దానవీరశూర కర్ణలో నాతో ఎన్టీఆర్ 5గెటప్‌లు వేయించారు

ABN , First Publish Date - 2020-02-08T08:57:22+05:30 IST

హీరో కావాలనుకుని మద్రాసు వచ్చి విలన్‌గా మారారు నటుడు చలపతిరావు. విలనిజంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. .

దానవీరశూర కర్ణలో నాతో ఎన్టీఆర్ 5గెటప్‌లు వేయించారు

హీరో కావాలనుకుని మద్రాసు వచ్చి విలన్‌గా మారారు నటుడు చలపతిరావు. విలనిజంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఎన్టీఆర్‌తోనే తన సాన్నిహిత్యం ఎక్కువంటున్న ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకపోవడానికి కారణాలను చెబుతున్నారు. దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్‌ కంటే తానే ఎక్కువ పాత్రలు పోషించాననీ చెబుతున్నారు. సినీరంగంపై మక్కువతో తన కుమారుడిని దర్శకుడిగా, నటుడిగా తెలుగు తెరకు పరిచయం చేశారు. నాటి, నేటి తరం సినీరంగానికి చాలా తేడా ఉందంటున్న చలపతిరావుతో 15-9-14న ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ జరిపిన ఓపెన్‌ హార్ట్‌ విత ఆర్కేలోని ముఖ్యాంశాలివి...


ఆర్కే : ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం ఎలా అనిపిస్తోంది?

చలపతిరావు : ఈ యాభై ఏళ్లలో 1200 లకు పైగా సినిమాల్లో నటించాను. చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి ఒడి దుడుకులు లేవు. కళామతల్లి నమ్ముకున్న వారికి ఎన్నడూ అన్యాయం చేయదు. అందరికీ అన్నం పెడుతుంది. అందరూ పొట్ట చేత్తో పట్టుకుని మద్రాసుకు వచ్చినవారే. అందరినీ కళామతల్లి ఆదరించింది.


ఆర్కే : అందరూ సక్సెస్‌ కాలేదు కదా? కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం జరిగింది కదా?

చలపతిరావు : శక్తిని మించి పనిచేయకూడదు. హెచ్చుకు పోయి సినిమాలు తీస్తారు. సినిమా పోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటారు. బడ్జెట్‌కి మించి సినిమా చేయని వారెవరూ నష్టపోలేదు.


ఆర్కే : 1200 సినిమాల్లో నటించిన మీరు ఎందుకు సినిమా నిర్మాణం వైపు మొగ్గు చూపలేదు?

చలపతిరావు : నేను నిర్మాతగా అయిదు సినిమాలు నిర్మించాను. అయితే బడ్జెట్‌లో తీశాను.


ఆర్కే : సినిమా ప్రవేశం ఎలా జరిగింది?

చలపతిరావు : చిన్నప్పటి నుంచి అన్ని క్లాసుల్లోనూ ఫెయిల్‌ అవుతూ వచ్చినవాన్నే. అలా డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ వరకు వచ్చాక ఇక చదువు రాదనే విషయం అర్థమైపోయింది. దాంతో ఇక నాటకాల మీద పడ్డాను. నాటకాల్లో బాగా చేసే సరికి చుట్టూ ఉన్న వాళ్లు ’నీకేంటిరా! మద్రాసు వెళితే నువ్వే హీరో అవుతావు’ అని పొగిడేసరికి మద్రాసు బయలుదేరా. అప్పుడు తెలిసింది దాని లోతు ఎంతో. అసలు స్టూడియోలోకి అడుగు పెట్టనిస్తారా లేదా అనే సందేహం ఉండేది. నా 22వ ఏట నుంచే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను.


