దైవాధీనం

ABN , First Publish Date - 2020-08-28T07:21:13+05:30 IST

జీఎస్టీ పరిహారాన్ని డిమాండ్‌ చేస్తున్న రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్‌ రెండు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు...

దైవాధీనం

  • జీఎస్టీ నష్టాలను ఇప్పుడు పూడ్చలేం
  • కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
  • కావాలంటే అప్పు ఇప్పిస్తాం తీసుకోండి
  • ఆర్బీఐ ద్వారా హేతుబద్ధ వడ్డీ ఒక మార్గం
  • ప్రభుత్వ బాండ్ల ద్వారా సమీకరణ మరో దారి
  • మీకేది కావాలో తేల్చుకుని 7రోజుల్లో చెప్పండి
  • రాష్ట్రాలకు కేంద్రం రెండు ప్రత్యామ్నాయాలు
  • కొవిడ్‌ను దైవఘటనగా అభివర్ణించిన నిర్మల
  • పన్ను రేట్లు పెంచే ప్రతిపాదన లేదని స్పష్టీకరణ
  • ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం: సిసోడియా
  • కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకివ్వాలి
  • ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోంది
  • ధ్వజమెత్తిన కాంగ్రెస్‌ నేతలు



జీఎస్టీ పరిహారాన్ని డిమాండ్‌ చేస్తున్న రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్‌ రెండు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. 


  1. కేంద్రమే రిజర్వు బ్యాంకుతో మాట్లాడి, హేతుబద్ధమైన వడ్డీ రేట్లకు.. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయిన రూ.97 వేల కోట్లను అప్పుగా ఇప్పించడం. ఈ మొత్తాన్ని అయిదు సంవత్సరాల తర్వాత కాంపెన్సేషన్‌ సెస్‌ వసూళ్ల నుంచి తిరిగి చెల్లించవచ్చునని నిర్మల  చెప్పారు. దీంతోపాటు రాష్ట్రాల రుణపరిమితిని మరో 0.5 శాతం మేర పెంచుకోవడానికి వీలు కల్పిస్తామన్నారు. 
  2. ఆర్‌బీఐతో సంప్రదించి రూ. 2.35 లక్షల కోట్ల జీఎస్టీ నష్టపరిహారాన్ని ప్రభుత్వ బాండ్ల ద్వారా సమీకరించే ఏర్పాటు. 


న్యూఢిల్లీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): అసలే కరోనా దెబ్బకు అతలాకుతలమైపోయి.. జీఎస్టీ పరిహారం సొమ్ము కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం చావు కబురు చల్లగా చెప్పింది. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం రూ.2.35 లక్షల కోట్ల మేర తగ్గిపోనుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడాన్ని ‘దైవ ఘటన’గా నిర్మల అభివర్ణించారు. గురువారం ఇక్కడ ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన జీఎస్టీమండలి 41వ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3 లక్షల కోట్ల మేర జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి ఉండగా.. జీఎస్టీ ఆదాయం రూ.65 వేల కోట్లదాకా ఉండబోతోందని కేంద్రం అంచనా వేసింది. అంటే, లోటు అంచనా.. అక్షరాలా రూ.2.35 లక్షల కోట్లు. నిర్మలా సీతారామన్‌ పేర్కొన్న లోటు ఇదే. అందులో రూ.97 వేల కోట్లు మాత్రమే వాస్తంగా జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడే లోటు అని, మిగతా లోటుకు కారణం కరోనాయేనని కేంద్రం చెబుతోంది. 


ఇదీ నేపథ్యం..

అంతకుముందున్న పన్ను వ్యవస్థ నుంచి 2017లో జీఎస్టీకి మారే క్రమంలో.. కొత్త (జీఎస్టీ) పద్ధతి వల్ల తమ ఆదాయానికి నష్టం కలుగుతుందని రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. దీనికి కేంద్రం.. మొదటి ఐదేళ్లలో జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు వాటిల్లే నష్టాన్ని తానే పూడుస్తానని హామీ ఇచ్చింది.

లగ్జరీ (విలాసవంతమైన విదేశీ కార్లవంటివి), సిన్‌ గూడ్స్‌ (పొగాకు, ఫాస్ట్‌ఫుడ్స్‌ వంటివాటి)పై జీఎస్టీకి అదనంగా సుంకాలను (కాంపెన్సేషన్‌ సెస్‌) ఐదేళ్లపాటు విధించి, జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ లోటును ఆ సొమ్ముతో పూడుస్తామని పేర్కొంది. ఇచ్చిన హామీ మేరకు.. ఆ పరిహారాన్ని రాష్ట్రాలకు ఆర్థిక సంవత్సరంలో ప్రతి రెండునెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తోంది. 2017-18, 18-19 ఆర్థిక సంవత్సరాల్లో ఈ పూల్‌ ద్వారా అదనపు ఆదాయం వచ్చింది కాబట్టి పరిహారం చెల్లించడం కేంద్రానికి పెద్ద సమస్య కాలేదు. కానీ, మూడో సంవత్సరం (2019-20)లో రూ.95,444 కోట్ల ఆదాయం వస్తే.. రాష్ట్రాలకు రూ.1.65 లక్షల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. అంటే, రూ.70 వేల కోట్ల లోటు. మొదటి రెండేళ్లలో వచ్చిన లాభాలతో మూడో ఏడాది లోటును పూడ్చారు. కానీ, నాలుగో ఏడాది.. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) ఆ అవకాశం లేకపోగా, పులిమీద పుట్రలా కొవిడ్‌ వచ్చి పడింది. దీంతో కేంద్రానికీ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ వల్ల పన్నుల వసూలు తగ్గిపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు విడతల (ఏప్రిల్‌-మే, జూన్‌-జూలై) పరిహారాన్ని ఇప్పటికీ చెల్లించలేదు.

