బడి భాష, ఇంటి భాష ఒక్కటవ్వాలి

ABN , First Publish Date - 2020-02-22T07:46:36+05:30 IST

బడి భాష, ఇంటి భాష ఒకటి కాకపోతే పిల్లల్లో సృజనాత్మకత సన్నగిల్లుతుందని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు అన్నారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో...

బడి భాష, ఇంటి భాష  ఒక్కటవ్వాలి

అప్పుడే పిల్లల్లో సృజనాత్మకత

ఏపీలో తెలుగు మాధ్యమాన్ని ఎత్తేయాలన్న నిర్ణయం సరికాదు

త్వరలోనే తెలుగు భాష పరిరక్షణోద్యమాన్ని నిర్వహిస్తా

మాతృభాషా దినోత్సవ సభలో సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారికి సన్మానం


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): బడి భాష, ఇంటి భాష ఒకటి కాకపోతే పిల్లల్లో సృజనాత్మకత సన్నగిల్లుతుందని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు అన్నారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో జరిగినప్పుడే విద్యార్థులు ఇతర భాషల్లో సులువుగా ప్రావీణ్యం సంపాదిస్తారని చెప్పారు. శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ బేగంపేటలోని హోటల్‌ ప్లాజాలో ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారిని విశిష్ట పురస్కారంతో సత్కరించారు. ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని విద్యాసాగర్‌రావు ఈ సందర్భంగా ఆక్షేపించారు. 1 నుంచి 6వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని యునెస్కో సూచించిందని విద్యాసాగర్‌ రావు నొక్కిచెప్పారు.  పిల్లలకు శతకాలు, పద్యాలు, నీతికథలను తప్పనిసరిగా నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరినీ ఏకం చేస్తూ తెలుగు భాషా పరిరక్షణోద్యమానికి తాను శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ ఉద్యమానికి రమణాచారి సారథ్యం వహించాలని కోరారు. రమణాచారి మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో చదవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా దొరుకుతాయనుకోవడం భ్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎన్బీటీ సంపాదకుడు పత్తిపాక మోహన్‌ సభాధ్యక్షత వహించగా ఏపీ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు కొలకలూరి ఇనాక్‌, విశ్వనాథ సాహిత్య పీఠం వ్యవస్థాపకుడు వెల్చాల కొండలరావు, తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు జె. చెన్నయ్య పాల్గొన్నారు. సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదిగిరి తదితరులను విద్యాసాగర్‌ రావు ఈ సందర్భంగా సన్మానించారు. 


ఎవరి గొయ్యి వారు తవ్వుకున్నట్లే

సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల అభాసుపాలవడమేగాక, ఎవరి గొయ్యి వారే తవ్వుకున్నట్లేనని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి విద్యాసాగర్‌ రావు వ్యాఖ్యానించారు. సన్మాన కార్యక్రమం అనంతరం ఆయన ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఏఏ కచ్చితంగా అమలవుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పోటీలో తాను లేనని చెప్పారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుల ఎంపిక నా పరిధిలో లేదు. కొత్త అధ్యక్షులను నియమించవచ్చు లేదా ప్రస్తుతం ఉన్నవారే కొనసాగవచ్చు’’ అని అన్నారు. మజ్లిస్‌ పక్కనుందనే ధైర్యంతో సీఏఏపై టీఆర్‌ఎస్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని విమర్శించారు.

Updated Date - 2020-02-22T07:46:36+05:30 IST