కుమార్ విశ్వాస్‌కు Y కేటగిరి భద్రత

ABN , First Publish Date - 2022-02-20T00:07:23+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్‌కు 'వై' కేటగరి భద్రతను కేంద్రం శనివారంనాడు..

కుమార్ విశ్వాస్‌కు Y కేటగిరి భద్రత

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్‌కు 'వై' కేటగరి భద్రతను కేంద్రం శనివారంనాడు కల్పించింది. సీఆర్‌పీఎఫ్‌తో ఈ భద్రతా కవరేజ్ ఉంటుంది. కేజ్రీవాల్ ఖలిస్థాన్ అనుకూలవాది అని ఒక ఇంటర్వ్యూలో కుమార్ విశ్వాస్ ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో కుమార్ విశ్వాస్ ప్రాణాలకు ముప్పు తలెత్తే అవకాశాలపై కేంద్రం సమీక్ష జరిపి, ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆయనకు 'వై' కేటగిరి భద్రతను కలిపించింది.


కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నారని, అది కుదరకపోతే ఖలిస్థాన్ ప్రధాన మంత్రి అవాలనుకుంటున్నారని కుమార్ విశ్వాస్ ఇటీవల ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని పంజాబ్ సీఎం చన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, వీరంతా పంజాబ్‌ను విభజించాలని కలలుగంటున్నారని, అధికారంలో కొనసాగటం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సైతం వీరు సిద్ధమేనని ఆరోపించారు. వారి ఎజెండాకు, పాకిస్థాన్ ఎజెండాకు తేడా లేదన్నారు.


మరోవైపు, కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలను ఆప్ నేత రాఘువ చద్దా ఖండించారు. విశ్వాస్ ఆరోపణలన్నీ కట్టుకథలను, బురదచల్లే ప్రయత్నమని అన్నారు. ఎన్నికలకు ఒక రోజు ముందే ఈ విషయాలు ఆయనకు (విశ్వాస్) గుర్తొచ్చాయా అని నిలదీశారు. రాజ్యసభ సీటు ఇవ్వలేదనే అక్కసుతోనే ఆయన ఇలాంటి దుష్ప్రచారానికి దిగారని అన్నారు. కాగా, ముఖ్యమంత్రి సైతం విశ్వాస్ వ్యాఖ్యలను ఖండిచారు. తాను ఉగ్రవాదినైతే ఇన్నేళ్లూ ప్రధాని ఎలా ఊరుకున్నారని ప్రశ్నించారు. ''గత పదేళ్లలో 3 ఏళ్లు కాంగ్రెస్‌, 7 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉన్నాయి. మరి ఇంతకాలంగా ఈ ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా? ప్రభుత్వ నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? వీళ్ల మాటలు వింటుంటే నవ్వొస్తోంది. బహుశా నేను ప్రపంచంలోనే అత్యంత ‘తీపి’ ఉగ్రవాదిని కావచ్చు. ఎందుకంటే, ఆసుపత్రులు కట్టిస్తాను. పాఠశాలలు నిర్మిస్తాను. ప్రజల కోసం రోడ్లు వేయిస్తాను. ఉచిత విద్యుత్తు, నీటిని అందిస్తుంటాను'' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-02-20T00:07:23+05:30 IST