చేటు కాలము దాపురించగ

ABN , First Publish Date - 2021-05-05T05:37:29+05:30 IST

కన్ను తెరిచే ఉంది కంటి పాపే మాయం. కనురెప్ప వాల్చనేలేదు చూపు కత్తిరింపు సూది మందు సిరంజిలోనే మాయం. మందులేని సిరంజి సూది పోటు...

చేటు కాలము దాపురించగ

కన్ను తెరిచే ఉంది కంటి పాపే మాయం.

కనురెప్ప వాల్చనేలేదు చూపు కత్తిరింపు

సూది మందు సిరంజిలోనే మాయం.

మందులేని సిరంజి సూది పోటు. 

మనిషిలోని మానవత్వం మాయం. 


బెడ్డు నిజం రోగం నిజం చికిత్సే మాయ.

‘ఐసియు’ -చూస్తా బతికుంటే! వెంటిలేటర్ పై

ఒంటరి ఏకాంత చికిత్స. వైద్యమే పడకేసింది 


సహాయకుల కళ్ళకు గంతలు నక్షత్రాల

ఆసుపత్రాయే, చుక్కలు మరి చూపించదూ!


చదువులు నిజం చికిత్సే అబద్ధం. 

బతుకు బొందలపాలు నిజం నిజం. 

ఇంకా ఇది కరోనా మాయేనంటావా మనిషీ!? 


మనిషితనం ఆనవాళ్ళు, డబ్బుపిచ్చి

మరుగుజ్జుల చేతిమీదుగా చితిమంటల పాలు.

శవాల మీద చిల్లరేరుకోవటం నాటు,

శవాల మీద వ్యాపారం చేయటం నీటు. 


నోట్లో మట్టి కొట్టి నోట్లకట్టలు కొట్టేయ్!

బంగారు కాసులు వరహాలు 


వెండి రూకలు కార్షపణాలు కాగితకరెన్సీ, 

డెబిట్ క్రెడిట్ ఆన్లైన్ కరెన్సీ ప్రవాహం! 

సరస్వతీ నదీ గమనం నేర్చుకుంది లక్ష్మి 


కూర్చున్న కొమ్మనే కాదు, బతుకు చెట్టునే

కూల్చేసుకున్న మనిషి, 

జాబిలిపై అంగారకుడిపై 

చెట్టులేని పిట్టలేని గూడుకట్టేస్తాడు మనిషి.


ఇల్లు కట్టకనే, నేల అమ్మేస్తాడు ఆకాశానికెగిసి,

రెక్కలు తెగిన పక్షిలా నేలపాలు అవుతాడు 

బుగ్గిపాలు కాకనే బూడిదౌతాడు 


అమ్మకం మొదలుపెట్టాక మనిషికి 

అమ్మ బొమ్మ ఒకటే! 

రండి.. మనిషిని బతికించుకుందాం 

కరోనా కబళించింది వీసమెత్తు.

మనిషి మంచితనం మృగ్యం అయిందా..

లోకం గడ్డకట్టిన లావా.

జీవిలేని జగత్తు ఎడారి. 

స్మశానం మరింకేదైనా!! 


మట్టిని కాపాడుకుందాం.

చెట్టునూ పిట్టనూ పుట్టనూ, 

నీటిని గాలిని కాపాడుకుందాం 

పంచభూతాలు సమంగా ఉంటేనే 

మనిషి అస్తిత్వం పదిలం. 


రోగాలు వస్తాయి పోతాయి 

మనిషిని రక్షించుకుంటే 

మనిషికి ప్రాణం పోసినట్లే. 

మల్లేశ్వరరావు ఆకుల

Updated Date - 2021-05-05T05:37:29+05:30 IST