రాయల్‌గా చైన్ లింక్ దోపిడీ

ABN , First Publish Date - 2020-05-26T16:36:44+05:30 IST

ఉద్యోగమో.. వ్యాపారమో చేస్తే ఎంతొస్తుంది..? ఎప్పటికి లక్షలాది..

రాయల్‌గా చైన్ లింక్ దోపిడీ

తణుకు, తాడేపల్లిగూడెం కేంద్రాలుగా లావాదేవీలు

ఒక్కో వ్యక్తి నుంచి రూ. 13 వేలు వసూలు

మరో ఇద్దరిని జాయిన్‌ చేయాలి

కమీషన్‌ల ఎర చూపుతూ ప్రజలకు వల

గూడెంలో వందలాదిగా సొమ్ము చెల్లింపు


తాడేపల్లిగూడెం(ఆంధ్రజ్యోతి): ఉద్యోగమో.. వ్యాపారమో చేస్తే ఎంతొస్తుంది..? ఎప్పటికి లక్షలాది రూపాయలు ఆర్జిస్తాం. ఇవేమీ వద్దు.. చైన్‌ లింక్‌ వ్యాపారం చేస్తే ఏకంగా కోటీశ్వరులం కావచ్చు అంటూ తాడేపల్లిగూడెంలో ఓ వ్యాపారి తనయుడు ప్రజలకు వల వేస్తున్నాడు. కంపెనీ పేరుతో రాయల్‌గా దోపిడీకి పాల్పడుతున్నాడు. అతనికి పైస్థాయిలో తణుకు పట్టణానికి చెందిన వ్యక్తి ఈ వ్యాపారంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీ కేంద్రంగా దుస్తులు, ఫ్యాబ్రిక్స్‌, ఫర్నీచర్‌ ఇతర వస్తువులను ఆన్‌లైన్‌లో వర్తకం చేసే సంస్థ ఇప్పుడు చైన్‌ లింక్‌ వ్యాపారంలో ప్రవేశించింది. ఇప్పుడెందరో అందులో ప్రవేశించి బయటకు రాలేక..కమీషన్‌ రూపంలో సొమ్ములు రాక లబోదిబోమంటున్నారు. గతంలో ఇదే మాదిరి అనేక కంపెనీలు చైన్‌ లింక్‌ వ్యాపారం చేశాయి. పెద్దఎత్తున సొమ్ములు పోగొట్టుకున్నారు. తణుకు పట్టణానికి చెందిన వ్యక్తికి నెలకు రూ.16 లక్షలు, తాడేపల్లిగూడెంలో వ్యాపారుని తనయుడికి రూ.3 లక్షలపైన వస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. కొత్త ఖాతాదారులను ఆకర్షిస్తున్నారు.  


ఇద్దరిని చేర్చడం తప్పనిసరి 

ఒక వ్యక్తి సభ్యుడిగా చేరితో రూ.13 వేలు చెల్లించాలి. అందుకు ప్రతిగా రూ.3 వేలు విలువైన దుస్తులు లేదా ఇతర గిప్ట్‌లను బహుమతిగా ఇస్తారు. దానివిలువ పెద్ద మొత్తంలో ఉంటుందని నమ్మ బలుకుతారు. ఇలా సభ్యుడిగా చేరిన వ్యక్తి మరో ఇద్దరిని సభ్యులుగా చేర్చుకోవాల్సి ఉంటుంది. తాడేపల్లి గూడెంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యాపారి తనయుడు తొలుత పట్టణంలో చైన్‌ లింక్‌ వ్యాపారాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు వందల మంది అతని కింద సభ్యులుగా ఉన్నారు. దాంతో ఆయనకు పెద్ద మొత్తంలో కమీషన్‌ వస్తోంది. దానినే ప్రచారం చేసుకుంటూ ఇతరులు ఆ వ్యాపారంలో చేరేలా ప్రేరేపిస్తున్నారు.


ఇలా అనేకమంది సభ్యులుగా చేరి కొత్తగా తాము మరో ఇద్దరిని చేర్చలేక సతమతమవుతున్నారు. ఫలితంగా వారి కట్టిన సొమ్మును కోల్పోతున్నారు. వాణిజ్యపరంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వ్యాపారాన్ని పరిచయం చేయడమే కాకుండా ఆర్థికంగా బలమైన వ్యక్తులను ఇందులో చేర్చారు. దాంతో కొందరు బయటకు చెప్పుకోవడానికి నామోషీగా భావిస్తున్నారు. ఇంకొందరు సామాన్యులు నోరు విప్పే సాహసం చేయలేకపోతున్నారు. 


వారానికి ఒక సమావేశం 

ప్రతి ఆదివారం తాడేపల్లిగూడెంలో వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం సమీపంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో సమావేశం నిర్వహిస్తుంటారు. వ్యాపారంలో విజయవంతమైన సభ్యులు సమావేశానికి హాజరవుతుంటారు. కొత్తవారిని సమావేశానికి ఆహ్వానిస్తారు. మంచిమాటలు చెప్పి వారిని ఆకర్షిస్తున్నారు. వాస్తవానికి చైన్‌ లింక్‌ వ్యాపారం చట్ట రీత్యా నేరం. అటువంటి వ్యాపారం అనకుండా తాము చెల్లించిన సొమ్ముకు దుస్తులు, ఇతర వస్తువులు కట్టబెడుతున్నారు. తాము చెల్లించిన మొత్తానికి ఆ వస్తువులు ఇస్తున్నట్టు రికార్డుల్లో నమోదవుతోంది. కానీ ఆ వస్తువుల ధర అంత ఉండే అవకాశం లేదు.  

Updated Date - 2020-05-26T16:36:44+05:30 IST