నాకు మొదటి నుంచి డేర్‌ ఎక్కువే. ఆ డేర్‌తోనే దూసుకెళ్లా. అయితే మా పెద్దనాన్నలు వ్యవసాయం చూసుకునే వారు. నేను వ్యవసాయం వైపు వెళ్లకూడదు, చదువు కోవాలని వాళ్లకు ఉండేది. కానీ నాకేమో డిగ్రీతోనే చదువు మన వళ్ల కాదని తెలిసిపోయింది. అయితే నాకు సంతృప్తినిచ్చిన విషయం ఏంటంటే నా ముగ్గురు పిల్లలు పీజీ పూర్తి చేశారు. అబ్బాయి రవిబాబు (నటుడు, దర్శకుడు) ఎంబీఏ చేశాడు. ఒక అమ్మాయి ఏంఎ, రెండవ అమ్మాయి ఎంఎస్‌ చేసింది. వాళ్లు బాగా చదువుకున్నారన్న సంతృప్తి నాకు చాలు. వాళ్లని, వాళ్ల పిల్లలను అప్పుడప్పుడు ఊరికి కూడా తీసుకెళుతుంటాను.  


ఆర్కే : ప్రతీ సంవత్సరం ఊరెళుతుంటారా?

చలపతిరావు : తప్పకుండా వెళతాం. మా ఊరు బల్లిపర్రు. ఊరి వాతావరణం బాగుంటుంది. ఊర్లో మా పెద్దనాన్న పిల్లలు ఉంటారు. వెళ్లినపుడు అందరినీ కలిసి సంతోషంగా గడుపుతాం.


ఆర్కే : సినిమా అవకాశాలు వెతుక్కుంటూ మద్రాసు వెళ్లినపుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు?

చలపతిరావు : 1967లో మద్రాసు వెళ్లాను. వెళ్లేటప్పుడు లక్ష రూపాయలు తీసుకెళ్లాను. ఆ డబ్బుతో స్థలం కొని ఇల్లు కడతామని అనుకున్నా. తరువాత మనం ఇక్కడ ఉండే వాళ్లం కాదు కదా అని ఆ ప్రయత్నం విరమించుకున్నా. ఆ డబ్బుతో ఒక సినిమా డబ్‌ చేసి విడుదల చేశా. అది పోయింది. తరువాత కారు కొన్నా. దానికి యాక్సిడెంట్‌ అయింది. ఆ విధంగా లక్ష రూపాయలు అయిపోయాయి. కొంచెం లగ్జరీ లుక్‌ ఇస్తే హీరో వేషాలు వస్తాయని అనుకునే ఇవన్నీ చేశా. కానీ అవన్నీ పనికి రావని తేలిపోయింది.


అప్పటికే శోభన్‌బాబు, కృష్ణ గారు సినిమాల్లో హీరో వేషాల కోసం ప్రయత్నిస్తున్నారు. మనకు హీరో వేషం రాదని తేలిపోయాక విలన్‌గానైనా ట్రై చేద్దామనుకున్నా. అప్పటికే రాజనాల, ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ వాళ్లందరూ విలన్‌గా రాణిస్తున్నారు. దాంతో విలన్‌గా కూడా అవకాశం రాలేదు. ఏం చేయాలో తెలియక ఎన్టీఆర్‌ను కలుద్దామని వెళ్లాను. అప్పట్లో తిరుపతి యాత్రకు వచ్చిన వాళ్లు మద్రాసు వచ్చి రామారావు గారిని చూసిన తరువాతే వెళ్లే వారు. అలా ఆ గుంపులో కలిసి ఉదయం 5 గంటలకే రామారావు గారిని చూడటానికి వెళ్లాను. అయితే అందరూ వెళ్లిపోయాక నేను మాత్రం అక్కడే నిలుచున్నాను. రామారావు నన్ను గమనించారు. ఏంటి విషయం? అని అడిగారు. ఇలా వేషాల కోసం వచ్చాను అని చెప్పాను. అవకాశాలు దొరకడం చాలా కష్టం. తిరిగి ఊరెళ్లిపో అన్నారు.

