Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 27 Jun 2022 04:56:50 IST

పద్యాల్లో చద్దన్నం!

twitter-iconwatsapp-iconfb-icon
పద్యాల్లో చద్దన్నం!

తెలుగు వారికి, చద్దెన్నంతో అనుబంధం ఈ నాటిది కాదు. నరావతరణ దశ లోనే వరిగింజల నుంచి అన్నం వండుకొని తినడంతోనే యీ కథ మొదలై ఉండాలి. నిజానికి నాటి మానవులే ఆదిమ శాస్త్రజ్ఞులు. రాత్రి మిగిలిన అన్నం పారబొయ్యకుండా మరుసటిరోజు ఎలా ఉపయోగించాలి? అన్న ప్రశ్నతో పరిశోధన ప్రారంభించి వుంటారు. ఎన్నో ప్రయోగాలూ చేసే ఉంటారు. భాషకు ఒక స్వరూపమూ, ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అన్న సూక్తీ ఏర్పడ టానికి ముందే, వేదకాలానికి పూర్వులూ చద్దెన్నాన్ని చవిచూసే వుంటారు. తరవాణి/కలి తాగేవుంటారు. ఆ చల్లదనాన్నీ, ఆహ్లాదాన్నీ, ఉత్సాహాన్నీ, శక్తినీ, పుష్టినీ అనుభవించే ఉంటారు. ఫలితంగానే, ‘‘పెద్దలమాట చద్దెన్నం మూట’’ అన్న సామెత పుట్టించి వుంటారు. ప్రాచీన సాహిత్యం నుంచి అర్వాచీన వచన రచనా ప్రక్రియ వరకూ పలుచోట్ల చద్దెన్నం ప్రస్తావనలు చోటుచేసుకొన్నవి. వాటిలోంచి కొన్ని ఆసక్తికరమైన అంశాలు:


తిక్కన సోమయాజి: ఆంధ్రమహాభారతం, శాంతిపర్వం, మూడవ ఆశ్వాసంలో అంపశయ్య పైనున్న భీష్ముడు ధర్మరాజుకు ధర్మసందేహాల నివృత్తి చేస్తాడు. ఆ సందర్భంలో ఒక కథ ఉదాహరిస్తాడు: ఫలితుడనే మూషికం, వలలో చిక్కు కున్న రోమశుడనే మార్జాలాన్ని వలత్రాళ్లు కొరికి రక్షిస్తుంది. ఆ రెండింటి మధ్యా కొంత సంభాషణా నడుస్తుంది. ఇంతసేపటి పరిచయం వల్ల తాము మిత్రుల మైపోయామని పిల్లి ప్రకటిస్తుంది. ఇక తన దరిజేరమనీ ఎలుకను కోరుతుంది. అప్పుడు ఎలుక చెప్పిన సమాధానమిది: 


క. బలుపు టురి జిక్కి పేరాకాలితో రేయెల్ల నున్న కతమున నీకుం 

 జలిది వలసి పిలిచెద విటు వలయునె? నీపలుకులు నమ్మి వత్తునె చేరన్‌.

- ఇక్కడ చలిది అన్నపదం ప్రాతరాహారంగా పేర్కొనబడ్డది.

బమ్మెర పోతనార్యుడి భాగవతం, దశమస్కందం, పూర్వభాగంలో ఇలా వున్నది: బలరామకృష్ణులు దూడలను మేపుతూ వనానికి చల్ది అన్నాలను తీసుకొనిపోయి అక్కడ పంక్తి భోజనాలు ఆరగించబోతారు. 


వ. రామకృష్ణులు కాంతారంబున బంతి చలుదులు గుడువ నుద్యోగించి... 

...సంరంభంబున గోప డింభకులు చలిది కావిడులు మూపున వహించి..

- అలా వెళ్తూనే వినోదిస్తున్నారు.:


క. ...ఒకని చల్ది కావిడి నొకడడికించి దాచు... 

ఆ తరువాత కృష్ణుడు కొండచిలువ రూపంలోని అఘాసుడ్ని సంహరించి, మిగిలిన గోపబాలకుల్ని పిలుస్తాడు. 


