సిజేరియన్ కష్టం

ABN , First Publish Date - 2022-05-13T05:13:00+05:30 IST

ఆత్మకూరు క్లస్టర్‌ ఆస్పత్రికి కాన్పుకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని మహిళల అభిప్రాయం.

సిజేరియన్ కష్టం
ఆత్మకూరు ఏరియా ఆసుపత్రి

  1. గైనిక్‌ డాక్టర్‌ లేని ఆత్మకూరు వైద్యశాల
  2. ఆత్యవసరమైతే ప్రైవేట్‌ ఆసుపత్రులకే 
  3. ఇబ్బంది పడుతున్న నిరుపేదలు
  4. చెంచు మహిళల పరిస్థితి మరీ దారుణం


ఆత్మకూరు, మే 12:  ఆత్మకూరు క్లస్టర్‌ ఆస్పత్రికి కాన్పుకు వెళ్లడం  అంత శ్రేయస్కరం కాదని మహిళల అభిప్రాయం. సాధారణ కాన్పు అయితే పర్వాలేదు.  ఎంబీబీఎస్‌ వైద్యులు చేస్తున్నారు. ఒక వేళ సిజేరియన తప్పనిసరైతే గైనిక్‌ డాక్టర్‌ లేరు. ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల చాలా కాన్పుల్లో ఆపరేషన తప్పనిసరి అవుతోంది. అలాంటి గైనిక్‌ వైద్యులు లేని ఆస్పత్రికి వెళ్లితే ప్రాణం మీదికి వస్తుందని భయపడుతున్నారు.  


ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంది. కానీ క్షేత్ర స్థాయిలో ఇవేవీ అమలులోకి రావడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రుల్లో తగిన వసతులు ఉండటం లేదు. వసతులు ఉంటే వైద్యులు ఉండటం లేదు. ఆత్మకూరు క్లస్టర్‌ వైద్యశాల పరిస్థితి ఇదే.  ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన థియేటర్‌ ఉంది.  కానీ  నాలుగేళ్లుగా గైనకాలజిస్టు లేరు. దీంతో సిజేరియన్లు చేయడం లేదు. సాధారణ ప్రసవం కాకపోతే ఇక్కడున్న వైద్యులు చేతులెత్తేస్తున్నారు. జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నారు. దీంతో ముందస్తుగానే ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళుతున్నారు. అక్కడ సిజేరియన కాన్పంటే వేలాది రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోందని పేదలు ఆవేదన చెందుతున్నారు.  


సిజేరియన్లు లేకపోవడంతో : 

 ఆత్మకూరు క్లస్టర్‌ వైద్యశాలకు ఆత్మకూరు మున్సిపాలిటీతో పాటు పాములపాడు, కొత్తపల్లి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లోని సుమారు 77 గ్రామాలు, చెంచుగూడేల నుంచి గర్భిణులు వస్తుంటారు.   వారికి ఆస్పత్రిలో సురక్షిత కాన్పు చేయగలరనే నమ్మకం లేకుండా పోయింది. ఈ  వైద్యశాల పరిధిలో ప్రతి నెల 40కిపైగా సాధారణ కాన్పులు జరుగుతున్నట్లు  తెలుస్తోంది. సుమారుగా అంత మంది గర్భిణిలకు సిజేరియన అవసరం అవుతోంది. వాళ్లను వైద్యులు  జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈలోగా  ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అని  ముందుగానే ఇక్కడి వైద్యులు  కర్నూలుకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆసుపత్రి పరిధిలో రక్తనిధి కేంద్రం ఉన్నప్పటికీ అత్యవసర సమయాల్లో రక్తం  అందుబాటులో ఉండటం లేదు. 

వైద్యశాఖ శ్రద్ధ వహించాలి : 

ఆత్మకూరు క్లస్టర్‌ వైద్యశాలలో ఆపరేషన థియేటర్‌ ఉన్నా పరికరాలు, వైద్యులు, సిబ్బంది లేరు. ఈ సమస్యపై వైద్య శాఖ దృష్టి సారించాలి. కొంతకాలంగా ఆత్మకూరు క్లస్టర్‌ వైద్యశాలలో ప్రసవ కష్టాలు  వైద్యశాఖ దృష్టికి వెళ్లినా.. కంటి తుడుపు చర్యలతో సరిపెట్టుకుంటోంది. వాస్తవానికి సిజేరియన్లు చేయాలంటే థియేటర్‌తోపాటు అన్ని రకాల పరికరాలు ఉండాలి. ఇద్దరు గైనకాలజిస్టులు,  అనస్తీషియా వైద్యులు, పిల్లల డాక్టర్‌ ఉండాలి. అదనపు వైద్య సిబ్బందిని కూడా ఉండాలి. ఈ ఏర్పాట్లన్నీ ఉంటేనే  ఆపరేషన్లు సజావుగా జరుగుతాయని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. అయితే ఆత్మకూరు ఆసుపత్రికి గైనకాజిస్టులు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.  

శ్రీశైలం ఐటీడీఏ అధికారులైనా పట్టించుకోరా..? 

ఆత్మకూరు డివిజనలోని అన్ని మండలాల్లో చెంచుగూడేలు ఉన్నాయి. చెంచు గర్భిణిలు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యశాలకే వస్తున్నారు. వాళ్లకు సిజేరియన కాన్పు తప్పనిసరి అయితే ఆపరేషన్లు చేయించే విషయంలో ఐటీడీఏ అధికారులైనా చొరవ తీసుకోవాల్సి ఉన్నది. గతంలో పలువురు గిరిజన స్త్రీలకు  సిజేరియన అవసరమై  అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  స్థానిక వైద్యులు ఈ సమస్యను ఎన్నో ఏళ్ల నుంచి ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నారు. అయినా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.   నంద్యాల జిల్లాలోని నంద్యాల, డోన, బనగానపల్లి, ఆళ్లగడ్డ లాంటి పట్టణాల్లోని ప్రభుత్వ వైద్యశాలలు  సిజేరియన కాన్పులకు అనుకూలంగా ఉన్నాయి. చెంచులు ఎక్కువ మంది ఉన్న ఆత్మకూరు ఆస్పత్రిలో మాత్రం వైద్యులు లేరు. ఈ వైద్య కేంద్రంపట్ల వైద్య శాఖ నిర్లక్ష్యంపట్ల విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత వైద్యశాఖతోపాటు శ్రీశైలం ఐటీడీఏ అధికారులు స్పందించి ఆత్మకూరు క్లస్టర్‌ వైద్యశాలను అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. 


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం 

ఆత్మకూరు క్లస్టర్‌ ఆసుపత్రి పరిధిలో సిజేరియన ఆపరేషన్లు నిర్వహించేందుకు గైనకాజిస్టులను నియమించాలి. అలాగే అవసరమైన వసతులు   కల్పించాలి. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నాలుగేళ్లుగా గైనకాలజిస్టు పోస్టు ఖాళీగా ఉండటంతో సిజేరియన కాన్పులు చేయలేకపోతున్నాం.  

- డాక్టర్‌ వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ : 

Read more