Special Story: ఎక్కడుంది సమానత్వం.. చట్ట సభల సాక్షిగా బయటపడిన చేదు నిజం..

ABN , First Publish Date - 2022-08-04T04:40:32+05:30 IST

మన దేశంలో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వాలు ఊదరగొడుతుంటాయి. రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు పాటుపడుతున్నామని..

Special Story: ఎక్కడుంది సమానత్వం.. చట్ట సభల సాక్షిగా బయటపడిన చేదు నిజం..

ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వాలు ఊదరగొడుతుంటాయి. రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు పాటుపడుతున్నామని గొప్పలకు పోతుంటాయి. కానీ.. వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. చట్ట సభల సాక్షిగా ఈ చేదు నిజం మరోసారి మహిళా లోకాన్ని వెక్కిరించింది. మహిళా సాధికారత విషయంలో పాలకుల మాటలన్నీ నీటి మూటలేనని ఉభయ సభల సాక్షిగా తేటతెల్లమైంది. బుధవారం నాడు చట్ట సభల్లో లింగ సమానత్వానికి సంబంధించిన ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఇందులో భాగంగా.. రాజ్యసభలో ఎంపీ రాకేష్ సిన్హా కేంద్ర సాయధ బలగాల్లో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలపై ప్రశ్నలు సంధించారు. కేంద్ర సాయుధ బలగాల్లో ప్రస్తుతం ఎంతమంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారో, CAPF లో మహిళల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రశ్నలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వివరణ ఇచ్చారు. CAPF లో విధులు నిర్వహిస్తున్న మహిళల సంఖ్యను బయటపెట్టారు. ఈ గణాంకాలు కేంద్ర సాయుధ బలగాల్లో ఎంత తక్కువ సంఖ్యలో మహిళలు విధులు నిర్వహిస్తున్నారో చెప్పకనే చెప్పేశాయి. మహిళలకు కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో ఏ మేరకు ప్రోత్సాహం లభిస్తుందో కళ్లకు కట్టాయి. CRPF లో 9,454, BSF లో 7,391, CISF లో 9,320, ITBP లో 2,518, SSB లో 3,610, AR లో 1,858.. మొత్తంగా చూసుకుంటే కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్న మహిళల సంఖ్య 34,151. మహిళలకు అన్ని రంగాల్లో ఎంతగానో అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాల మాటలు ఎంత సత్యదూరంగా ఉన్నాయో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.



సీఆర్‌పీఎఫ్‌లోని కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల్లో ((CRPF Constable Jobs) మహిళలకు 33 శాతం రిజర్వేషన్, సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీలో మహిళలకు 14 నుంచి 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2016 జనవరిలో తీర్మానించడం జరిగిందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన గణాంకాల ప్రకారం చూసుకుంటే కేంద్ర సాయుధ బలగాల సామర్థ్యం 10 లక్షలు. ఈ 10 లక్షల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంటే.. దాదాపు మూడు లక్షల ముప్పై వేల పోస్టులు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ.. ఇందులో కనీసం 10 శాతం కూడా మహిళలు విధులు నిర్వర్తించడం లేదంటే.. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో ఏమేరకు మహిళలకు అవకాశం కల్పిస్తున్నారో తెలిసిపోతుంది. 3,30000 మంది మహిళలకు అవకాశం ఉన్నచోట 34,151 మంది మహిళలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి. ఈ పరిణామం మహిళలకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాల తీరును నిగ్గదీసి ప్రశ్నిస్తోంది. అయితే.. అర్హులైన మహిళలను కేంద్ర సాయుధ బలగాల వైపుగా అడుగులేసే విధంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ప్రింట్/ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నియామకాలపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నామని, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజును కూడా మినహాయించామని చెప్పారు. పురుష అభ్యర్థులతో పోల్చుకుంటే CAPF నియామకాల్లో మహిళా అభ్యర్థులకు ఫిజికల్ స్ట్రాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) సడలింపులు ప్రకటించామని తెలిపారు. మెటర్నటీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్ వెసులుబాటు కూడా CAPF లో పనిచేసే మహిళలకు ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. మంత్రి మహిళలకు ఇన్ని వెసులుబాటులు ఉన్నాయని చెప్పినప్పటికీ ఆ మినహాయింపులో, సడలింపుల్లో పారదర్శకత ఎంతవరకూ ఉందో సందేహమే. ఇది పాలకులు జీర్ణించుకోలేని వాస్తవం.



