చైతన్యవాహిని కమల

ABN , First Publish Date - 2021-10-08T07:24:09+05:30 IST

పందొమ్మిది వందల ఎనభైయ్యవ దశాబ్దం స్త్రీల దశాబ్దం. స్త్రీలకు తమ అణచివేతను గురించి కొత్తగా అర్థం కావటం మొదలైన దశాబ్దం. విద్యావంతులైన స్త్రీలు అశాంతిగా, ఆరాటంగా తమ అస్తిత్వాల కోసం...

చైతన్యవాహిని కమల

పందొమ్మిది వందల ఎనభైయ్యవ దశాబ్దం స్త్రీల దశాబ్దం. స్త్రీలకు తమ అణచివేతను గురించి కొత్తగా అర్థం కావటం మొదలైన దశాబ్దం. విద్యావంతులైన స్త్రీలు అశాంతిగా, ఆరాటంగా తమ అస్తిత్వాల కోసం వెతుకులాడుతున్న దశాబ్దం. హైదరాబాదులో ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ ఏర్పడి ఫెమినిస్టు పుస్తకాలను, ముఖ్యంగా సిద్ధాంతాన్ని తేలికగా పరిచయం చేయడం కోసం తహతహలాడిన రోజులు. ఆ రోజుల్లో ‘‘What is Feminism’’ అనే చిన్న పుస్తకం దొరికింది. పాశ్చాత్య ఫెమినిస్టు సిద్ధాంతాలను చదువుతూ విసిగిన నాలాంటి మిత్రులకు అది సేదదీర్చే చిరుగాలి తరగయింది. రచయిత్రుల పేర్లు ఎంత అపురూపంగానో చూసుకున్నాం. కమల భసీన్‌, నిగత్‌ ఖాన్‌. ఒకరు భారతదేశం. ఇంకొకరు పాకిస్థాన్‌. అది తెలిసి మరింత సంతోషం. మిత్రుడు సమ్మెట నాగమల్లేశ్వరరావు అనువదిస్తే 1988లో ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ ప్రచురించింది. అప్పటి నుంచి వారిద్దరినీ చూడాలనే కోరిక 90వ దశాబ్దంలో నెరవేరింది. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో– స్ర్తీల ఉద్యమాల గురించిన సమీక్ష అని గుర్తు– కమల భసీన్‌ పరిచయమయ్యారు. ఆమె ఉత్సాహం, సెలయేరులా ప్రవహించే ఆమె స్వభావం, క్షణానికో పాట కట్టి ఆడుతూ ఆడిస్తూ పాడించే ఆమె చురుకుదనం, నవ్వులు, హాస పరిహాసాలూ ఒక్కసారి పరిచయమైతే చాలు మర్చిపోలేరు. నాయకులు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాను. ఇలాంటి నాయకులుంటే వారు ఎక్కువమందిని ప్రభావితం చేయగలుగుతారు అనిపించింది. కానీ నాలుగు దశాబ్దాల స్త్రీల ఉద్యమంలో భాగమైన నాకు కమల భసీన్‌ వంటివారు మరొకరు కనిపించలేదు. ఆమెను అనుకరించే ప్రయత్నం చేసినవారున్నారు గానీ విఫలమయ్యారు. 1995లో బీజింగ్‌లో జరిగిన సదస్సులో నిగత్‌ ఖాన్‌ను కూడా కలిశాను. ఆమె కమలకు భిన్నంగా గంభీరంగా ఉన్నారు.


ఆ తర్వాత కమల భసీన్‌ రాసిన ‘పేట్రియార్కీ’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాను. కొన్ని వేల కాపీలు ముద్రించి గ్రామీణస్థాయి కార్యకర్తల వరకూ అస్మిత ద్వారా తీసుకెళ్లగలిగాం. జండర్‌ గురించిన పాఠశాలలో పితృస్వామ్యం గురించి బోధించడానికి కమల భసీన్‌ పుస్తకం పాఠ్యపుస్తకంలా నిలిచింది. చాలా తేలికగా సంక్లిష్టమైన విషయాలను వివరించడం కమల ప్రత్యేకత. తర్వాత వసంత్‌ స్నేహితురాలిగా కమల గురించి తెలుసుకున్న కొద్దీ ఆమెపై అభిమానం పెరిగింది. కమల భసీన్‌ నేతృత్వంలో నేపాల్‌లో జరిగే జండర్‌ శిక్షణా తరగతులకు అస్మితలో పనిచేసిన వారెందరో హాజరయ్యారు. వారు దాదాపు రెండు నెలల కాలం అక్కడ గడిపి వచ్చేవారు. కమల పాటలతో, మాటలతో ప్రభావితులయ్యేవారు.