మనకేమో ఊరికి ఏ ముఖం పెట్టుకుని వెళతాం. అందుకని అక్కడే ఉండిపోయా. వారం రోజుల తరువాత మళ్లీ ఎన్టీఆర్‌ ఇంటికెళ్లా. నన్ను చూసి ఏం ఇంకా ఊరెళ్లిపోలేదా? అని అడిగారు. సినిమాల్లో నటించాల్సిందే. సినిమాల్లో వేషాలు వేయకుండా ఊరెళ్లనన్నాను. దాంతో పక్కనే ఉన్న డైరెక్టర్‌తో మొండోడులా ఉన్నాడు ఏదైనా వేషం ఉంటే ఇవ్వండయ్యా అన్నాడు. అప్పుడు ‘కథానాయకుడు’ మొదలుపెట్టారు. అందులో మునిసిపల్‌ కమిషనర్‌గా వేషం ఇచ్చారు. అలా నా సినిమా ప్రయాణం మొదలయింది.


ఆర్కే : ఏ సినిమాతో బ్రేక్‌ వచ్చింది?

చలపతిరావు : కథానాయకుడు తరువాత నా సాన్నిహిత్యం అంతా రామారావు గారితోనే ఉండేది. నా దృష్టిలో ఆర్టిస్టు అంటే రామారావుగారే. మిగతా వారికి నేను విష్‌ కూడా చేసే వాన్ని కాదు. దాంతో రామారావు క్యాండిడేట్‌ అని ముద్రపడిపోయింది. అలా ఆరేడేళ్ల పాటు రామారావు గారి సినిమాలు మాత్రమే చేశాను. అప్పుడు ‘దానవీరశూరకర్ణ’ సినిమా మొదలయింది. అదే సమయంలో మరో సినిమా కూడా షూటింగ్‌ జరుగుతోంది. వాళ్లందరూ ఆర్టిస్టులందరినీ పట్టుకుపోయారు. ఒక్క ఆర్టిస్టు కూడా లేడు. దాంతో రామారావు గారు నన్ను పిలిపించారు.

అప్పటికి మనం తినడం, పడుకోవడం అంతా స్టూడియోలోనే. ఆ సినిమాలో నాతో ఐదు వేషాలు వేయించారు. ఇంద్రుడు. శూతుడు, జరాసంధుడు...ఇలా రకరకాల గెటప్‌లు వేయించారు. నాకేమో మనసులో అనుమానం. ‘‘మీరేమో మూడు వేషాలు, నాకేమో ఇప్పటికే నాలుగు వేషాలయిపోయాయి. ఇంకో ఐదారు గెటప్‌లున్నాయి. చూసిన వాళ్లు నవ్వుతారేమో కదా’’ అని రామారావు గారితో అన్నాను. దానికి ఆయన పెద్దగా నవ్వి ‘‘కొన్ని ఊర్లలో ఎన్టీరామారావంటేనే తెలియదు. నిన్నెవరు గుర్తుపడతారు?’’ అన్నారు. దాంతో ఐదు వేషాలు వేశాను.

ఇక అక్కడి నుంచి గుర్తింపు వచ్చింది. చలపతిరావు ఐదు వేషాలు వేసాడని అందరు చెప్పుకోవడం మొదలెట్టారు. అక్కడి నుంచి వేషాలు రావడం మొదలయింది. నాగేశ్వర్‌రావు గారు స్టూడియో పిక్చర్‌లో నటించమని పిలిచారు. అప్పుడు తెలిసింది. అందరూ ఆర్టిస్టులే.. అందరినీ గౌరవించాలని. ఇక అప్పటి నుంచి అందరితో చేశా. విలన్‌గా నటించడం వల్ల రేప్‌ సీన్లు చేయాల్సి వచ్చేది. రావుగోపాలరావు విలన్‌గా నటించిన సినిమాల్లో రేప్‌ సీన్‌ ఉంది సార్‌ అంటే, ఆయన ‘ఎందుకయ్యా మనకు మన చలపాయ్‌ ఉన్నాడు, చేసేస్తాడు’ అనే వారు.


ఆర్కే : విలన్‌గా నటిస్తుంటే మీ భార్య ఒప్పుకున్నారా?