శా. ...రండో బాలకులార చల్దిగుడువన్‌

అప్పుడు గోపాలురందరూ పద్మం ఆకారంలో కూర్చోగా కృష్ణుడు కర్ణికలాగా వెలిగాడు. అందరూ చల్దులు తినడం మొదలుపెట్టారు.


వ. ...చొక్కంబులగు చల్దుల చిక్కంబులు సక్కడించి 

సీ. ...ఏగు రార్గుల చల్దులెలమిఁ బన్నిదమాడి... 

సీ. ...మీగడపెరుగుతో మేళవించిన చల్దిముద్ద... 

...శైశవంబు మెఱసి చల్ది గుడిచె... 

వ. ...గోపకుమారులు చల్దులు గుడుచునెడ...  

- ఈ లోపల దూడలు దూరంగా పోయాయి. అప్పుడు కృష్ణుడు వాటిని తెస్తానని మిగిలినవారికి భరోసా ఇస్తున్నాడు:

మ. ...కని తెత్తున్‌! గడువుండు చల్ది గొఱతల్‌ 

గాకుండా మీరందరున్‌...  

- ఇక్కడ చద్దెన్నం శ్రామిక వర్గాలవారి ప్రీతిపాత్రమైన ప్రాతరాహారంగా పేర్కొనబడింది.


శ్రీనాథ మహాకవి కాశీఖండం, కపర్దీశ్వర ప్రభావ కథనం, షష్ఠమాశ్వాసంలో చద్దెన్నాన్ని ప్రస్తావించాడు. వాల్మీకి అనే శివ భక్తుడికి ఒక రాక్షసుడు ఎదురు పడతాడు. పూర్వజన్మలో తానొక బ్రాహ్మణుడిననీ, చెడు నడత వల్ల బ్రహ్మ రాక్షసుడ్ని అయ్యాననీ చెబుతాడు. కానీ అలాకూడా మన లేక, అవలక్షణాలు గల ఒక పురుషుడిని వెతికి పట్టుకొని, అతడ్ని ఆవహించాననీ వివరిస్తాడు. ఆసందర్భంలో అతడి చెడు నడతని వర్ణిస్తాడు. 


సీ. ...బ్రహ్మ సూత్రము ధరింపగా సిగ్గు వహించు 

చల్ది యోగిరము నిచ్చలు భుజించు... 

- ఇక్కడ చద్దెన్నం దుష్టశీలం గలవారి ఆహారంగా పేర్కొనబడ్డది.


తెనాలి రామకృష్ణుడి పాండురంగ మహాత్మ్యం, చతుర్థాశ్వాసం, సుశీల కథలో కృష్ణుడే ఆమెను పరీక్షించటానికి ఆమె భర్త ఇంటలేని సమయంలో, కపట బ్రహ్మచారి వేషంలో వస్తాడు. చాలా ఆకలిగా ఉంది, అన్నంపెట్టమని అర్థిస్తాడు. అందుకామె తన ఇంట అప్పుడే వండిన అన్నం సిద్ధంగా లేదనీ చద్దెన్నం మాత్రమే ఉందనీ, దాన్ని అతిథికి వడ్డించడం సబబు కాదనీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కొద్దిక్షణాలు వేచివుంటే అన్నం వండివార్చి వడ్డిస్తాననీ చెబుతుంది. కానీ అతడు చద్దెన్నాన్నైనా తక్షణమే పెట్టమని ఒత్తిడి చేస్తాడు. ఈ సందర్భంగా వారిమధ్య కొంత సంవాదం జరుగుతుంది. 

తే. ...పులిసినది గల్గె నన్నంబు పోకయంత యొసఁగి 

క్షుత్తార్పు, వెస జల్ది మెసవనైన...  

తే. ...తొలుతనే వేడి నప్పుడు చలిది నీకు 

అనఘ! నేనెట్టు లిడుదాన నంటి...  

సీ. ...చాలునో చాలదో చలిదియు... 

క. ...ప్రాణాహుతి విహితంబుగ పర్యుషితంబున్‌...  

- ఇక్కడ అతిథులకు వడ్డించడం సభ్యతకాని ఆహారంగా చద్దెన్నం కనిపిస్తుంది.


