‘చ‌క్ర’‌ మూవీ రివ్యూ

బ్యాన‌ర్‌: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ

న‌టీన‌టులు: విశాల్‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రెజీనా క‌సాండ్ర‌, మ‌నోబాల‌, రోబో శంక‌ర్‌, కె.ఆర్‌.విజ‌య‌, సృష్టిడాంగే త‌దిత‌రులు

సంగీతం: యువన శంక‌ర్ రాజా

సినిమాటోగ్ర‌ఫీ: బాల‌సుబ్ర‌మ‌ణియం

నిర్మాత‌: విశాల్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్‌.ఆనంద‌న్


హీరో విశాల్ 'పందెంకోడితో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రయ్యారు. ప్రారంభం నుంచి ఈ హీరో మాస్, యాక్ష‌న్ చిత్రాల్లోనే ఎక్కువ‌గా న‌టించాడు. అయితే ఈ మ‌ధ్య పంథాను మార్చి క‌థా బ‌ల‌మున్న సినిమాల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎంత డిఫ‌రెంట్ సినిమాలు చేసినా విశాల్ అంటే మాస్‌, యాక్ష‌న్ సీన్సే ప్రేక్ష‌కుల‌కు గుర్తుకు వ‌స్తాయి. ఇలాంటి ఇమేజ్ ఉన్న విశాల్ ఈ మధ్య క‌మ‌ర్షియ‌ల్ అంశాలతో పాటు మంచి మెసేజ్‌ను కూడా ఇచ్చే చిత్రాల‌ను చేస్తూ వ‌స్తున్నాడు. ఇది వ‌ర‌కు విశాల్ హీరోగా  న‌టిస్తూ  సైబ‌ర్ నేర‌గాళ్ల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెప్పే మెసేజ్‌ను ఇస్తూ చేసిన సినిమా అభిమన్యుడు. ఇప్పుడు అలాంటి సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం 'చ‌క్ర‌'. మ‌రి ఈ చిత్రంలో సైబ‌ర్ క్రైమ్ గురించి విశాల్ ఎలాంటి అవెర్‌నెస్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడో తెలుసుకుందాం..


క‌థ‌:


హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆగ‌స్ట్ 15న స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రుగుతుంటాయి. అదే స‌మ‌యంలో సిటీలో 50 చోట్ల దొంగ‌త‌నాలు జ‌రుగుతాయి. కేవ‌లం ఇద్ద‌రు దొంగ‌లు మాత్ర‌మే ఈ యాబై చోట్ల దొంగ‌త‌నం చేస్తారు. అది కూడా ముస‌లివాళ్లు ఉండే ఇళ్ల‌నే టార్గెట్ చేసి దోచుకుంటారు. మీడియా అంతా పోలీస్ డిపార్ట్‌మెంట్ తీరుని త‌ప్పుబ‌డుతుంది. దాంతో పోలీసులు వెంట‌నే దొంగ‌ల‌ను ప‌ట్టుకోవ‌డానికి గాయ‌త్రి(శ్ర‌ద్ధాశ్రీనాథ్‌) ఆధ్వ‌ర్యంలో ఓ టీమ్‌ను ఏర్పాటు చేస్తారు. అదే స‌మ‌యంలో మిల‌ట‌రీలో ప‌నిచేసే ఆఫీస‌ర్ చంద్రు(విశాల్‌) ఇంటిని కూడా దొంగలు దోచుకుని ఉంటారు. విష‌యం తెలుసుకుని చంద్రు కూడా రంగంలోకి దిగి పోలీసుల‌తో దొంగ‌ల‌ను ప‌ట్టుకోవడానికి చేతులు క‌లుపుతాడు. కేసుని డీల్ చేస్తున్న క్ర‌మంలో లీల(రెజీనా క‌సాండ్ర‌) మాస్ట‌ర్ మైండ్ ఉప‌యోగించి సిటీలో దొంగ‌త‌నాల‌ను చేయించింద‌ని చంద్రు ప‌సిగ‌డ‌తాడు. అస‌లు లీల ఎందుకు దొంగ‌త‌నాల‌ను చేయిస్తుంది చివ‌ర‌కు చంద్రు ఆమెను ఎలా ప‌ట్టుకున్నాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..స‌మీక్ష‌:


ఇది వ‌ర‌కు సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో విశాల్ హీరోగా, నిర్మాత‌గా చేసిన చిత్రం అభిమ‌న్యుడు. అలాంటి స్టైల్లో సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో చ‌క్ర సినిమాను రూపొందించాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.ఆనంద‌న్‌. అయితే క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లచ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయిన విష‌యం సుస్ఫ‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. కేవ‌లం ఇద్ద‌రు దొంగ‌లు యాబై చోట్ల దొంగ‌త‌నాలు చేయ‌డం విడ్డూరంగా అనిపిస్తుంది. దీని వెనుక రెజీనా క‌సాండ్ర పాత్ర ఉన్న‌ట్లు చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఆమె పాత్ర‌ను మ‌లిచిన తీరు బాగాలేదు. ఇక మ‌రో హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించింది. ఆమెకు, విశాల్‌కు మ‌ధ్య ల‌వ్ ట్రాక్ గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచిది. ఫ‌స్టాఫ్‌లో ఏదో క్లాస్ పీకుతున్న‌ట్లు అనిపిస్తుంది. అలాగే మిల‌ట‌రీ బ్యాక్‌డ్రాప్ ఉన్న హీరో, పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్న ఓ కేసులో త‌న‌కు తానే ఇన్‌వాల్వ్ అయిపోయి పోలీసుల‌ను డమ్మీలుగా చూపించే స‌న్నివేశాలు విడ్డూరంగా అనిపిస్తాయి. ఇక హీరో, రెజీనా.. నువ్వా నేనా అనేట‌ట్టు స‌న్నివేశాలుంటాయ‌ను‌కుంటే సెకండాఫ్ మ‌రింత నిరాశ‌కు గురి చేస్తుంది. విశాల్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా పాత్ర‌లో ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో చ‌క్క‌గా న‌టించాడు. శ్ర‌ద్ధాశ్రీనాథ్ కంటే రెజీనా పాత్ర‌కే ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉంటుంది. మ‌నోబాల‌, కె.ఆర్‌.విజ‌య త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. యువ‌న్ శంక‌ర్ రాజా నేప‌థ్య సంగీతం పెద్ద త‌ల‌పోటుగా అనిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. 


చివ‌ర‌గా.. 'చ‌క్ర'‌.. వ్యూహం బెడిసి కొట్టింది

Advertisement
Advertisement