Abn logo
Oct 17 2021 @ 00:32AM

జీజీహెచలో చిన్నారి అపహరణ

బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న కొత్తపేట సీఐ శ్రీనివాసులరెడ్డి

గంటల వ్యవధిలోనే కేసు చేధించిన పోలీసులు

గుంటూరు, అక్టోబరు 16: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో   నాలుగు రోజుల బాలుడు శనివారం తెల్లవారుజామున అపహరణకు గురికాగా గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. పెదకాకానికి చెందిన ఉప్పుతల మహేష్‌ భార్య ప్రియాంకకు జీజీహెచలో ఈ నెల 13న బాబు జన్మించాడు. శుక్రవారం అర్ధరాత్రి అమ్మమ్మ పార్వతమ్మ వార్డు బయట నిద్రిస్తున్న నాయనమ్మ ఏసుకుమారి పక్కన చిన్నారిని పడుకోబెట్టి బాత్రూమ్‌కు వెళ్లింది. ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి బాబు కనిపించలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అర్బన ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సీఐ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు మధుపవన, కె.శ్రీనివాసరావు, సీసీహెచ, ఐటీ కోర్‌ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశారు.  ఆస్పత్రిలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా ఓ వ్యక్తి కర్రల సంచి తీసుకుని బయటకు వెళ్లటం గుర్తించారు. బయటకు వెళ్లిన ఆ వ్యక్తి రైల్వేస్టేషన గేటు వద్ద ఓ మహిళతో కలిసి ఆటోలో పెదకాకాని శివాలయం వద్దకు వెళ్లి అక్కడి నుంచి నెహ్రూనగర్‌ ఒకటవ లైనులోని మోతిలాల్‌నగర్‌ ఒకటో లైనులో గల ఇంటికి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆటో నెంబరును గుర్తించి డ్రైవర్‌ను విచారించిన పోలీసులు మోతిలాల్‌నగర్‌లో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని బాలుడిని తల్లికి అప్పగించారు. 

నిందితుల్లో ఒకరు గతంలో జీజీహెచ ఉద్యోగి

బాలుడిని నెహ్రూనగర్‌ ఒకటో లైనుకు చెందిన రావుల హేమవర్ణుడు, యనమదలకు చెందిన రెడ్డి పద్మజ అపహరించినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో హేమవర్ణుడు గతంలో జీజీహెచలో కాంట్రాక్టు పద్ధతిన పని చేశాడు. దురలవాట్లకు గురై మోతిలాల్‌నగర్‌లో అద్దెకు ఉంటున్న హేవర్ణుడికి యనమదలకు చెందిన పద్మజ రెండేళ్ల క్రితం పరిచయం కాగా వారు సహజీవనం చేస్తున్నారు. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్న వీరు డబ్బు సంపాదన కోసం ఆస్పత్రిలో చిన్నారులను అపహరించి అమ్ముకోవాలని పథకం రచించి శనివారం చిన్నారిని అపహరించారు. ఈ క్రమంలో చిన్నారి ఏడవకుండా ఉండేందుకు మత్తు వాసన చూపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  తాము బాలుడిని పెంచుకునేందుకే తీసుకెళ్లినట్టు చెప్పినట్టు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం వారి ప్రవర్తన బట్టి వారు బాలుడిని అమ్ముకునేందుకే అపహరించినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు సీఐ తెలిపారు. గంటల వ్యవధిలోనే అపహరణకు గురైన బాలుడిని గుర్తించి తల్లి ఒడికి చేర్చిన అధికారులు, సిబ్బందిని అర్బన ఎస్పీ రివార్డులు ప్రకటించారు. ఎనిమిదేళ్ల తర్వాత పుట్టిన బాబు తిరిగి తమకు అప్పగించారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.