Abn logo
Sep 20 2021 @ 00:00AM

కొలువుదీరనున్న చైర్మన్లు.!

కడప జడ్పీ కార్యాలయం

24న మండల పరిషత్తు.. 25న జడ్పీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

అదే రోజు కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక

నోటిషికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

5వ జడ్పీ చైర్మన్‌గా ఆకేపాటి అమరనాథరెడ్డి బాధ్యతలు

గోపవరంపై వైసీపీ దృష్టి.. క్యాంపులో టీడీపీ ఎంపీటీసీలు


రెండేళ్ల తరువాత జడ్పీ, మండల పరిషత్తులకు నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. జడ్పీ చైర్మన్‌, మండలాధీశులు బాధ్యతలు చేపట్టనున్నారు. 24, 25 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే రోజు మధ్యాహ్నం కోఆప్షన్‌ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఇప్పటికే పల్లెసీమల్లో పంచాయతీ పాలన మొదలు కాగా.. తాజాగా పరిషత్తు పాలన కూడా ప్రారంభం కానుండడంతో ప్రత్యేక పాలనకు తెర పడనుంది. 5వ జడ్పీ చైర్మన్‌గా ఆకేపాటి అమరనాథరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ దక్కించుకున్న ఏకైక మండల పరిషత్తు గోపవరంపై అధికార పక్షం దృష్టి సారించడంతో టీడీపీ ఎంపీటీసీ సభ్యులను రహస్య క్యాంపునకు తరలించారు.

(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులలో ప్రత్యేక అధికారుల పాలనకు తెర పడనుంది. రెండేళ్ల తరువాత నూతన పాలకవర్గాలు కొలువదీరనున్నాయి. 2014 జూలై 4న మండల పరిషత్తు, 5న జడ్పీ పాలకవర్గం కొలుదీరాయి. 2019 జూలై 4వ తేదిన పాలకవర్గం ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. జడ్పీ, మండల పరిషత్తుల్లో 59.85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ప్రభుత్వం రిజర్వేషన్లు 50 శాతానికే తగ్గించడంతో ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయింది. 2020 మార్చి 9న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటికే పాలకవర్గం కొలువుదీరి ఏడాదిన్నర అయ్యేది. కరోనా మహమ్మారి విజృంభణతో గతేడాది మార్చి 14న అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ ఎన్నికలను వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించినా.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో ఓట్ల లెక్కింపు పూర్తి కావడం.. 24న మండల పరిషత్తు, 25న జడ్పీ అధ్యక్ష, ఉపాఽఽధ్యక్షుల ఎంపికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిషికేషన్‌ ఇవ్వడంతో ప్రత్యేక పాలనకు మూడు రోజుల్లో తెరపడనుంది.


జడ్పీ ఐదవ చైర్మన్‌గా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి

పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం 1995లో తొలిసారిగా జడ్పీ, మండల పరిషత్తులకు ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో జడ్పీ చైర్మన్‌ ప్రత్యక్ష ఎన్నిక కావడంతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నర్రెడ్డి తులసిరెడ్డి విజయం సాధించి బాధ్యతలు చేపట్టారు. 2001లో పరోక్ష ఎన్నికలకు మారడంతో గెలుపొందిన జడ్పీటీసీ సభ్యులు జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను.. ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ, వైఎస్‌ ఎంపీపీని ఎన్నుకుంటూ వస్తున్నారు. పరోక్ష ఎన్నికల ద్వారా రెండో జడ్పీ చైర్మన్‌గా 2001లో సురేష్‌ బాబు, 2006లో డాక్టరు జ్యోతిరెడ్డి, 2014లో గూడూరు రవి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో 50 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. 2019 మార్చి 9న జడ్పీ, మండల పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది. 38 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. అధికార పార్టీ బెదిరింపులతో ఏకగ్రీవం చేసుకుందని, వీటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ టీడీపీ డిమాండ్‌ చేసింది. ఎన్నికల సంఘం వీటినే కొనసాగించడంతో టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన 12 స్థానాల్లో 11 స్థానాలు వైసీపీయే దక్కించుకుంది. నోటిఫికేషన్‌ రాక ముందే జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి పేరును సీఎం జగన్‌ ఖరారు చేశారు. దీంతో 25న జరిగే జడ్పీ చైర్మన్‌ ఎంపిక లాంఛనమే. ఐదవ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఎవరు..? అన్నది ఆ పార్టీలో ప్రధాన చర్చగా మారింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి చైర్మన్‌ పదవి ఇవ్వడం వల్ల వైస్‌ చైర్మన్‌ పదవి మైనార్టీ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది.


రహస్య క్యాంపులో గోపవరం టీడీపీ ఎంపీటీసీ సభ్యులు

జిల్లాలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ దక్కించుకున్న ఏకైక మండల పరిషత్తు గోపవరం. ఈ మండలంలో ఐదుగురు ఎంపీటీసీలు ఉంటే.. కాలువపల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా వైసీపీకి చెందిన కొప్పాల రాజేశ్వరి ఏకగ్రీవం అయ్యారు. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడుచోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఐదింట టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొందడంతో మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలు ఆ పార్టీకే దక్కనున్నాయి. అయితే వారిలో ఒకరిని తమవైపు తిప్పుకొని అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలు సొంతం చేసుకోవాలని వైసీపీ రాజకీయ ఎత్తులకు తెర తీసినట్లు సమాచారం. ఇది ముందే పసిగట్టిన బద్వేలు మాజీ ఎమ్యెల్యే, టీడీపీ ఇన్‌చార్జి కొనిరెడ్డి విజయమ్మ తమ ఎంపీటీసీ సభ్యులను రహస్య క్యాంపునకు తరలించారు. 24వ తేది ఉదయం 10 గంటలకు నేరుగా మండల పరిషత్‌ మీటింగ్‌ హాల్‌కు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గోపవరం ఎంపీపీ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో బ్రాహ్మణపల్లె ఎంపీటీసీ సభ్యురాలు ధనలక్ష్మి చైర్‌పర్సన్‌, బేతాయిపల్లి ఎంపీటీసీ సభ్యుడు రాంమోహన్‌రెడ్డి వైస్‌ చైర్మన్‌ అయ్యే అవకాశం ఉంది.