చలపతిరావు : మొదట ఒప్పుకోలేదండి. నాకు 19 ఏళ్లకే పెళ్లయింది. అంటే సినిమాల్లోకి రాకముందే పెళ్లయింది. సినిమా ప్రయత్నాల కోసం మద్రాసు వెళతానంటే మా ఆవిడ నాతో కొన్ని ఒట్లు పెట్టించుకుంది. ఆడాళ్ల జోలికి వెళ్లకూడదు, మందు ముట్టకూడదు, సిగరెట్‌ తాగకూడదు అని. మా ఆవిడ చెప్పిన దానికి ఒప్పుకున్నాను. అదే మాట పైన నిలబడ్డా. దానికి తోడు రామారావుతో సాన్నిహిత్యం కాబట్టి ఎక్కడా చెడు అలవాట్లు దరిచేరలేదు. ఏడున్నరకు తినడం, ఎనిమిదిన్నరకు పడుకోవడం. ఇప్పటికీ అదే అలవాటు. నా 28వ ఏట మా ఆవిడ చనిపోయింది.


అప్పుడు మా అబ్బాయికి ఆరేళ్లు, ఒకపాపకు నాలుగేళ్లు, ఇంకోపాపకు రెండేళ్లు. ఆ సమయంలో మా పిల్లలను పెంచమని చాలా మందిని అడిగా. నేను పెళ్లి చేసుకుంటాను, డబ్బులు పంపిస్తానని చెప్పా కాని, ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మా అమ్మని మద్రాసు తీసుకెళ్లి పిల్లల బాధ్యత అప్పజెప్పా. నేను పూర్తిస్థాయిలో సినిమాలపైన దృష్టిపెట్టా. చాలా మంది పెళ్లి చేసుకుంటామని వచ్చారు. కానీ ఇష్టం లేదని పంపించే వాణ్ణి. ఆ రోజు సినిమా షూటింగ్‌ జరిగిందంటే సాయంత్రం పెళ్లి ప్రపోజల్‌ వచ్చేది.


ఆర్కే : సినిమాల్లో రేప్‌ సీన్లు చేయడం వల్ల బయట ఏమైనా ఇబ్బందులు ఎదుర్కున్నారా?

చలపతిరావు : వెండితెరపై నన్ను అలా చూపించడం వల్ల నేను బాగా తాగుతానని, రేప్‌లు చేస్తానని అందరూ అనుకునే వారు. ఎక్కడైనా అవుట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళితే నేను ఉండే హోటల్‌లో హీరోయిన్‌లు ఉండే వాళ్లు కాదు. ్జ ఈ రోజుకి కూడా నేను తాగనంటే ఎవరూ నమ్మరు. పిల్లలు, వాళ్ల పెంపకం, సినిమాలు...ఇవే లోకంగా బతుకుతూ వచ్చా.


ఆర్కే : మీ భార్య ఎలా చనిపోయింది?

చలపతిరావు : మద్రాసులోనే... ఇంట్లోనే కిచెన్‌లో చీరకు నిప్పంటుకుని చనిపోయింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. వెనకాల వైపు మాత్రమే కాలింది. ఆసుపత్రిలో మూడు రోజుల తరువాత చనిపోయింది.


ఆర్కే : సినిమా నిర్మాణం ఎందుకు ఆపేశారు?

చలపతిరావు : ఆర్‌సి క్రియేషన్స్‌ పేరుతో సినిమా నిర్మాణం ప్రారంభించి బాలకృష్ణతో ‘కలియుగకృష్ణుడు’ సినిమా తీశా. అందులో లాభం వచ్చింది. ఆ తరువాత ‘కడప రెడ్డెమ్మ’, ‘జగన్మాటకం’... ఇలా కొన్ని సినిమాలు తీశా. బడ్జెట్‌లోనే తీశాను కాబట్టి నష్టాలు రాలేదు. కొన్ని టీవీ సీరియల్స్‌ కూడా తీశా. అప్పట్లో ఇన్ని యాడ్స్‌, ఇంత మార్కెట్‌ లేదు. దాంతో టీవీ సీరియల్స్‌లో నష్టం వచ్చింది. దానికి తోడు సినిమా వేషాలతో బిజీగా ఉండే వాన్ని. హైదరాబాద్‌, మద్రాసు తిరగడం కష్టమయ్యేది. అప్పటికే పిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాయి. దాంతో ఆఫీసు మూసివేశా.


