శంకర్‌విలాస్ సెంటర్ వద్ద నిరసన తెలుపుతున్న చలసాని శ్రీనివాస్ తదితరులు
చలసాని శ్రీనివాస్
గుంటూరు(తూర్పు), జూలై5: భీమవరం సభలో విభజన హామీలపై ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడం మోసపూరిత చర్యని రాష్ట్ర ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. విభజన హామీలను నెరవేర్చాలంటూ మంగళవారం శంకర్‌విలాస్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు ఆంధ్రుల హక్కులతో పాటు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని మోదీ గుర్తుపెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ సైతం వేదిక మీద ఏమీ మాట్లాడకుండా వినతిపత్రం అందజేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒకటి, రెండు పార్టీలు మినహా మిగిలినవారు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని ఆరోపించారు. పవన్‌కల్యాణ్ లాంటి వ్యక్తులు బయటకు వచ్చి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కోన్నారు. రాష్ట్రాన్ని గుజరాతీల కబంధ హస్తాల్లో నుంచి విడిపించాల్సిన బాధ్యత రాజకీయపార్టీలపై ఉందన్నారు. విభజన హామీల సాధన కోసం కలిసివచ్చేవారితో పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పి.మల్లికార్జునరావు, తాడికొండ నరసింహరావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.