సురక్షిత రక్త దానానికి కేంద్రం మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2020-04-10T02:32:13+05:30 IST

మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రజలు గుమిగూడకూడదని, ఒకరికొకరు దూరంగా ఉండాలని

సురక్షిత రక్త దానానికి కేంద్రం మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రజలు గుమిగూడకూడదని, ఒకరికొకరు దూరంగా ఉండాలని నిబంధనలు పేర్కొంటున్న నేపథ్యంలో సురక్షిత రక్తం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్ (ఎన్‌బీటీసీ) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి వేధింపుల నేపథ్యంలో తగినంత సురక్షిత రక్తాన్ని అందుబాటులో ఉంచవలసిన అవసరం గురించి వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి వినతులు రావడంతో ఈ మార్గదర్శకాలను రూపొందించారు. 


ఎన్‌బీటీసీ డైరెక్టర్ డాక్టర్ శోభిని రంజన్ అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలకు, స్టేట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్స్‌కు మార్గదర్శకాలు జారీ చేశారు. అవసరాలకు తగినట్లుగా సురక్షిత రక్త నిల్వలను నిర్వహించాలని కోరారు. రక్తానికి, బ్లడ్ కాంపొనెంట్స్‌కు డిమాండ్ కొనసాగుతోందని, మరీ ముఖ్యంగా ప్రాణాలను కాపాడటానికి రక్త మార్పిడి అవసరమైన సందర్భాల్లో సురక్షిత రక్తం అవసరమని తెలిపారు. ఈ అవసరాలను తీర్చేందుకు తగినంత సురక్షిత రక్తాన్ని దేశంలోని లైసెన్స్ పొందిన బ్లడ్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. 


అత్యంత అప్రమత్తతతో, జాగ్రత్తగా రక్తాన్ని సేకరించాలని తెలిపారు. స్వచ్ఛందంగా రక్తాన్ని ఇచ్చేవారి నుంచి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటిస్తూ, రక్తాన్ని సేకరించాలని పేర్కొన్నారు. రక్తదాతలు కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తమకు వైరస్ సోకుతుందనే భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. రక్తాన్ని దానం చేయడానికి బ్లడ్ సెంటర్లకు, రక్తదాన శిబిరాలకు రక్తదాతలు రాకపోతే, అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. తలసేమియా, ఎనీమియా రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు వంటివారికి రక్తం అత్యవసరమని తెలిపారు. 


కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్ళి, వచ్చినవారు, కోవిడ్-19 నిర్థరణ అయిన వ్యక్తితో కలిసినవారు, కోవిడ్-19 సోకినట్లు అనుమానించదగినవారితో కలిసినవారు, కోవిడ్-19 రోగులు రక్తదానం చేయడానికి వస్తే, వారి నుంచి రక్తం స్వీకరించరాదని ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 


ఒకరికొకరు దూరంగా ఉండాలన్న నిబంధనను, ఇన్ఫెక్షన్ నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తూ, ఇన్ హౌస్, ఔట్‌డోర్ బ్లడ్ డొనేషన్ కార్యకలాపాలను కొనసాగించవచ్చునని తెలిపారు. 


Updated Date - 2020-04-10T02:32:13+05:30 IST