గంటల్లోనే సర్టిఫికెట్లు

ABN , First Publish Date - 2022-05-19T05:13:23+05:30 IST

సిద్దిపేట నియోజకవర్గంలోని పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే వారి కోసం ఈనెల 5వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో ఉచిత మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. దరఖాస్తు సమర్పించిన నిమిషాల్లోనే విచారణ పూర్తయ్యి, ఒక్కరోజులోనే సర్టిఫికెట్లు జారీ అయ్యే విధంగా ప్రణాళిక రచించారు.

గంటల్లోనే సర్టిఫికెట్లు

ఉచిత మీసేవతో సత్ఫలితాలు

కుల, ఆదాయ, నివాస పత్రాల కోసం తప్పిన నిరీక్షణ

ఇప్పటికే వెయ్యికిపైగా జారీ 

మంత్రి నిర్ణయంతో ఉద్యోగ అభ్యర్థులకు సమయం ఆదా


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే18 : కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందాలంటే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రోజుల కొద్దీ ప్రదక్షిణలు చేయాల్సిందే. మీసేవలో దరఖాస్తు చేసి పది రోజులు గడిచినా పత్రాలు చేతికందడం గగనమే. ప్రస్తుతం వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంతో ఈ పత్రాలే అభ్యర్థులకు కీలకంగా మారాయి. వీటి కోసం తిరిగితే ప్రిపరేషన్‌ కుంటుపడుతుంది. ఈ సున్నితమైన విషయాన్ని గ్రహించిన మంత్రి హరీశ్‌రావు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లను అప్రమత్తం చేయడంతోపాటు సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఏకంగా ఉచిత మీసేవ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. 


ఉచితంగా 1006 సర్టిఫికెట్ల జారీ

సిద్దిపేట నియోజకవర్గంలోని పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే వారి కోసం ఈనెల 5వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో ఉచిత మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఐదు మండలాలకు సంబంధించిన వీఆర్‌ఏలకు ఇదే మొదటి ప్రాధాన్యతగా బాధ్యతలు అప్పగించారు. దరఖాస్తు సమర్పించిన నిమిషాల్లోనే విచారణ పూర్తయ్యి, ఒక్కరోజులోనే సర్టిఫికెట్లు జారీ అయ్యే విధంగా ప్రణాళిక రచించారు. మంత్రి హరీశ్‌రావు పీఏ రామచంద్రరావు ఎప్పటికప్పుడు ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఫలితంగా 10 రోజుల వ్యవధిలోనే ఈ కేంద్రం అందరికీ చేరువైంది.  ఉచిత మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటి వరకు 1006 సర్టిఫికెట్లను జారీ చేశారు. ఇందులో కుల, ఆదాయ, నివాసం, ఈడబ్ల్యుసీ, ఓబీసీ తదితర పత్రాలు ఉన్నాయి. దరఖాస్తు చేసిన గంటల్లోనే పత్రాలు చేతికందడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన వీఆర్‌ఏలు ఇదే కౌంటర్‌ వద్ద విధులు నిర్వహించడంతో పత్రాల జారీ సులభతరమైంది. దరఖాస్తు చేసిన వారికి అప్పటికప్పుడే ఆమోదం తెలిపి రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌కు సమాచారం ఇస్తున్నారు. ఆ లాగిన్‌లో గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే తహసీల్దార్‌ పత్రాన్ని జారీ చేస్తున్నారు. ఎక్కడైతే దరఖాస్తు చేశారో.. మళ్లీ అక్కడే సర్టిఫికెట్‌ను ప్రింట్‌ తీసుకుంటున్నారు. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరుగుతున్నది. ఇప్పటివరకు సిద్దిపేట పట్టణంలో 502 సర్టిఫికెట్లు, సిద్దిపేట అర్బన్‌ మండలంలో 168, సిద్దిపేట రూరల్‌లో 109, నంగునూరులో 80, చిన్నకోడూరులో 115, నారాయణరావుపేటలో 42 సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 


నిరుద్యోగులకు మంత్రి భరోసా..

నిరుద్యోగులకు ఉచితంగా సేవలు అందించడమేకానీ.. ఈ సర్టిఫికెట్లకు అవసరమైన డబ్బులను మంత్రి హరీశ్‌రావు తన సొంతంగా వెచ్చిస్తున్నారు. మీసేవ ద్వారా ఒక సర్టిఫికెట్‌ పొందాలంటే రూ. 45 చెల్లించాలి. ఇప్పుడు ఉద్యోగాల కోసం ఇంచుమించు నాలుగైదు సర్టిఫికెట్లు అవసరం పడుతున్నాయి. ఒక్కొక్కరికి రూ.200 పైగానే మేలు జరుగుతున్నది. ఇది పక్కనబెడితే కార్యాలయాల చుట్టూ సర్టిఫికెట్ల కోసం ప్రదక్షిణలు చేసే భారం తప్పింది. దీనంతటికీ మంత్రి హరీశ్‌రావు ఆలోచనే కారణం.


మూడు గంటల్లో మూడు సర్టిఫికెట్‌లు

నేను ఇటీవల నోటిఫికేషన్లు విడుదలైన ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాలనుకున్నాను. ఇందుకు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు కావాలి. గతంలో తీసుకున్నపుడు వారం పైగానే పట్టింది. కానీ ఇప్పుడు దరఖాస్తు చేసిన మూడు గంటల్లోనే మూడు సర్టిఫికెట్లు నా చేతికి వచ్చాయి. మంత్రి గారి ఆలోచన నాలాంటి ఎంతోమందికి ఉపయోగపడింది.           

- అర్చన, గుర్రాలగొంది


సమయం కలిసి వస్తుంది

చదువు పక్కనబెట్టి సర్టిఫికెట్ల కోసం తిరగాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మాలాంటి వారి కోసం ఉచితంగా మీసేవ ఏర్పాటు చేశారని తెలిసి ఇక్కడ దరఖాస్తు చేశాను. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. వెంటనే దరఖాస్తు పరిశీలించారు. అదే రోజు నాకు మూడు సర్టిఫికెట్లు జారీ చేశారు. హరీశ్‌రావు సార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.     

- నాగరాజు, మందపల్లి


Updated Date - 2022-05-19T05:13:23+05:30 IST