అడుగుతుంటే ఇప్పుడు అప్పులు తీసుకోవాలని సూచిస్తోంది. కానీ, జీఎస్టీ విధానాన్ని అనుసరించడం వల్ల తమకు కలిగిన నష్టాన్ని.. ఇచ్చిన మాట ప్రకారం కేంద్రమే భరించాలని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రమేమో జీఎస్టీ వల్ల కలిగిన లోటును మాత్రమే (అంటే రూ.97 వేల కోట్లు) పూడుస్తానని.. కొవిడ్‌ వల్ల ఏర్పడిన మిగతా లోటును కూడా పూడ్చడం కుదరదని చెబుతోంది. నిర్మలా సీతారామన్‌ కొవిడ్‌ను ‘దైవఘటన’గా పేర్కొనడానికి కారణం ఇదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే, ఒకవేళ రాష్ట్రాలు పోరాటానికి దిగితే.. కేంద్రం ‘ఫోర్స్‌ మెజర్‌ (అనుకోని కారణాల వల్ల ఒక ఒప్పందాన్ని నెరవేర్చలేకపోవడం)’ క్లాజును అడ్డుపెట్టుకోవచ్చని వారు విశ్లేషిస్తున్నారు.


బీజేపీయేతర రాష్ట్రాల ఆగ్రహం..

జీఎస్టీ సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలన్నీ తమకు పరిహారాన్ని కేంద్రం వెంటనే చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేశాయి. కొవిడ్‌ వల్ల కలిగే నష్టాన్ని కేంద్రం చెల్లించనక్కర్లేదని అటార్నీ జనరల్‌ చెప్పిన అభిప్రాయంపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పరిహారం చెల్లించాలని అడుగుతుంటే అప్పులు చేయాలని సూచించడం సరైంది కాదన్నాయి. కేంద్రం తన బాధ్యత విస్మరిస్తోందని ధ్వజమెత్తాయి. గత సమావేశాల్లో ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ, ఇతర అఽధికారులు ఇచ్చిన హామీలను గుర్తు చేశాయి. మార్కెట్‌ నుంచి అప్పులు చేసుకుని సెస్‌ ద్వారా చెల్లించాలని సూచించడం సహకార సమాఖ్య స్ఫూర్తిని వంచించడమేనని ఢిల్లీ ఆర్థిక మంత్రి మనీశ్‌ సిసోడియా మండిపడ్డారు.

రూ.47వేల కోట్ల సెస్‌ వసూళ్లను కేంద్రం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు మళ్లించి.. రాష్ట్రాలకు మాత్రం అప్పులు చేసుకోవాలని సలహా ఇవ్వడం సరైంది కాదన్నారు. కేంద్రమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు పరిహారం చెల్లించే బాధ్యత తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఛత్తీ్‌సగఢ్‌, పుదుచ్చేరి, ఢిల్లీ, హరియాణా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు చెప్పారు. అప్పులు చేయడం కన్నా.. ఆదాయం పెంచే మార్గం చూడాలని గోవా ఆర్థిక మంత్రి సూచించారు. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ మాత్రం.. రాష్ట్రాలు అప్పులు చేయాలని చెప్పారు. కేంద్రం ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది.  గురువారంనాటి జీఎస్టీ కౌన్సిల్‌ భేటీతో తాము అసంతృప్తిగా ఉన్నామని.. కానీ, తమకు మరో మార్గం లేకపోయిందని కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్‌ అన్నారు. జీఎస్టీ చట్టంలోనే తీవ్ర లోపం ఉందని.. ఉత్పత్తి చేసే రాష్ట్రాలు దీంతో నష్టపోతుంటే, వినియోగించే రాష్ట్రాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి అన్నారు.


పన్ను రేట్లు పెంచబోమన్నా..

కొవిడ్‌-19 వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు పన్ను (జీఎస్టీ) రేట్లు పెంచే ప్రతిపాదనేది లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అయితే, జీఎస్టీ పరిహారం లోటును పూడ్చడం కోసం రాష్ట్రాలకు ఇప్పించే రుణాలపై వడ్డీని, అసలును కాంపెన్సేషన్‌ సెస్‌ నుంచే చెల్లించనున్నట్టు తెలిపారు. 2017లో  జీఎస్టీని అమల్లోకి తెచ్చినప్పుడు ఈ కాంపెన్సేషన్‌ సెస్‌ను ఐదేళ్లపాటు వసూలు చేయనున్నట్టు చెప్పారు. గురువారం జీఎస్టీ మండలిలో కేంద్రం తెలిపిన ప్రకారం.. రాష్ట్రాలకు ఇప్పించే అప్పును, వడ్డీని సెస్‌ నుంచే చెల్లించడమంటే 2022 తర్వాత కూడా ఈ కాంపెన్సేషన్‌ సెస్‌ కొనసాగుతుందని అర్థం. దీనిపై మార్కెట్‌ నిపుణులు పెదవి విరుస్తున్నారు. సుంకాల విధింపును ఐదేళ్ల తర్వాత కూడా కొనసాగిస్తే.. అదే అలవాటుగా మారిపోతుందని డెలాయిట్‌ ఇండియా భాగస్వామి ఎంఎస్‌ మణి ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, సెస్‌ విధింపు గడువును కొద్దికాలానికే పరిమితం చేయాలని, అసలు ఎంతకాలం విధిస్తారో ముందే నిర్ణయించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-08-28T07:21:13+05:30 IST