పాలవేకరి కదిరీపతి: ఇతడు నాయకరాజుల యుగానికి చెందినవాడు. తన ‘శుకసప్తతి’లోని ఒక కథలో ఒక పేదవాడు కట్టెలను కొట్టి తెచ్చి అమ్మడానికి అడవికి బయల్దేరుతున్నప్పటి వర్ణనలో ఇలా ఉంటుంది:

చ. ...చిక్కమునన్‌ సొరకాయబుర్రలో జలిదియు నుంచి 

...నరిగెన్‌ గహనంబునకై రయంబునన్‌

- ఇక్కడకూడా చద్దెన్నం కష్టజీవుల ఆహారంగా పేర్కొనబడ్డది. 


చద్దెన్నాన్ని తయారు చేసే విధానాలు ప్రాంతాన్నిబట్టీ, కాలాన్నిబట్టీ మారు తూనే వున్నాయి. అయినా సాంప్రదాయ విధానం ఒకటి వున్నది. జర్నల్‌ అఫ్‌ ఎథ్నిక్‌ ఫుడ్స్‌, జనవరి 2016లో ప్రచురితమైన ఒక పరిశోధనాపత్రం ఇలాపేర్కొన్నది: రాత్రి మిగిలిన అన్నాన్ని చల్లార్చి, కొద్దిగా నీరూ, గంజితోపాటు, ముందురోజు పులిసిన తరవాణిని కొంచం కలిపి, 8-10గం.లపాటు నిల్వచేస్తారు. ఉదయాన్నే తింటారు. రాత్రిగానీ ఉదయాన్నేగానీ పెరుగూ, నీరుల్లీ, పచ్చిమిర్చీ మొదలైనవి కలుపుకొని గానీ, ఆవకాయలూ, అప్పడాలూ, వడియాలూ నంజుకొనిగానీ తినడం ఐచ్ఛికం. ఒకనాడు పాలూ పెరుగూ అన్ని ఆర్థిక స్థాయిలవారికీ అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడంటే కుక్కర్ల వాడకం వల్ల ఈ తరం వారికి గంజి తెలీదు. కానీ గంజి అనేది అన్నం వండేటప్పుడు లభించే అన్న సారం. ఇప్పటికీ, అప్పుడే వార్చిన గంజి తాగి పొలం పనులకు వెళ్తారు. కాబట్టి చద్దెన్నం అంటే పెరుగన్నం కాదు.


పులిసిన అన్నాన్ని ఫెర్మెంటెడ్‌ రైస్‌ అంటారు. కిణ్వప్రక్రియలో అన్నంలోని క్రొవ్వులు క్షయకరణం చెంది, త్వరగా రక్తంలోకి శోషణ చెందే స్థితికి చేరుకుం టాయి. క్షయీకరణ చక్కెరలు, ఎమినో ఆమ్లాలూ, యాంటీ ఆక్సిడెంట్లూ ఏర్పడు తాయి. బి కాంప్లెక్స్‌, విటమిన్‌ కె, స్వల్ప పరిమాణంలో ఫాస్ఫరస్‌, సోడియం పొటాషియం, కాల్షియం, ఐరన్‌ ఉంటాయి. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌, అంటే ఆహారంగాలోనికి స్వీకరించదగిన సూక్ష్మజీవులు, వృద్ధి చెందుతాయి. కొద్దిపాటి ఇథనాల్‌ కూడా ఏర్పడి చద్దెన్నానికి స్వల్పంగా మత్తునిచ్చే లక్షణాన్ని కలిగి స్తుంది. తరవాణి ఞఏ 6-6.8గా ఉండి ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటుంది. పులుపు వాసనకూ, రుచికి ఇదే కారణం. అందరికీ అందుబాటులో వుండి, ఆంధ్రుల సంస్కృతిలో భాగమూ, ఆరోగ్యప్రదమూ, బలవర్ధకమూ అయిన చద్దెన్నాన్ని నవనాగరికత పేరుతో అకారణంగా విస్మరించారు. ఉదయాన్నే చద్దెన్నం వినియోగాన్ని పునరుద్ధరించి ఆరోగ్యాన్నీ ఆనందాన్నీ పెంచుకోవాల్సిన అవసరం తెలుగువారికి వున్నది. తెలుగింటి చద్దెన్నం చిరకాలం వర్ధిల్లుగాక.

టి. షణ్ముఖ రావు,

99493 48238


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.