కొనసాగుతున్న ‘యుద్ధం’

ABN , First Publish Date - 2021-09-15T05:45:23+05:30 IST

సింహాచలం దేవస్థానం..

కొనసాగుతున్న ‘యుద్ధం’

చైర్మన్‌ వర్సెస్‌ ఈవో

అశోక్‌, సూర్యకళ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం

అప్పన్న ఆలయ గత చైర్‌పర్సన్‌ హయాంలో పలు నిర్ణయాలు

పూర్తి వివరాలు పంపాలని చైర్మన్‌ లేఖ

ముక్తసరిగా సమాధానం ఇచ్చిన ఈవో 

సర్టిఫైడ్‌ కాపీ ఇవ్వాలని అశోక్‌ డిమాండ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్టు బోర్డు చైర్మన్‌ అయిన అశోక్ గజపతిరాజుకు, ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈవో) సూర్యకళకు మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. తాను అడిగిన వాటికి సంబంధించి సమాచారం పూర్తిగా ఇవ్వడం లేదనేది చైర్మన్‌ వాదన. తాను ఎన్ని లేఖలు రాసినా, ఎంత స్పష్టంగా వివరాలు కోరినా... అడిగిన సమాచారం మాత్రం ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తనకు ముందు పనిచేసిన ఛైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రస్టు బోర్డు సమావేశాల అజెండాలో పొందుపరిచిన అంశాలు, వాటిపై జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు వెల్లడించాలని అశోక్‌ లేఖ రాశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ఈవో సవివరంగా సమాధానం ఇవ్వకుండా, తీర్మానం కాపీలు పంపకుండా, కట్టె.. కొట్టె.. తెచ్చె.. అన్నట్టుగా పొడిపొడిగా, ప్రతి అంశంపైనా మూడు నుంచి నాలుగు పదాలతో సమాధానం పంపారు. ఈ ఏడాది మార్చి 4వ తేదీన, జూన్‌ 14, అదే నెల 21న ట్రస్టు బోర్డు సమావేశాలు నిర్వహించామని, 11 అంశాలను చర్చకు పెట్టామని ఆమె పేర్కొన్నారు.


శ్రీనివాసనగర్‌లో నాలుగు కల్యాణ మండపాలను అభివృద్ధి చేయాలని(ఎంత వ్యయమో పేర్కొనలేదు), అడవివరంలో సర్వే నంబరు 275 భూములు చుట్టూ ప్రహరీ నిర్మించాలని(ఎంత విస్తీర్ణం, ఎంత వ్యయం వివరాలు లేవు), మౌంట్‌ డియోస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు ఇండిపెండెంట్‌ ఇంజనీరు నియామకం, కొత్త ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ఎలక్ర్టికల్‌ వస్తువుల కొనుగోళ్లు( మొత్తం లేదు), కంప్యూటర్‌ విడిపరికరాల కొనుగోళ్లు(ఎంత మొత్తం లేదు), భక్తులకు వేద ఆశీర్వచనం టిక్కెట్‌ ధర నిర్ణయం(ఎంతో పేర్కొనలేదు), సీతమ్మధారంలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద 108 అడుగుల విగ్రహం ఏర్పాటుకు 300 చ.మీ. స్థలం ఇవ్వడం( ఏ ప్రాతిపదికనో వివరాలు లేవు), ఘాట్‌రోడ్డులో టోల్‌ ఫీజు పెంపు(ఎంతో లేదు), ఎన్‌ఎస్‌టీఎల్‌ 1975లో 37.75 ఎకరాలు తీసుకుంది. దానికి పరిహారం లేని విధంగా సెటిల్‌మెంట్‌(పూర్తి వివరాలు లేవు), అలాగే మానవ వనరుల కోసం సిబ్బంది నియామకం అంటూ పొడిపొడి మాటలతో అజెండా వివరాలను చైర్మన్‌కు పంపారు.


అభ్యంతరం ఏమిటంటే..?

ఆలయ కార్యనిర్వహణాధికారి పంపిన సమాచారంపై అశోక్ గజపతి చాలా స్పష్టంగా తన అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటినీ అనుమానించాల్సి వస్తున్నందున, ట్రస్టు బోర్డు తీసుకున్న నిర్ణయాల సర్టిఫైడ్‌ కాపీ(అటెస్ట్‌ చేసి) తనకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇది ఇరువర్గాలకు మంచిదని కూడా ఆయన పేర్కొన్నారు. అజెండాలోని అంశాలు, వాటిపై జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల కాపీలు కావాలని ఆయన అడిగారు. ఆయా అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పిస్తే.. అందులో ఏమి జరిగిందో తనకు తెలుస్తుందని, పొడి పొడి పదాలతో వాటిని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. తీర్మానం కాపీని ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటనేది ఆయన వాదన. 

Updated Date - 2021-09-15T05:45:23+05:30 IST