గొలుసు గుట్టు..

ABN , First Publish Date - 2020-11-30T05:18:31+05:30 IST

జిల్లాలో నాలుగు నెలల నుంచి ఓ గొలుసుకట్టు స్కీమ్‌ నడు స్తోంది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో వేలాదిమంది చేరి నట్లు సమాచారం. ఇందులో ముందుగా రూ.2,250 కట్టి చేరాలి.

గొలుసు గుట్టు..

జిల్లాలో గొలుసుకట్టు మార్కెటింగ్‌

ప్రతి ఒక్కరూ నలుగురిని చేర్పించాలి..

వేలాది మంది నుంచి డిపాజిట్ల సేకరణ

అకౌంట్లో డాలర్లు పడతాయని మాయ మాటలు

పేద, మధ్య తరగతి ప్రజలే లక్ష్యం 

నమ్మి మోసపోవ ద ్దంటున్న నిపుణులు


కేవలం రూ.2,250 కట్టండి చాలు..  48 నెలల్లో రూ.30లక్షలు సంపాదించవచ్చు.. మీ టైం బాగుంటే  అంతకంటే ముందే మీరు లక్షాధికారులు అయిపో తారు.. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే.. ప్రతి ఒక్కరూ నలుగురు సభ్యులను చేర్పిస్తే చాలు.. ఆ తరువాత మీ ఖాతాల్లోకి డబ్బులే.. డబ్బులు.. వాటిలో అమెరికన్‌ డాలర్లు కూడా ఉంటాయి... జిల్లా లో కొంతమంది వ్యక్తులు అమాయక ప్రజల కు చెబుతున్న మాయమాటలు ఇవి. నాలుగు నెలల కిందట ప్రారంభమైన  ఈ స్కీమ్‌లో ఇప్పటికే జిల్లాలో వేలాది మంది చేరినట్లు సమాచారం. ఇటు వంటి వాటిని నమ్మి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


గుంటూరు(తూర్పు), నవంబరు 29: జిల్లాలో నాలుగు నెలల నుంచి ఓ గొలుసుకట్టు స్కీమ్‌ నడు స్తోంది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో వేలాదిమంది చేరి నట్లు సమాచారం. ఇందులో ముందుగా రూ.2,250 కట్టి  చేరాలి. చేరిన వ్యక్తికి ఓ ఖాతా నెంబరును ఇస్తారు. ఆ వెంటనే ఆ ఖాతాలో 15 అమెరికన్‌ డాలర్లు జమ అవుతాయని చెబుతారు. కానీ వాటిని విత్‌డ్రా చేయడానికి వీలుండదు. ఇందులో చేరిన వ్యక్తి తప్పకుండా మరో నలుగురిని ఈ స్కీమ్‌లో చేర్పించాలి. అప్పుడే కమీషన్‌ రావడం ప్రారంభమవుతుంది. ఈ నలుగురిని నుంచి తీసుకున్న డిపాజిట్‌లో సగం డబ్బును చేర్పించిన వ్యక్తికి ఇస్తారు. ఇలా చేరిన నలుగురు తలా మరో నలుగురుని చేర్పించాలి. వారి డిపాజిట్‌లో కూడా కమీషన్‌ రూపం లో కొంత భాగం మనం ఎవరి ద్వారా చేరామో వారికి చేరుతూనే ఉం టుంది. దీని ప్రకారం మనద్వారా ఎంతమంది చేరితే మనకు అంత కమీషన్‌ వస్తుంది, వీటితో పాటు అప్పుడప్పుడు ఖాతా ల్లో డాలర్లు పడుతున్నట్టు మ నకు ఫోన్‌లో సమాచారం కూడా వస్తుందని నిర్వాహకులు మాయమా టలు చెబుతారు.


అన్నీ అనుమానాలే...

ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి యాప్‌ను తయారుచేసి, ఎక్కువమంది సభ్యులను చేర్పించి యాప్‌ను ప్రమోట్‌ చేయడానికి ఈ స్కీమ్‌ అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పైగా  సంస్థ బ్రోచర్‌ను ఆవిష్కరించింది సాక్షాత్తూ డొనాల్డ్‌ట్రంప్‌ అని కూడా అంటారు. 2015లోనే ప్రారంభించినట్లు చెబు తున్న ఈ యాప్‌ ఇప్పటివరకు అందుబాటులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.  పైగా ఏ యాప్‌ కూడా ప్రమోషన్‌కు ప్రజల నుంచి డిపాజిట్‌లు సేకరించిన దాఖలాలు కూడా లేవు. అలాగే ఏ దేశ ప్రజల బ్యాంకు ఖాతాల్లో నిల్వలు, ఆయా కరెన్సీలను బట్టే ఉంటాయి. డాలర్ల రూపంలో ఉండవు. వీరు మాత్రం మన ఖాతాలో డాలర్ల రూపంలో డబ్బు జమ చేస్తున్నట్టు కూడా చూపిస్తుంటారు. ఇది ఈ స్కీమ్‌పై మరింత అనుమానాలకు తావిస్తోంది.


గుంటూరులో గుట్టుగా.. 

పేరుకు సంస్థ అమెరికా వ్యక్తులది అని చెబుతున్నప్పటికి ఇక్కడి వ్యక్తులే దీనిని నడుపుతున్నట్టు సమాచారం. గుంటూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. కానీ అక్కడ మాత్రం ఎవరూ ఉండరు.  ఎవరైనా కలవాలనుకున్నా సదరు కంపెనీ వ్యక్తులు.. మీరు స్కీమ్‌లో చేరాలనుకుంటే మేము మనిషిని పంపిస్తాం.. లేదా    ఫోనులోనే మిమ్మల్ని స్కీమ్‌లో చేర్పిస్తాం..   అంతేగాని మమ్మల్ని కలవడం కుదరదు అని చెబుతుంటారు. అప్పుడప్పుడు ముఖ్యమైన వ్యక్తులు ఏదైనా హోటల్‌లో కలవడ మో.. లేదా జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడుకోవడం మాత్రమే చేస్తుంటారని     సమాచారం.


పేద, మధ్యతరగతి వారే లక్ష్యం

ఈ స్కీమ్‌లో కూడా అందరిని చేర్చుకోవడం లేదని సమాచారం. చదువు లేని వారిని, పేదవారినే మాత్ర మే చేర్చుకుంటారు. ఎందుకంటే వీరిని తొందరగా మభ్యపెట్టవచ్చు. అలాగే తమకు ఇప్పటికే కమీషన్ల రూపంలో రూ.లక్షలు వస్తున్నాయని.. మీరు కూడా కూడా సంపాదించుకోవచ్చని చెబుతారు. అంతేగాక ఈ స్కీమ్‌కి ఆర్బీఐ అనుమతులు ఇచ్చిందని  మాయమాటలు చెప్పి స్కీమ్‌లో చేర్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో  మారుమూల ప్రాంతాల్లో వేలాది మంది ఈస్కీమ్‌లో చేరినట్టు సమాచారం.


చట్టం ఏం చెబుతుంది..

ఆర్బీఐ నియమాల ప్రకారం 2018 నుంచి గొలుసుకట్టు వ్యాపారం పూర్తిగా నిషేధం. ఎవరైనా అలా చేస్తే ఆయా నేరాన్ని బట్టి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండవచ్చు. అంతేగాక ఎవరి దగ్గరైనా డిపాజిట్‌ తీసుకుంటే ఆయా కంపెనీ మూలధనంలో 50శాతం వరకు ఆర్బీఐ వద్ద ఉంచాలి. పైగా డిపాజిట్‌ రుణాల రూపంలో మరొకరికి ఇవ్వాలి. అంతేగాక డిపాజిట్‌దారున్ని మరికొంత మందిని డిపాజిట్‌ చేర్పించమని ఎట్టి పరిస్థితిలోనూ అడగకూడదు. కానీఇటువంటివి ఏమీ ఇక్కడ పాటించడం లేదు.

Updated Date - 2020-11-30T05:18:31+05:30 IST