చలానాల వేట!

ABN , First Publish Date - 2021-07-26T06:01:48+05:30 IST

విశాఖ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు అసలు బాధ్యతలు గాలికి వదిలేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు రాయడం ఒక్కటే ప్రధాన లక్ష్యంగా డ్యూటీ చేస్తున్నారు.

చలానాల వేట!
మాస్క్‌ పెట్టుకోని వాహనదారుడిని ఫొటో తీస్తున్న పోలీసులు

ఆదాయం పెంపే ట్రాఫిక్‌ పోలీసుల లక్ష్యం

నిబంధనల ఉల్లంఘన పేరుతో ఎక్కడపడితే అక్కడ వాహనదారుల అడ్డగింత

ఫొటో తీసి, చలానాతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌


(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)

విశాఖ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు అసలు బాధ్యతలు గాలికి వదిలేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు రాయడం ఒక్కటే ప్రధాన లక్ష్యంగా డ్యూటీ చేస్తున్నారు. అది కూడా నేరస్థుల్ని వెంటాడి పట్టుకున్నట్టుగా ఒక వాహనాన్ని ఇద్దరు, ముగ్గురు చుట్టుముట్టి... రోడ్డు పక్కకు తీసుకువెళ్లి ఫొటోలు తీస్తున్నారు. ప్రధాన రహదారులన్నింటిపైనా నిత్యం ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. బీట్‌ కానిస్టేబుళ్లు వారికి కేటాయించిన ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్లను వదిలేసి స్తంభం పక్కన, చెట్ల పక్కన నక్కి... చిన్నాచితకా పనులపై హెల్మెట్‌ లేకుండా వెళ్లే వారిని ఆపి, ఫొటోలు తీసి చలానాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. కరోనా సమయంలో చాలామంది ఉపాధి లేక, మరికొంతమంది అరకొర వేతనాలతో ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి...నిబంధనల ఉల్లంఘన పేరిట వాహనదారులపై ఎడాపెడా చలానాలు జారీ చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


అవస్థలు పట్టించుకోరా?

వాహనంతో రోడ్డుపైకి వస్తే...ఏ విధంగా అవకాశం ఉంటే...అలా చలానా వేయడానికి చూస్తున్నారు. కొందరికి ముక్కుకు మాస్క్‌, నెత్తికి హెల్మెట్‌, కళ్లకు అద్దాలు పెట్టుకుంటే...ఊపిరి ఆడదు. అద్దాలపై ఫాగ్‌ వచ్చి...ఏమీ కనిపించదు. ఆ సమస్య వున్న కొందరు బండిపై వెళుతున్నప్పుడు హెల్మెట్‌ ఉంది కదా...అని మాస్క్‌ పెట్టుకోవడం లేదు. అలాంటి వారిని చూసిన పోలీసులు హెల్మెట్‌ వుందని వదిలిపెట్టకుండా... లోపల మాస్క్‌ లేదంటూ చలానా వేస్తున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆపి, హెల్మెట్‌ తీసి...ఫొటోలు తీస్తున్నారు. వారి తీరును ప్రజలు ముక్తకంఠంతో నిరసిస్తున్నారు. 

Updated Date - 2021-07-26T06:01:48+05:30 IST