Abn logo
Sep 20 2021 @ 23:42PM

అధ్యక్ష పీఠం ఎవరికో!?

ఎంపీపీ పదవుల కోసం ఆశావహుల క్యూ

జడ్పీ వైస్‌ చైర్మనకూ తీవ్ర పోటీ

ముఖ్య నేతలతో ఇనచార్జి మంత్రి బాలినేని భేటీ

సామాజిక వర్గాల వారీగా నిర్ణయం?

చివరి వరకు అంతా గోప్యతే


నెల్లూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఎన్నో అవాంతరాల తర్వాత ప్రాదేశిక ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలింది పాలకుల ఎన్నికే! ఇటు జిల్లా పరిషత, అటు మండల పరిషతలలో అధ్యక్ష పీఠం ఎక్కేది ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికలకు మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో ఆశావాహులంతా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నెల 24వ తేదీన మండల పరిషత అధ్యక్షులతోపాటు కోఆప్షన సభ్యులను ఎన్నుకోనున్నారు. 25వ తేదీన జడ్పీ చైర్మనతోపాటు ఇద్దరు వైస్‌ చైర్మన్లు, కోఆప్షన సభ్యుల ఎన్నిక జరగనుంది. జడ్పీ చైర్మన పదవికి నెల్లూరు రూరల్‌ మండలం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆనం అరుణమ్మ పేరు దాదాపుగా ఖరారైంది. అయితే రెండు వైస్‌ చైర్మన్ల పదవులు ఎవరిని వరిస్తాయన్నదే ఆసక్తిగా మారింది. జడ్పీ చైర్మన పదవి ఓసీ కేటగిరీకి ఇస్తున్నారు కాబట్టి వైస్‌చైర్మన పదవులను ఇతర వర్గాలకు కేటాయించే అవకాశం ఉన్నట్టు చర్చలు జరుగుతున్నాయి. ఆ రెండు ఏ నియోజకవర్గాల సభ్యులకు కేటాయించాలన్న దానిపై అధికార పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి. జిల్లా ఇనచార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సోమవారం జిల్లాకు చేరుకుని మంత్రి అనిల్‌కుమార్‌తో పాటు కొందరు ముఖ్యనేతలతో అంతర్గతంగా సమావేశమైనట్లు తెలిసింది. జిల్లా పరిషత వైస్‌చైర్మన్ల ఎంపికపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా బహుముఖ నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని మండలాల ఎంపీపీల ఎంపికపై కూడా చర్చలు జరిగినట్లు అధికార పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వైస్‌ చైర్మన్ల ఎంపికపై ఆయా ఎమ్మెల్యేలు తమ వారికి అవకాశం కల్పించాలంటూ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో చివరివరకు వైస్‌ చైర్మన్ల ఎంపికపై గోప్యత పాటించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


మండల కుర్చీ కోసం..


ఇక మండల పాలనలో ఎంపీపీలే కీలకం. మండలాభివృద్ధిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారిదే తుది నిర్ణయం. రాజకీయంగా కూడా ప్రాధాన్యమున్న పదవి కావడంతో దాదాపు అన్ని మండలాల్లోనూ ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. ఎవరికి వారు తమ ప్రయత్నాలను జోరుగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా అన రిజర్వుడ్‌ మండలాల్లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఈ మండలాఽల అధ్యక్ష పీఠంపై కూర్చునేందుకు ఓసీ అభ్యర్థులు తమ బలాన్నంతా ప్రయోగిస్తున్నారు. అయితే కొన్ని మండలాల్లో జడ్పీటీసీలు ఓసీ వర్గానికి చెందిన వారు ఉండగా అటువంటి చోట్ల ఎంపీపీ పదవి ఎవరికి ఇవ్వాలన్నదానిపై అధికార పార్టీలో తర్జనభర్జనలు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జడ్పీటీసీ, ఎంపీపీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే ప్రజలకు వేరే సంకేతం వెళుతుందని భావించిన పార్టీ పెద్దలు జడ్పీటీసీ ఓసీ ఉన్నచోట ఎంపీపీగా మరో వర్గానికి అవకాశం ఇవ్వలని అంతర్గతంగా నియమం పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ కోవలో ఆత్మకూరు, మర్రిపాడు, దుత్తలూరు, కలిగిరి మండలాలు ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయి. ఇక కొన్ని మండలాలకు సంబంధించి ఎంపీపీ ఎవరికిస్తున్నారన్నదానిపై స్పష్టత వచ్చింది. ఆయా ఎమ్మెల్యేలు ప్రాథమికంగా ఎవరిని నియమించాలన్నదానిపై స్థానిక నాయకులకు సంకేతాలిచ్చారు. అటువంటి చోట్ల ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థానిక నాయకులంతా ఓ ఒప్పందానికి వస్తున్నారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నాయకులతో సమావేశమవుతూ ఎంపీపీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. రిజర్వేషన్లు ఉన్న చోట ఎంపీపీ ఎంపిక ఇబ్బంది లేకపోయినా జనరల్‌ మండలాల్లో ఎమ్మెల్యేలకు ఒకింత ఇబ్బందిగానే మారింది. ఒకటి, రెండు రోజుల్లో ఎంపీపీలు ఎవరన్నది స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కోఆప్షన సభ్యులపై కూడా కసరత్తులు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లను సిద్ధం చేస్తున్నారు.