ప్రైవేటు రైళ్లలో టికెట్ల ధరలు ప్రైవేటు వ్యక్తులకే వదిలేసిన కేంద్రం

ABN , First Publish Date - 2020-09-18T22:16:48+05:30 IST

రైల్వే ధరలపై దేశం మొత్తం చాలా ఆసక్తి ఉంటుంది. ఇది చాలా సున్నితమైన అంశం కూడాను. దేశంలో ఎంతోమంది రైల్వేల్లో ప్రయాణిస్తుంటారు. ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మంది భారతీయులు

ప్రైవేటు రైళ్లలో టికెట్ల ధరలు ప్రైవేటు వ్యక్తులకే వదిలేసిన కేంద్రం

న్యూఢిల్లీ: పట్టాలపై త్వరలో ప్రైవేటు రైళ్లు పరుగెత్తనున్నాయి. అయితే ఈ రైళ్లలో టికెట్ల ధరలపై జరుగుతున్న చర్చకు కేంద్ర ప్రభుత్వం మొత్తానికి సమాధానం ఇచ్చింది. ప్రైవేటు రైళ్లలో టికెట్ల ధరలను ప్రైవేటు వ్యక్తులకే అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు రైళ్లు పరుగు ప్రారంభించే ముందు టికెట్ల ధరలను నిర్ణయించుకోవచ్చని, అది ఎంతనేది వారి ఇష్టమని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.


‘‘ప్రైవేటు వ్యక్తులు నడిపించే రైళ్లలో టికెట్ల ధరలు వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది’’ అని రైల్వే బోర్డు చైర్మెన్ వీకే యాదవ్ తెలిపారు. ప్రైవేటు సంస్థలకు ధరలు నిర్ణయించే స్వేఛ్చపై వీకే యాదవ్ మాట్లాడుతూ ‘‘బస్సులు, విమానాల్లో ప్రైవేటు సంస్థలు పని చేస్తున్నాయి. ఆయా రూట్లలో ధరలు నిర్ణయించే అధికారం ప్రైవేటు సంస్థలకే ఉంటుంది. మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’’ అని అన్నారు.


‘‘రైల్వే ధరలపై దేశం మొత్తం చాలా ఆసక్తి ఉంటుంది. ఇది చాలా సున్నితమైన అంశం కూడాను. దేశంలో ఎంతోమంది రైల్వేల్లో ప్రయాణిస్తుంటారు. ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మంది భారతీయులు ఒకే రోజు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశంలోని పేదలు ఎక్కువగా ఆశ్రయించేది కూడా రైల్వేనే. అయితే రైల్వేలో ఆధునీకరణ జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రతి స్టేషన్‌ను ఆధునిక పద్దతిలో తీర్చిదిద్దుతున్నారు’’ అని యాదవ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-18T22:16:48+05:30 IST