వైభవంగా చక్రస్నానం

ABN , First Publish Date - 2022-10-07T08:07:05+05:30 IST

వైభవంగా చక్రస్నానం

వైభవంగా చక్రస్నానం

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం బుధవారం ఉదయం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామికి పల్లకీ ఉత్సవం నిర్వహించి 6 నుంచి 9 గంటల మధ్యలో భూవరాహస్వామి ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, సుదర్శన చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో భక్తసమూహంగా మునకలు వేయించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవిరంజన్‌, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఉత్సవర్ల వాహన సేవలో జస్టిన్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ధ్వజావరోహణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో  కలసి బంగారు తిరుచ్చిలో స్వామివారు సాయంత్రం 7 గంటలకు తిరువీధుల్లో ఊరేగారు. 9 గంటలకు పూజాదికార్యక్రమాలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఉన్న గరుడపటాన్ని శాస్త్రోక్తంగా కిందకు దిం చారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.


శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని బుధవారం దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన రాత్రి జరిగిన అశ్వవాహనసేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చక్రస్నాన వేడుకలో పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-07T08:07:05+05:30 IST