ఏఎంసీలో సెస్‌.. లెస్‌..!

ABN , First Publish Date - 2022-04-27T05:52:56+05:30 IST

వ్యాపార రంగంలో జిల్లాలోనే కాదు.. రాయలసీమలోనే పేరున్న పట్టణం ప్రొద్దుటూరు. ఇలాంటిచోట సెస్‌లు, పన్నుల వసూళ్లతో ఆర్థిక పరిపుష్టి సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఏఎంసీలో సెస్‌.. లెస్‌..!
ప్రొద్దుటూరు మార్కెట్‌యార్డు కార్యాలయం

వ్యాపారులు ఇస్తేనే.. వసూళ్లు..!

చేయి తడిపితే సెస్‌లు ఉండవు

నిఘాలు, తనిఖీలు నామమాత్రమే

ప్రొద్దుటూరులో ఇదీ పరిస్థితి


ప్రొద్దుటూరు, ఏప్రిల్‌ 26: వ్యాపార రంగంలో జిల్లాలోనే కాదు.. రాయలసీమలోనే పేరున్న పట్టణం ప్రొద్దుటూరు. ఇలాంటిచోట సెస్‌లు, పన్నుల వసూళ్లతో ఆర్థిక పరిపుష్టి సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారులు తమ వ్యాపార నివేదికలు సమర్పిస్తే తప్ప వాటి ఆధారంగా మార్కెట్‌యార్డు సిబ్బంది సెస్సు వసూలు చేయని పరిస్థితి ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)లో నెలకొంది. చేయి తడిపితే ఆ సెస్సు కూడా ఉండదనే ఆరోపణలున్నాయి.

వ్యవసాయ అనుబంధ రంగాలకు ఏఎంసీల ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. వ్యవసాయ దిగుబడులను కొనుగోలు చేసే వ్యాపారులు ఏఎంసీలకు సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు సెస్సు చెల్లించిన తర్వాతనే సరుకు తరలించాల్సి ఉంటుంది. పన్నులు చెల్లించారా లేదా అనేది పరిశీలించేందుకు పట్టణం వెలుపల పలుచోట్ల ఏఎంసీ తనిఖీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ధనియాల క్రయవిక్రయాలు వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. నెలకు ఎంత మేర వ్యాపారం సాగుతుంది, ఎన్ని లోడ్లు బయటకు వెళుతున్నాయనేది ఎక్కడా లెక్కలు ఉండవు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ర్టానికి లోడ్లు వెళ్లే క్రమంలో ఒక చోట మాత్రమే సెస్సు చెల్లిస్తున్నారు. స్థానికంగా వసూలు చేయడం కుదరదు అనే సాకును చూపి సెస్సు ఎగ్గొట్టే వ్యాపారులకు ఏఎంసీ సిబ్బంది సహకరిస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ప్రొద్దుటూరు ఏఎంసీ పరిధిలో ధనియాల కొనుగోలుదారులు ఎంత మంది ఉన్నారు, ఎంత మేర సెస్సు వసూలు అవుతుందనే విషయాలు కూడా స్థానిక అధికారులు చెప్పలేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. కేవలం వ్యాపారులు తాము ఇంతమేర వ్యాపారం చేశామని స్వయంగా నివేదిస్తే, దాని ఆధారంగా సెస్సు వసూలు చేస్తున్నట్లు ఏఎంసీ సిబ్బంది చెబుతున్నారు.


చేయి తడిపితే...

ఏఎంసీలోని సిబ్బంది చేయి తడిపితే సెస్సు చెల్లించాల్సిన అవసరం ఉండదనే ఆరోపణలు లేకపోలేదు. స్థానిక మార్కెట్‌ యార్డులో ప్రతి శనివారం పశువుల సంత నిర్వహిస్తారు. రెండేళ్లుగా కరోనా కారణంగా సంతను తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి ఈనెల 23వ తేదీ నుంచి సంత ప్రారంభమైంది. జీవాల క్రయ విక్రయాలు మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం జీవాల కొనుగోలు ఆధారంగా ఒకశాతం సెస్సు చెల్లించాల్సి ఉంది. కానీ ఏఎంసీ సిబ్బంది తక్కువ మొత్తాన్ని తీసుకుని జేబులు నింపుకుంటున్నారే తప్ప సెస్సు వేసిందే లేదనేది ఆరోపణ.


కొరవడిన నిఘా

ఫ ప్రొద్దుటూరు పట్టణంలో రైస్‌ మిల్లులపై మార్కెటింగ్‌ సిబ్బంది నిఘా కొరవడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏఎంసీలో నలుగురు సూపర్‌వైజర్లు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి ఆరు రైస్‌మిల్లుల బాధ్యత అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఏ మిల్లులో ఎంత మేర బియ్యం ఆడిస్తున్నారు.. అందులో రైతులవి ఎన్ని, వ్యాపారులవి ఎన్ని అనేది తనిఖీ చేసి తగిన మేర సెస్సు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని మూసివేశారని, మరికొన్ని లీజులలో నడుస్తున్నాయనే కారణం చూపుతూ సిబ్బంది ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

ఫ ఇక స్థిరంగా ఆదాయాన్ని అందించే గోదాముల విషయానికొస్తే ప్రొద్దుటూరు మార్కెట్‌యార్డులో 13 గోదాములు ఉన్నాయి. రైతులు, వ్యాపారులు పంట ఉత్పత్తులను వీటిలో నిలువ ఉంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎనిమిది గోదాములు అద్దెకు ఇవ్వగా మరో అయిదు గోదాములు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఒక్కో గోదాము విస్తీర్ణం వేల అడుగుల్లో ఉంటుంది. ఇవన్నీ బాడుగలకు ఇస్తే నెలకు దాదాపు నాలుగైదు లక్షల రూపాయల మేర ఏఎంసీకి అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.


దృష్టి సారిస్తాం

- రాఘవేంద్రరావు, కార్యదర్శి, ప్రొద్దుటూరు ఏఎంసీ

ఎక్కడా అక్రమాలు జరగలేదు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరింతగా నిఘా ఉంచి  తగిన చర్యలు తీసుకుంటాం. ధనియాల క్రయ విక్రయాలకు సంబంధించి స్థానికంగా వ్యాపారం సాగిస్తేనే సెస్సు వసూలు ఉంటుంది. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఖాళీగా ఉన్న గోదాములకు త్వరలో టెండర్లు పిలువనున్నాం. రైస్‌ మిల్లులపై కూడా తనిఖీలు ముమ్మరం చేస్తాం.

  

Updated Date - 2022-04-27T05:52:56+05:30 IST