కేవలం కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనే కాదు భారతీయ రైల్వే శాఖ పరిధిలోని ఉద్యోగాల్లోనూ లింగ సమానత్వం ఏ కోశానా లేదని లోక్‌సభలో కేంద్రం చేసిన ప్రకటన ఆధారంగా తేలిపోయింది. ఐయూఎంఎల్ (Indian Union Muslim League) ఎంపీ ఈటీ మహ్మద్ బషీర్ లోక్‌సభలో కేంద్రానికి ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నను లేవనెత్తి సమాధానం కోరారు. రైల్వే శాఖలోని ఉద్యోగాల్లో కూడా లింగ సమానత్వం ఏమాత్రం కనిపించడం లేదని, లింగ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని.. ప్రభుత్వం రైల్వే శాఖలో ఉన్న ఈ లింగ అసమానతను రూపుమాపడానికి ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని రైల్వే శాఖను అడిగారు. ఈ ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. 2021 మార్చి 31 నాటికి రైల్వే శాఖలో పనిచేస్తున్న మొత్తం మహిళల సంఖ్య 98,540 అని.. రైల్వే శాఖలో మొత్తం 12,52,347 మంది మహిళలకు విధులు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. అంటే.. రైల్వే శాఖ మొత్తం ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం 7.87 శాతానికే పరిమితమైందని మంత్రి అంగీకరించారు.



ఆర్‌పీఎఫ్‌లో 3 శాతం మాత్రమే మహిళలు పనిచేస్తున్నారని, 2018లో 8619 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు, 1121 ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని.. ఇందులో 4216 కానిస్టేబుల్ పోస్టులను (దాదాపు 49 శాతం), 301 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను (దాదాపు 27 శాతం) రిజర్వేషన్‌లో భాగంగా మహిళలకు కేటాయించడం జరిగిందని.. ఆర్‌పీఎఫ్‌లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో ఆ స్థాయిలో రిజర్వేషన్ కల్పించడం జరిగిందని రైల్వే మంత్రి చెప్పారు. 2018లో ఆర్‌పీఎఫ్‌లో 3 శాతంగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 9 శాతానికి పెరిగిందని తెలిపారు. రైల్వే శాఖలోని వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించేందుకు చొరవ చూపుతున్నట్లు మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వారిని రైల్వే ఉద్యోగాల వైపు ప్రోత్సహించే విధంగా మాత్రం అడుగులు పడటం లేదన్నది వాస్తవం.



రైల్వేలోని లోకో పైలట్లు, రైల్వే గార్డులు, ట్రాక్‌మెన్, పోర్టర్ల వంటి ఉద్యోగాల్లో మహిళలకు అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పక తప్పదు. మహిళల భద్రత దృష్ట్యా కఠినతరమైన ఈ ఉద్యోగాల్లో వారికి అవకాశం కల్పించలేమని రైల్వే బోర్డు గతంలో చేసిన ప్రకటన మహిళలకు రైల్వే ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయానికి తార్కాణం. భద్రత సాకుతో మహిళలకు ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసేలా రైల్వే బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకుందని అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. మొత్తంగా చూసుకుంటే.. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో, రైల్వే ఉద్యోగాల్లో మహిళ ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. మహిళలకు ఉన్న అవకాశాలపై పాలకులు అవగాహన కల్పించకపోవడం ప్రధాన కారణమైతే.. కుటుంబపరంగా, సమాజపరంగా మహిళలకు ఉన్న బంధనాలు మరో కారణంగా చెప్పొచ్చు. చట్ట సభల సాక్షిగా మహిళా సాధికారత మాటలకే పరిమితమైన ముచ్చటనే విషయం మరోసారి నిరూపితమైంది.

Updated Date - 2022-08-04T04:40:32+05:30 IST