ఆర్కే : మద్రాసులో ఆస్తులన్నీ అమ్మేశారా?

చలపతిరావు : రెండిళ్లు ఉంటే ఇద్దరు అమ్మాయిలకు చెరొకటి ఇచ్చా. రవికి పెళ్లి చేయడంతోనే వేరు కాపురం పెట్టుకొమ్మని చెప్పా. ఒక్కడే కొడుకు, తండ్రి బయట ఉంటే అందరూ ఎమనుకుంటారు అని అంటే ‘‘ఏం పర్వాలేదు, ఎవరో ఏదో అనుకుంటారని మనం బాధపడటంలో అర్థంలేదు. నీవు, నీ భార్య సంతోషంగా ఉంటే చాలు’’ అని చెప్పా. ఇప్పుడు నాతో పాటు డ్రైవర్‌, ఒక కుర్రాడు, ఒక వంటమనిషి ఉంటారు.


ఆర్కే : ఎన్టీఆర్‌గారితో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు?

చలపతిరావు : ఆయన, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడుకునే వాళ్లం. అందరి ముందు మాత్రం భాష చాలా కంట్రోల్‌ ఉంచుకునే వాన్ని. అలాగే ఎన్టీఆర్‌ పిల్లికి బిచ్చం పెట్టడని చాలా మంది అంటారు. కానీ అదంతా పచ్చి అబద్దం. ఆయన ఎన్ని గుప్తదానాలు చేశారో నాకు తెలుసు. కెవి రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం నేను చూశా. ఎంతో మంది చదువుకు సహాయం చేశారు. అటువంటి మనిషిపైన షూటింగ్‌ల నుంచి బట్టలు తీసుకెళతాడని ప్రచారం చేసే వారు.


ఆర్కే : అవును, షూటింగ్‌ల నుంచి టవల్స్‌ తీసుకెళతాడని అనేవారు, నిజమేంటి?

చలపతిరావు : ఇదే విషయం రామారావు గారిని అడిగాను. అన్నగారు ఇలా అంటున్నారు అని.


ఆర్కే : అవును, షూటింగ్‌ల నుంచి టవల్స్‌ తీసుకెళతాడని అనేవారు, నిజమేంటి?

చలపతిరావు : ఇదే విషయం రామారావు గారిని అడిగాను. అన్నగారు బయట ఇలా అనుకుంటున్నారని. వాళ్ల బొంద, అనుకుంటే అనుకోని మనకేం అన్నారు. మనం వేసుకునే మేకప్‌ లక్ష్మితో సమానం. ఆ మేకప్‌ తుడుచుకున్న టవల్‌ అక్కడే వదిలేస్తే వాళ్లు తరువాత దానితో మూతి తుడుచుకుంటారు, ఇంకేదో తుడుచుకుంటారు. అది నాకిష్టం ఉండదు. దాన్ని శుభ్రంగా ఇంటికి తీసుకెళ్లి ఉతికించి మళ్లీ వాడతాను అన్నారు. అది ఆయన టవల్స్‌ను తీసుకెళ్లడం వెనక ఉద్దేశం.


ఆర్కే : రామారావు గారితో అంత అటాచ్‌మెంట్‌ ఉన్న మీరు పార్టీలో ఎందుకు చేరలేదు?

చలపతిరావు : అడిగాను. చండశాసనుడు సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అప్పుడే పార్టీ పెట్టారు. ఆ షూటింగ్‌లోనే అన్నగారు మీరు పార్టీ పెడుతున్నారు. మమ్మల్ని వచ్చేయమంటారా అని అడిగాం. వద్దు, వద్దు ఇప్పటికే నేను బురదలో కూరుకుపోయాను. మీరు కూడా ఇందులోకి వద్దు. సినిమాల్లోనే నటించండని చెప్పారు.


ఆర్కే : మీరు కష్టాల్లో ఉన్నప్పుడు రామారావు గారు ఆర్థిక సహాయం చేశారా?

