2026 వరకూ జాతీయ ఆయుష్ మిషన్ కొనసాగింపు.. కేంద్రం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-07-15T00:13:52+05:30 IST

నేషనల్ ఆయుష్ మిషన్‌ను (ఎన్ఏఎం) కేంద్ర స్పాన్సర్డ్ స్కీమ్‌గా 01-04-2021 నుంచి 31-03-2026 వరకూ..

2026 వరకూ జాతీయ ఆయుష్ మిషన్ కొనసాగింపు.. కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: నేషనల్ ఆయుష్ మిషన్‌ను (ఎన్ఏఎం) కేంద్ర స్పాన్సర్డ్ స్కీమ్‌గా 01-04-2021 నుంచి 31-03-2026 వరకూ కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.4,606 కోట్లు కేటాయిస్తారు. ఇందులో రూ.3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా కాగా, రూ.1607.30 కోట్లు రాష్ట్రాల షేర్ ఉంటుంది. 2014 సెప్టెంబర్ 15న జాతీయ ఆయుష్  మిషన్‌ను కేంద్రం ప్రారంభించింది. ఆయుష్ మిషన్‌పై కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.


నార్త్ ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసన్ (ఎన్ఐఈఎఫ్ఎం) పేరును నార్త్ ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసన్ రీసెర్చ్ (ఎన్ఈఐఏఎఫ్ఎంఆర్)గా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. కేవలం పేరు మార్పే కాకుండా ఎన్ఈఐఏఎఫ్ఎంఆర్ విస్తరణ కూడా జరుగుతుందని అన్నారు. నేషనల్ ఆయుష్ మిషన్ కొనసాగింపు ద్వారా ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ ఆరోగ్య పరిరక్షణా వ్యవస్థలు మరింత పటిష్టమవుతాయని, రీసెర్చ్‌ కొత్తపుంతలు తొక్కుతుందని చెప్పారు.


మిషన్ కొనసాగింపుతో మరిన్ని ప్రయోజనాలు

నేషనల్ ఆయుష్ మిషన్‌ను పొడిగించడం వల్ల మెరుగైన ఆయుష్ హెల్త్‌కేర్ సేవలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. మెరుగైన సౌకర్యాల కల్పనతో మందులు మరింతగా అందుబాటులోకి రావడం, సిబ్బంది మరింత సుశిక్షితులు కావడానికి దోహదపడుతుంది. ఆయుష్ విద్యా సంస్థలు సంఖ్య పెంచడం ద్వారా ఆయుష్ ఎడ్యుకేషన్ మెరుగవుతుంది. ఆయుష్ హెల్త్ కేర్ సిస్టమ్‌ ద్వారా చేపట్టే హెల్త్ ప్రోగ్రామ్‌ల ద్వారా అంటువ్యాధులు, క్రానిక్ వ్యాధులను తగ్గించడంపై మరింత దృష్టి సారించవచ్చు.


 

Updated Date - 2021-07-15T00:13:52+05:30 IST