చైర్మన్‌, కౌన్సిలర్ల మధ్య సయోధ్య ఎప్పుడో

ABN , First Publish Date - 2021-04-19T05:43:49+05:30 IST

నర్సాపూర్‌ మున్సిపల్‌ పాలకవర్గంలోని అధికార పార్టీకి చెందిన చైర్మన్‌, కౌన్సిలర్ల మధ్యనే కొంత కాలంగా విబేధాలు కొనసాగుతుండడంతో పట్టణంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

చైర్మన్‌, కౌన్సిలర్ల మధ్య సయోధ్య ఎప్పుడో

నర్సాపూర్‌లో పలువురు నేతల యత్నం ?


నర్సాపూర్‌, ఏప్రిల్‌ 18: నర్సాపూర్‌ మున్సిపల్‌ పాలకవర్గంలోని అధికార పార్టీకి చెందిన చైర్మన్‌, కౌన్సిలర్ల మధ్యనే కొంత కాలంగా విబేధాలు కొనసాగుతుండడంతో పట్టణంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అంతే కాకుండా పాలన కూడా సక్రమంగా సాగడం లేదు. నర్సాపూర్‌ మున్సిపల్‌లో 15 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 10మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఉన్నారు. అందులో చైర్మన్‌గా ఉన్న మురళిధర్‌యాదవ్‌ కూడా అధికార పార్టీకి చెందిన వాడే. మిగిలిన నలుగురు బీజేపీకి చెందిన వారు. అయితే కొన్ని నెలలుగా చైర్మన్‌కు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య విబేధాలు కొనసాగుతుండంతో మున్సిపల్‌ సమావేశాల్లో వాగ్వాదం జరుగుతోంది. చైర్మన్‌ తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మెజార్టీ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు మురళిధర్‌యాదవ్‌ హాజరు కావడంలేదు. ఈ విషయం నియోజకవర్గం అంతా చర్చనీయాంశంగా మారింది. దీంతో మున్సిపల్‌ పాలన గాడితప్పి, పనులు సాఫీగా సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తీరుపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మౌనంగా ఉండడం పట్ల కూడా పార్టీలో చర్చ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు నర్సాపూర్‌ మున్సిపల్‌ పాలకవర్గంలో నెలకొన్న విబేధాలతో పాటు ముఖ్య నాయకుల మధ్య ఏర్పడిన గ్యాప్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 


 

Updated Date - 2021-04-19T05:43:49+05:30 IST