చలపతిరావు : నేను డబ్బులను ఆయన దగ్గరే దాచుకునే వాన్ని. దానవీరశూరకర్ణ చేశాను. ఆ డబ్బులను అన్నగారిదగ్గరే పెట్టాను. అవసరాలకు పోను కొంత డబ్బును ఆయన దగ్గరనే పెట్టే వాన్ని.


ఆర్కే : ఏదో షూటింగ్‌లో జేడీ చక్రవర్తి, మీరు కొట్టుకున్నారని విన్నాం, నిజమేనా?

చలపతిరావు : కొట్టుకోలేదు ఎదురుపడ్డాం. జేడీకి అహం ఎక్కువ. నాకన్నీ తెలుసనుకుంటాడు. వీళ్లకు ఏమీ తెలియదని అనుకుంటాడు. ఎవరి నటన వాళ్లది. నువ్విలా నటించు అని చెప్పి కలగజేసుకుంటే గొడవలే జరుగుతాయి.


ఆర్కే : ‘నిన్నే పెళ్లాడతా’ వచ్చే సరికి పంథా మార్చినట్టున్నారు?

చలపతిరావు : అవును, ఫాదర్‌ క్యారెక్టర్‌లు రావడం మొదలయింది. అప్పటి వరకు ఆడాళ్లు నన్ను చూస్తే బయపడిపారిపోయే వారు. నిన్నే పెళ్లాడతా తరువాత అటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు, షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం మొదలయింది. అక్కడి నుంచి మళ్లీ కెరీరీ ఊపందుకుంది. కామెడీ పాత్రలు, బాబాయి, తండ్రి పాత్రలు ఇలా అన్నీ వేసాను.


ఆర్కే : ఇవీవీ కొడుకు, మీ అబ్బాయి ఒకేసారి కెరీరీ స్టార్‌ చేసినట్టున్నారు?

చలపతిరావు : ఇవీవీ, నేను మంచి స్నేహితులం. రోజులో నాలుగైదుసార్లు కలిసి మాట్లాడుకునే వాళ్లం. వాళ్లబ్బాయి నరేష్‌ను ఏం చేయాలని ఆయన తీవ్రంగా ఆలోచించే వాడు. అదే సమయంలో మా అబ్బాయి కూడా సినిమా డైరెక్షన్‌ చేస్తానని అడిగేవాడు. దాంతో నేనే నిర్మాతగా, నరేష్‌ హీరోగా అల్లరి సినిమా తీశాను. సురేష్‌బాబు కథ విని నేనూ పార్ట్‌నర్‌గా ఉంటానని అన్నాడు. సినిమాను 69 లక్షల్లో తీశాడు. రూపాయికి రూపాయి వచ్చింది. సినిమా పిచ్చి ఎక్కువ. బిజీగా ఉన్నాడు. షూటింగ్‌లో ఉంటే ఫోన్‌ కూడా తీయడు.


ఆర్కే : ఇప్పుడు ఇండసీ్ట్రలో ఉన్న వాళ్లకి మీరిచ్చే సలహా ఏంటి?

చలపతిరావు : ఈ జనరేషన్‌కు మనమేమీ సలహా ఇయ్యలేం. ఇచ్చినా వాళ్లు వినరు. కాబట్టి ఇయ్యడం వేస్ట్‌.


ఆర్కే : ఇన్నాళ్ల సినీ జీవితం తరువాత మీలో ఏం మార్పు చేసుకున్నారు?

చలపతిరావు : కోపం బాగా తగ్గించుకున్నాను. పీస్‌ఫుల్‌ లైఫ్‌ జీవిస్తున్నాను.


ఆర్కే : మీలో ప్లస్‌ ఏంటి?

చలపతిరావు : పట్టుదల. ఇంకా నా మైండ్‌ యూత్‌గానే ఉంటుంది. బాడీని కూడా యూత్‌గా ఉంచాలనే రోజూ వాకింగ్‌ చేస్తున్నాను.

Updated Date - 2020-02-08T08:57:22+05:30 IST