వ్యాక్సిన్‌ విధానంలో వివక్ష: విపక్షం

ABN , First Publish Date - 2021-04-21T07:11:44+05:30 IST

వ్యాక్సిన్‌ పంపిణీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. వ్యాక్లిన్ల తయారీదారుల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చనీ, ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, కంపెనీలు ఎవరైనా వ్యాక్సిన్‌ ల్యాబ్‌లను సంప్రదించవచ్చనీ...

వ్యాక్సిన్‌ విధానంలో వివక్ష: విపక్షం

  • ఒక దేశం.. ఒకటే ధర ఉండాలి: కాంగ్రెస్‌
  • వలస కూలీల అకౌంట్లలో నగదు వేయండి
  • ప్రధాని మోదీకి రాహుల్‌, ప్రియాంక విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సిన్‌ పంపిణీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. వ్యాక్లిన్ల తయారీదారుల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చనీ, ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, పారిశ్రామిక సంస్థలు,  కంపెనీలు ఎవరైనా వ్యాక్సిన్‌ ల్యాబ్‌లను సంప్రదించవచ్చనీ కేంద్రం చేసిన ప్రకటనపై దుమ్మెత్తిపోశాయి. ‘‘18 నుంచి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ దొరకదు. ధరపై నియంత్రణ లేకుండా దళారులను కేంద్రమే దింపేసింది. ఫలితం.. నిమ్న వర్గాలకు వ్యాక్సిన్‌ దొరికే అవకాశమే లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్‌ సరఫరా వ్యూహం కాదు.. వివక్ష’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఆంక్షలతో స్వస్థలాలకు వెళ్లిపోతున్న కూలీల ఖాతాల్లో కేంద్రం నగదు జమ చేసి ఆదుకోవాలని ప్రధానికి ట్వీట్‌ చేశారు. ‘పరిస్థితులు చూస్తుంటే మళ్లీ లాక్‌డౌన్‌ లాంటి కఠినచర్యలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. కానీ శ్రామికులను వాళ్ల ఖర్మానికి వాళ్లను వదిలేశారు. విధానాలంటే ప్రతీ ఒక్కరికీ సాయం అందించేలా ఉండాలి’ అని మరో అగ్రనేత ప్రియాంక పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆక్సిజన్‌ ఉత్పత్తిదారు మనమే. కానీ సరఫరా వ్యూహం లేదు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమిది’’ అని ఆమె ధ్వజమెత్తారు.


‘‘విదేశాలకు పంపేయడం వల్ల దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉంది. ఇదీ మోదీ ఘనత.  రాష్ట్రాలు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం చెబుతోంది. అంతా విదేశాలకు తరలిపోయాక మనకేదీ?’ అని  బెంగాల్‌ సీఎం మమత దుయ్యబట్టారు. ‘‘ఇది కేంద్రం సృష్టించిన మహా సంక్షోభం. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచకుండా ఇపుడు రాష్ట్రాలపైకి నెపం నెట్టేయడం దారుణం. ధరలను నియంత్రించలేదు. ఇది పేదలకు అందకుండా చేసే యత్నం. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం’ అని సీపీఎం విరుచుకుపడింది. సవరించిన విధానం వల్ల వ్యాక్సిన్‌ కొనుగోలుకు సంబంధించి రాష్ట్రాలపై కేంద్రం పెనుభారం మోపుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఇది తయారీదారుల లాభార్జనను ప్రోత్సహించేలా ఉందని చిదంబరం విమర్శించారు. జైరాం రమేశ్‌ మాట్లాడుతూ..‘‘ఒకే దేశం- ఒకే వ్యాక్సిన్‌ ధర ఎందుకు ఉండకూడదు..?’’ అని ప్రశ్నించారు.


Updated Date - 2021-04-21T07:11:44+05:30 IST