కమల కుమార్తె హఠాత్తుగా మరణించినప్పుడు మిత్రులందరూ కలవరపడ్డారు. ఆమె కోలుకోగలదా అని భయపడ్డారు. అందరి భయాలనూ వమ్ముచేస్తూ అదే ఉత్సాహంతో, తన దిగులును ఎక్కడో పాతేసి, లోకంలో ఆడపిల్లలందరూ తన పిల్లలే గదా అనే నమ్మకంతో కమల భసీన్‌ తిరిగి పనిలోకి దూకింది. స్త్రీలకు ఎంత శక్తి ఉంటుందో తనే ఉదాహరణగా నిలిచి చూపింది. 2019లో వసంత్‌, నేనూ, క్యాతీ శ్రీధర్‌ ఒక రాత్రి వసంత్‌ ఇంట్లో చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. కమలకు కబుర్లంటే పనే– దాదాపు మా అందరికీ అంతే. పని రాక్షసులమని నవ్వుకుంటాం. చిన్నపిల్లల కోసం జండర్‌ స్పృహ కలిగించే పాఠ్యపుస్తకాలను రాయడం గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకున్నాం. ఆ పని చాలా ముఖ్యమైందని అందరికీ తెలిసినదే. అయినా ఎందుకో చురుకుగా ఆ పని జరగడం లేదనుకున్నాం. ఒక భాషలో తయారైతే అన్ని భాషలలో అది ఉపయోగించవచ్చా అని చాలాసేపు మాట్లాడుకున్నాం. సహజంగానే వసంత్‌, కమల జోకులతో చాలా ఆనందంగా గడిచింది ఆ రాత్రి. అంతకుముందు ఎన్నిసార్లు కమలను కలిసినా ఆ రోజు మరింత దగ్గరగా అనిపించింది. 2020లో ఈ పాండమిక్‌ మా పనిని వెనక్కు నెట్టింది. ఐదారు నెలల క్రితం కమల అనారోగ్యం గురించి వసంత్‌ చెప్పారు. అంత అనారోగ్యంలోనూ, అత్యంత కఠినమైన చికిత్స తీసుకుంటూ కూడా కమల భసీన్‌ తన గొంతు మూగబోనివ్వలేదు. తన సన్నిహిత మిత్రుల గొంతులనూ నిదురపోనివ్వలేదు. ఆమె నివాసం పాటలతో మారుమోగడం, స్త్రీ చైతన్యగీతాలతో ప్రతిధ్వనించడం దూరాన ఉన్న మిత్రులు కూడా ఫేస్‌బుక్‌లో చూశారు, ఆశ్చర్యపోయారు. వ్యాధిని, బాధను, మరణాన్నీ ఉత్సవంలా జరుపుకోగలగటం గురించి మాట్లాడుకున్నారు. ఆ దృశ్యాలలో, కమల అంత బాధలోనూ మరణశయ్య మీద ఉండి కూడా తను జీవితాంతం నమ్మిన విశ్వాసాలను పాడుకుంటూ, పాడిస్తూ ఉండటం మనసును ఒకవైపు కలచివేసింది. మరొకవైపు ఆలోచింపజేసింది. ఆమె తన అంతిమయాత్రకు స్త్రీల భుజాల మీదుగానే వెళ్లారు.


ఒక తరం ఫెమినిస్టు నాయకత్వంలో కమల భసీన్‌ అగ్రశ్రేణికి చెందినవారు. తన లోపాలను, పొరపాట్లనూ అంగీకరించగల ధీరురాలు. తనను సిద్ధాంతపరంగా దాటి ముందుకు సాగిపోతున్న యువతరాన్ని స్వాగతించగల, వారి నుంచి నేర్చుకోగల ప్రజాస్వామిక విలువలు గల మనిషి. కమల భసీన్‌ సన్నిహితులు ఆమె గురించి మరింత రాయాలి. ఆమె పని విధానాలు, ఉత్సాహం, నిరంతర ఆశావహ దృక్పథం, స్త్రీల విషయంలో రాజీపడని తత్త్వం ఇవన్నీ భవిష్యత్‌ స్త్రీల ఉద్యమాలకు అందాలి.

ఓల్గా

Updated Date - 2021-10-08T07:24:09+05:30 IST