరానికి త్వరలో నిర్మల!

పోలవరం నిర్వాసితుల సమస్యను ప్రస్తావించినప్పుడు కేంద్ర జలశక్తి మంత్రితో చర్చించిన తర్వాత అవసరమైతే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని మంత్రి నిర్మల చెప్పినట్టు చలసాని తెలిపారు. కాగా, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు విభజన చట్టం ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రం నాటకమాడుతోందని విమర్శించారు. 

Updated Date - 2021-08-06T08:54:53+05:30 IST